ప్రీలాంచ్లో అమ్మేవారు..  ప్రాజెక్టుని పూర్తి చేయ‌లేరు!  

Hyderabad’s pre-launch apartment market is attracting buyers with low prices, but it also carries significant risks of project delays, funding gaps and financial disputes.

Sep 25, 2026 - 07:25
 0  9
ప్రీలాంచ్లో అమ్మేవారు..  ప్రాజెక్టుని పూర్తి చేయ‌లేరు!  
hyderabad-pre-launch-projects-risks
  •  తొంద‌ర‌ప‌డి మీ క‌ష్టార్జితాన్ని 
       వారి చేతిలో పోయ‌కండి..
  • రేటు ఆక‌ర్ష‌ణీయంగానే ఉంటుంది
  • కానీ, ప్రాజెక్టును పూర్తి చేయాలి క‌దా! 
  • మ‌ధ్య‌లోనే చేతులెత్తేసినా ఆశ్చ‌ర్య‌పోవ‌ద్దు
  • ప్రీలాంచ్‌లో క‌ట్టే సొమ్ము నిర్మాణానికి స‌రిపోదు
  • అదృష్టం బాగుంటే.. ఆరేడేళ్లలో పూర్త‌వుతుంది! 


ప్ర‌గ‌తిన‌గ‌ర్‌లో చ‌ద‌ర‌పు అడుక్కీ.. కేవ‌లం 4,799..
ఐడీఎల్ లేక్ వ‌ద్ద చ‌ద‌ర‌పు అడుక్కీ.. 5,500..
2.5 బీహెచ్‌కే ఫ్లాట్ ధ‌ర‌.. కేవ‌లం 74.25 ల‌క్ష‌లే..
ట్రిపుల్ బెడ్‌రూమ్‌.. 85 ల‌క్ష‌లు మాత్ర‌మే..!

కొల్లూరులో చ‌ద‌ర‌పు అడుక్కీ.. రూ.3500 మాత్ర‌మే
కూక‌ట్‌ప‌ల్లిలో మ‌రో సంస్థ ధ‌ర‌.. రూ.5,299
దుండిగ‌ల్‌లో కేవ‌లం రూ.3,999 మాత్ర‌మే..
మియాపూర్‌లో రూ.5,199కే ఫ్లాట్లు..

హైద‌రాబాద్లో కొంద‌రు బిల్డ‌ర్లు ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తుంటే.. ఎవ‌రికైనా ఇట్టే ఆకర్షితులౌతారు. త‌మ వ‌ద్ద ఉన్న సొమ్మంతా ఊడ్చీ ఆయా ఛాన‌ల్ పార్ట్‌న‌ర్ లేదా బిల్డ‌ర్ చేతిలో పోసేందుకు ఉవ్విళ్లూరుతారు. ఆ త‌ర్వాత ఆయా ప్రాజెక్టును పూర్తి చేయ‌క‌.. అందులో కొన్న‌వారికి చుక్క‌లు చూపిస్తారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లు కొన్న‌వారు అనేక ఇబ్బందుల్ని ప‌డుతున్నారు. ప్రీలాంచ్‌లో మీరు కొన్న త‌ర్వాత‌.. ఆయా ప్రాజెక్టుకు అనుమ‌తి రావ‌డానికే సుమారు ఏడాది నుంచి రెండేళ్లు అవుతుంది. మీరు గ‌మ‌నిస్తే కూక‌ట్‌ప‌ల్లిలో ప‌లువురు బిల్డ‌ర్లు రెండేళ్ల నుంచి ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను అమ్ముతున్నారు.

