దేశంలో రికార్డు స్థాయికి ఆఫీస్‌ లీజింగ్‌

India’s office leasing market reached a record 61.06 million sq. ft. across seven major cities during January–September 2026, according to a JLL report.

Oct 28, 2026 - 05:18
Oct 28, 2026 - 06:03
 0  125
దేశంలో రికార్డు స్థాయికి ఆఫీస్‌ లీజింగ్‌
దేశంలో రికార్డు స్థాయికి ఆఫీస్‌ లీజింగ్‌. (Image for representational purpose only)
  • తొమ్మిది నెలల్లో 61.06 మిలియన్‌ చదరపు అడుగులు..
  • హైదరాబాద్‌లోనూ భారీగా పెరిగిన డిమాండ్‌

దేశంలోని వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2026 జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల స్థూల లీజింగ్‌ (గ్రాస్‌ లీజింగ్‌) 61.06 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది.

జనవరి–సెప్టెంబర్‌ కాలానికి సంబంధించి ఇదే అత్యధికమని జేఎల్‌ఎల్‌ (జేఎల్ఎల్) నివేదిక వెల్లడించింది. ప్రపంచ సామర్థ్య కేంద్రాలు (గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు–జీసీసీలు), సాంకేతిక సంస్థలు, బ్యాంకింగ్‌–ఆర్థిక సేవల కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలోనే కార్యాలయ స్థలాల లీజింగ్‌ 23.17 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది.

అంతకుముందు త్రైమాసికంలో వాయిదా పడిన ఒప్పందాలు మూడో త్రైమాసికంలో ఖరారు కావడంతో లీజింగ్‌ కార్యకలాపాలు పుంజుకున్నాయి. ఈ త్రైమాసికంలో లీజింగ్‌ అంతకుముందు మూడు నెలలతో పోలిస్తే 40.9 శాతం పెరిగింది.

జీసీసీలదే కీలక పాత్ర

విదేశీ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపుతుండటంతో జీసీసీలు కార్యాలయ స్థలాలకు ప్రధాన డిమాండ్‌ సృష్టిస్తున్నాయి. 2026 తొలి తొమ్మిది నెలల్లో ఈ కేంద్రాలు 26.2 మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 30.6 శాతం ఎక్కువ. మొత్తం లీజింగ్‌లో జీసీసీల వాటా 42.9 శాతంగా ఉంది. 2025 పూర్తి ఏడాదిలో జీసీసీలు లీజుకు తీసుకున్న స్థలంలో ఇప్పటికే 84 శాతానికి సమానమైన స్థలాన్ని ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే తీసుకోవడం గమనార్హం.

విదేశీ ప్రధాన కార్యాలయాలు కలిగిన సంస్థలు జనవరి–సెప్టెంబర్‌ మధ్య మొత్తం లీజింగ్‌లో 57.8 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ వాటా 62 శాతానికి చేరింది. గత ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం.

సాంకేతికత, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా, తయారీ తదితర రంగాల్లో అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తుండటం ఈ ధోరణికి కారణమని జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈఓ రాధా ధీర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: బకాయిలు చెల్లించలేదని డెలివరీలు, పనివాళ్ల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చా?

బెంగళూరు అగ్రస్థానం.. హైదరాబాద్‌కు రెండో స్థానం

జనవరి–సెప్టెంబర్‌ కాలంలో కార్యాలయ స్థలాల లీజింగ్‌లో బెంగళూరు 28 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, ముంబై, పుణె తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మూడో త్రైమాసికంలో బెంగళూరు వాటా 33.4 శాతంగా ఉండగా, హైదరాబాద్‌ 19.6 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ 18.1 శాతం, ముంబై 12.4 శాతం వాటాను నమోదు చేశాయి. తొమ్మిది నెలల కాలంలో హైదరాబాద్‌లో స్థూల లీజింగ్‌ 9.93 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం వృద్ధి.

నగరంలో ఐటీ, జీసీసీలు, ఇతర కార్పొరేట్‌ సంస్థల విస్తరణ కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ను పెంచుతోంది. కార్యాలయ స్థలాల వాస్తవ వినియోగంలో పెరుగుదలను సూచించే నికర శోషణ (నెట్‌ అబ్జార్ప్షన్‌)లోనూ హైదరాబాద్‌ కీలక స్థానంలో ఉంది.

జనవరి–సెప్టెంబర్‌ మధ్య దేశవ్యాప్తంగా నమోదైన నికర శోషణలో హైదరాబాద్‌ వాటా 21.4 శాతంగా ఉంది. బెంగళూరు 31.3 శాతంతో ముందుండగా, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ 14.5 శాతం, పుణె 13.9 శాతం వాటాను నమోదు చేశాయి.

ఇదీ చదవండి: భారత రియల్‌ ఎస్టేట్‌లో విదేశీ పెట్టుబడుల జోరు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0