చదువుల కేంద్రాల చుట్టూ ‘రియల్‌ ఎస్టేట్‌’ బూమ్‌!

India’s student housing market is emerging as a promising real estate segment, driven by the expansion of higher education, rising student mobility and increasing demand for accommodation near educational institutions.

Aug 25, 2026 - 14:45
 0  4
చదువుల కేంద్రాల చుట్టూ ‘రియల్‌ ఎస్టేట్‌’ బూమ్‌!
india-student-housing-real-estate-market-2035
  • దేశంలో వేగంగా పెరుగుతున్న స్టూడెంట్‌ హౌసింగ్‌ మార్కెట్‌..
  • 2035 నాటికి 1.2 కోట్ల మంది విద్యార్థులకు వసతి అవసరం
దేశంలో ఉన్నత విద్య విస్తరిస్తుండటం, ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం, విదేశీ విద్య ఖర్చులు అధికం కావడం.. ఇవన్నీ కలిసి మరో కొత్త రియల్‌ ఎస్టేట్‌ విభాగానికి ఊతమిస్తున్నాయి. అదే స్టూడెంట్‌ హౌసింగ్‌. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించే, అన్ని సదుపాయాలతో నిర్వహించే వసతి గృహాలకు భవిష్యత్‌లో భారీ డిమాండ్‌ ఏర్పడనుందని నైట్‌ఫ్రాంక్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది. దీంతో విద్యా సంస్థల సమీపంలోని ప్రాంతాలు రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు కొత్త హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశముందని అంచనా వేస్తోంది.
భారత్‌లో 18–23 ఏళ్ల మధ్య వయసున్న వారు సుమారు 15.5 కోట్ల మంది ఉన్నారు. వీరిలో ప్రస్తుతం దాదాపు 5.3 కోట్ల మంది ఉన్నత విద్య చదువుతున్నారు. ఉన్నత విద్యలో ప్రవేశాలు, కోర్సుల సంఖ్య, విద్యార్థుల మొబిలిటీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంఖ్య 2035 నాటికి 7 కోట్లకు పైగాచేరే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో తరగతి గదులు, క్యాంపస్‌లు మాత్రమే కాదు.. వారికి సమీపంలో సరైన వసతి కల్పించే అవసరం కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా సొంత ఊళ్లకు దూరంగా వెళ్లి చదువుకునే విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కీలకంగా మారుతోంది.
 
2035 నాటికి 1.2 కోట్ల మందికి..
దేశంలో విద్య కోసం జరిగే వలసలు స్టూడెంట్‌ హౌసింగ్‌ డిమాండ్‌ను మరింత పెంచనున్నాయి. దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర వలసల్లో సుమారు 15–17 శాతం విద్య అవసరాల కారణంగానే జరుగుతున్నాయని నైట్‌ఫ్రాంక్‌ అంచనా వేసింది. విద్య కోసం రాష్ట్రాలు దాటి వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 2035 నాటికి 1.2 కోట్లకు పైగా విద్యార్థులకు వసతి అవసరం ఏర్పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ఇది స్టూడెంట్‌ హౌసింగ్‌ రంగానికి ఎంత పెద్ద మార్కెట్‌ ఏర్పడబోతోందో సూచిస్తోంది. ఇటీవలి కాలంలో విదేశీ విద్యకు అయ్యే ఖర్చులు గణనీయంగా పెరగడంతో పాటు పలు దేశాల్లో వీసా నిబంధనలు కఠినతరం కావడం కూడా దేశీయ విద్యా సంస్థలకు డిమాండ్‌ను పెంచుతోంది. దీంతో విద్యార్థులు భారత్‌లోనే ఉన్నత విద్యను అభ్యసించేందుకు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడుతోంది.
 అదే సమయంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుండటం కూడా స్టూడెంట్‌ హౌసింగ్‌కు కలిసొచ్చే అంశంగా నివేదిక పేర్కొంది. విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు, కొత్త ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పడే ప్రాంతాల్లో విద్యార్థుల కోసం నాణ్యమైన వసతి అవసరం మరింత పెరగవచ్చు.
 
సాధారణ హాస్టళ్లకు భిన్నంగా..
ఇప్పటివరకు విద్యార్థుల వసతి అంటే కాలేజీ హాస్టళ్లు, ప్రైవేటు హాస్టళ్లు, అద్దె గదులు, పీజీ వసతులే ప్రధానంగా ఉండేవి. అయితే ఇప్పుడు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫెషనల్‌ హౌసింగ్‌ వైపు మార్కెట్‌ కదులుతోంది. ఇలాంటి సదుపాయాల్లో సాధారణంగా భద్రత, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, భోజనం, హౌస్‌కీపింగ్‌, లాండ్రీ, స్టడీ ఏరియాలు, వినోద సదుపాయాలు వంటి సేవలను ఒకే చోట అందించే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులకు పిల్లల భద్రతపై నమ్మకం కలిగించడం, విద్యార్థులకు చదువుకు అనుకూల వాతావరణం కల్పించడం ఈ మోడల్‌ ప్రత్యేకత. విద్యార్థుల అవసరం నేరుగా విద్యా సంవత్సరాల చక్రంతో ముడిపడి ఉండటం స్టూడెంట్‌ హౌసింగ్‌కు ఒక బలమైన డిమాండ్‌ ఆధారాన్ని ఇస్తోంది. ప్రతి సంవత్సరం కొత్త విద్యార్థులు కాలేజీల్లో చేరడం, ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడం వల్ల విద్యా కేంద్రాల్లో వసతి అవసరం నిరంతరంగా ఉంటుంది.
అందువల్ల రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, సంస్థాగత పెట్టుబడిదారులు ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నారని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న నగరాలు, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెషనల్‌ కాలేజీలు, టెక్నికల్‌ క్యాంపస్‌ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రంగానికి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
 
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్‌లోనూ జోరు
ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ‘లివింగ్‌ సెక్టార్‌’లో పెట్టుబడులు గత దశాబ్దంలో భారీగా పెరిగాయి. నివేదిక ప్రకారం 2016 నుంచి 2025 మధ్య ఈ విభాగంలో పెట్టుబడులు దాదాపు మూడు రెట్లు పెరిగి 2,100 కోట్ల డాలర్లకు చేరాయి. భారత్‌ విస్తరిస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ, అనుకూలమైన జనాభా నిర్మాణం, పెరుగుతున్న విద్యార్థుల మొబిలిటీ కారణంగా ఈ వృద్ధి నుంచి ప్రయోజనం పొందే అవకాశముందని నివేదిక పేర్కొంది. భారత్‌లో ఉన్నత విద్యకు డిమాండ్‌ పెరుగుతున్న కొద్దీ విద్యార్థుల వసతి కూడా ఒక ప్రత్యేక రియల్‌ ఎస్టేట్‌ ఆస్తి తరగతిగా ఎదిగే అవకాశముంది.
విద్యా సంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, పెట్టుబడిదారులు.. ఇలా అనేక వర్గాలకు ఈ రంగం కీలకంగా మారనుంది. ‘దేశంలోని అనుకూల జనాభా నిర్మాణం, విస్తరిస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ, విద్యార్థుల పెరుగుతున్న మొబిలిటీ వంటివి ప్రొఫెషనల్‌గా నిర్వహించే స్టూడెంట్‌ హౌసింగ్‌కు స్థిరమైన డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలతో సంస్థాగత పెట్టుబడులు పెరిగి, నాణ్యమైన విద్యార్థి వసతి ప్రాజెక్టుల అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశం ఉంది’ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బైజాల్‌ పేర్కొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0