కానీ, ఇంత‌వ‌ర‌కూ ఒక్క ప్రాజెక్టు కూడా స్టార్ట్ అవ్వ‌లేదు. తాజాగా మ‌రికొన్ని సంస్థ‌లు ఇక్క‌డ ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను అమ్మే జాబితాలో చేరాయి. ఇదొక్క‌టే కాదు కొల్లూరు, వెలిమ‌ల, పాటి ఘ‌న‌పూర్‌, మెకిలా, కొండాపూర్, చందాన‌గ‌ర్‌, మియాపూర్‌, ప్ర‌గ‌తిన‌గ‌ర్‌, బాచుప‌ల్లి.. ఇలా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను ప‌లువురు బిల్డ‌ర్లు అమ్ముతున్నారు. దీని వ‌ల్ల జ‌రుగుతున్న న‌ష్టం ఏమిటంటే.. ఇలా ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డం వ‌ల్ల‌.. అదే ప్రాంతాల్లో టీజీ రెరా అనుమ‌తి పొందిన ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు అమ్ముడవ్వ‌డం లేదు. కొంద‌రు బిల్డ‌ర్లు, ఛాన‌ల్ పార్ట్‌న‌ర్లు చేస్తున్న ఇలాంటి మోస‌పూరిత చ‌ర్య‌ల వ‌ల్ల అంతిమంగా బ‌య్య‌ర్లే ఇబ్బందుల‌కు గుర‌వుతారు. 

ఏడేనిమిదేళ్ల క్రితం సాహితీ సంస్థ అమీన్‌పూర్‌లో ప్రీలాంచ్ ప్రాజెక్టును ప్ర‌క‌టించ‌గానే ఐటీ ఉద్యోగుల‌తో పాటు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లంతా వేలంవెర్రిగా వెళ్లి సొమ్ము క‌ట్టేశారు. సంచుల్లో సొమ్ము తీసుకెళ్లి వారి చేతిలో పోసి హ‌మ్మ‌య్య అని ఊపీరి పీల్చుకున్నారు. కానీ, మూడేళ్లు కాగానే అదే సాహితీ సంస్థ అలా కొన్నవారి గుండెల మీద గున‌పాన్ని కుచ్చేసింది. అందులో సొమ్ము పెట్టిన‌వారు ఇప్ప‌టికీ త‌మ సొమ్ములో కొంత మొత్త‌మైనా వెన‌క్కి వ‌స్తుందేమోన‌నే ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. కాబ‌ట్టి, కేవ‌లం ఫ్లాట్ ధ‌ర ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌ని చూసి.. ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను కొన‌కండి. 

ఎందుకంటే, టీజీ రెరా అనుమ‌తి రాక ముందు వ‌ర‌కూ.. అంటే, ఆరంభంలో రేటును చూపెట్టే అధిక శాతం మంది బిల్డ‌ర్లు ఊరిస్తారు. ఇలా వంద నుంచి ఐదు వంద‌ల మంది వ‌ద్ద సొమ్మంతా తీసుకున్నాక‌.. అందులో నుంచి కొంత మొత్తాన్ని భూయ‌జ‌మానికి, అనుమ‌తుల‌కు, పునాది స్థాయి నిర్మాణ ప‌నులు, మార్కెటింగ్ మ‌రియు అమ్మ‌కాల కోసం వెచ్చించాక‌.. బిల్డ‌ర్ చేతిలో పెద్ద‌గా ఉండ‌దు. ఆయా ద‌శ‌లో ప‌లు బ్యాంకులు, ప్రైవేటు సంస్థ‌ల నుంచి కోట్ల‌లో నిధుల్ని స‌మీక‌రించుకున్నా.. ఆయా సొమ్ము నిర్మాణం మ‌ధ్య స్థాయి వ‌ర‌కూ తీసుకెళ్ల‌డానికి స‌రిపోతుంది. ప్రాజెక్టు మ‌ధ్య‌లోకి వెళ్లిన త‌ర్వాత‌.. ఫ్లాట్ల అమ్మ‌కాలు పెద్ద‌గా జ‌ర‌గ‌వు కాబ‌ట్టి, నిర్మాణ ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంటాయి.

ఎందుకంటే, అదే ప్రాంతంలో మ‌రో కొంత‌మంది బిల్డ‌ర్లు ప్రీలాంచ్లో అమ్మ‌కాల్ని ఆరంభిస్తారు. కాబ‌ట్టి, బ‌య్య‌ర్లంతా ప్రీలాంచుల వైపే దృష్టి పెడ‌తారు. దీంతో, ఏం చేయాలో అర్థం కాక బిల్డ‌ర్ల త‌ల‌ప‌ట్టుకుంటారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్లో అధిక శాతం మంది బిల్డ‌ర్ల ప‌రిస్థితి ఇంతే దారుణంగా త‌యారైంది. ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను అమ్మేశారు. చేతికి సొమ్ము వ‌చ్చేసింది. వాటితో కావాల్సిన జ‌ల్సాల‌న్నీ బిల్డ‌ర్‌, అత‌ని కుటుంబ స‌భ్యులు చేసేశారు. ఇక ప్రాజెక్టును డెలివ‌రీ వ‌చ్చేసరికి, ఎక్క‌డ్లేని ఆల‌స్యం జ‌రుగుతూ ఉంటుంది.

అయినా, కొనుగోలుదారులు నోరు తెరిచి డెవ‌ల‌ప‌ర్ల‌ను నిల‌దీయ‌లేరు. మొత్తానికి, ప్రాజెక్టు మ‌ధ్య‌లోకి వ‌చ్చేస‌రికి, అందులో అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం అంత సులువు కాద‌నే విష‌యాన్ని ప్ర‌తిఒక్క ప్రీలాంచ్ బ‌య్య‌ర్ అర్థం చేసుకోవాలి. కాబ‌ట్టి, అధిక‌శాతం మంది ప్రీలాంచ్ బిల్డ‌ర్లతో ఎప్ప‌టికైనా స‌మ‌స్య‌గానే ఉంటుంది. కాబ‌ట్టి, ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలు ఎదురైనా ప్రాజెక్టును పూర్తి చేయ‌గ‌ల్గుతాడ‌నే న‌మ్మ‌కం బిల్డ‌ర్ మీద ఉంటే.. ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా నిర్ణ‌యం తీసుకోండి. కాక‌పోతే, ముందే అండ‌ర్ రైటింగ్ సెక్యూరిటీ నుంచి తీసుకోవాలి. 

ప్ర‌స్తుతం కూక‌ట్‌ప‌ల్లి, ప్ర‌గ‌తిన‌గ‌ర్, గుండిమైస‌మ్మ‌, కొల్లూరు, పాటి ఘ‌న‌పూర్‌, తెల్లాపూర్, మియాపూర్‌, చందాన‌గ‌ర్‌, ప‌టాన్‌చెరు వంటి ప్రాంతాల్లో ప్రీలాంచ్‌లో ఆకాశ‌హ‌ర్మ్యాన్ని క‌డుతున్నామంటూ ఎవ‌రైనా చెప్పినా.. మీరు ఏమాత్రం అందులో తీసుకోకండి. ఎందుకంటే, వీరంతా ఆయా సొమ్మును అదే ప్రాజెక్టుకు కాకుండా.. ఇత‌ర ప్రాజెక్టుల‌కు దారి మ‌ళ్లిస్తారు. కొంద‌రేమో భూయ‌జ‌మానుల‌కు సొమ్ము చెల్లించి.. ప‌ర్మిష‌న్ల‌కు వెళ్లే స‌రికి.. ఉన్న సొమ్మంతా అయిపోతుంది.

టీజీ రెరా ప‌ర్మిష‌న్ వ‌చ్చాక అందులో కొన‌డానికి బయ్య‌ర్లు పెద్ద‌గా రారు కాబ‌ట్టి... ఆయా ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతాయి. ప్రీలాంచ్‌లో కొన్న‌వారికి ఛాన‌ల్ పార్ట్‌న‌ర్ల‌తోనే ప‌రిచ‌యం ఉండ‌టం వ‌ల్ల‌.. బిల్డ‌ర్ల‌ను నేరుగా ప్ర‌శ్నించ‌లేరు. మొత్తానికి, ప‌దిహేనేళ్ల క్రితం నొయిడా, గుర్గావ్లో జ‌రిగిన‌ట్లే... హైదరాబాద్లో కూడా ప్రీలాంచ్ మోసాలు బారిగా పెరిగే ప్ర‌మాదం ఉంది. కాబ‌ట్టి, బ‌య్య‌ర్లు ప్రీలాంచ్లో కొనేట‌ప్పుడు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాలి. లేక‌పోతే, సొమ్ము క‌ట్టేసిన త‌ర్వాత మీరు ఎన్నేళ్లు పోరాటం చేసినా.. మీ సొమ్ము వెన‌క్కి రాద‌ని గుర్తుంచుకోండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0