జేఎన్టీయూ - హైటెక్ సిటీ ట్రాఫిక్‌కు కొత్త పరిష్కారం
Hyderabad is exploring a 7-km counterflow Bus Rapid Transit (BRT) corridor from JNTU to the Financial District via HITEC City and Raidurg to ease traffic congestion in the IT corridor.
నగరంలోని ఐటీ కారిడార్‌లో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఏడు కిలోమీటర్ల ప్రత్యేక బస్ కారిడార్‌ను ప్రతిపాదించారు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత సంస్థలు కలిసి రూపొందిస్తున్న ఈ ప్రణాళికకు కౌంటర్ఫ్లో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (బీఆర్టీ) విధానాన్ని పరిశీలిస్తున్నారు. సాధారణ ట్రాఫిక్‌కు వ్యతిరేక దిశలో బస్సులు ప్రయాణించేలా ప్రత్యేక లేన్ ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
ఈ లేన్‌ను బస్సులకే పరిమితం చేసి, ఇతర వాహనాలు ప్రవేశించకుండా నియంత్రణలు విధించనున్నారు. బస్సులు లేన్‌లోకి ప్రవేశించే, బయటకు వెళ్లే ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు, రాయదుర్గం మెట్రో స్టేషన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ కదలికలను ప్రత్యేకంగా పరిశీలించనున్నారు.
ఇదీ చదవండి: కమర్షియల్ స్పేస్ కొన్న సలీమ్ మర్చంట్
బస్సుల సంఖ్య పెంచే యోచన
ప్రస్తుతం ఈ కారిడార్‌లో గంటకు సుమారు 15 బస్సులు నడుస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక లేన్ అందుబాటులోకి వస్తే మరిన్ని బస్సులను నడిపే అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు.
బస్సులు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా ప్రయాణించేలా చేయడం ద్వారా ప్రజా రవాణాను మరింత సమర్థంగా నిర్వహించవచ్చని భావిస్తున్నారు.
ట్రాఫిక్‌కు ప్రధాన అడ్డంకులివే
ఫౌండేషన్ ఫర్ రిసోర్సెస్ అండ్ ఇన్నోవేషన్స్ పాలసీ (ఎఫ్ఆర్ఐపీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సమన్వయంతో నిర్వహించిన ట్రాఫిక్ అంచనాలో పలు సమస్యలను గుర్తించారు.
రోడ్ల పక్కన పార్కింగ్, ఆక్రమణలు, లేన్ క్రమశిక్షణ లేకపోవడం, అనధికారిక బస్ స్టాప్‌లు, జంక్షన్ల వద్ద రద్దీ ప్రధాన సమస్యలుగా తేలాయి. బస్ షెల్టర్లు, ఫుట్‌పాత్‌లు, పాదచారులకు అవసరమైన సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారు.
ఇంకా ప్రణాళిక దశలోనే..
మెక్సికో సిటీ మెట్రోబస్ వంటి అంతర్జాతీయ బీఆర్టీ వ్యవస్థలను పరిశీలిస్తూ, బస్ లేన్లు, స్టాప్‌లు, పాదచారుల సౌకర్యాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అయితే ఏడు కిలోమీటర్ల కౌంటర్ఫ్లో బస్ కారిడార్ ప్రస్తుతం ప్రతిపాదన, ట్రయల్ ప్రణాళిక దశలోనే ఉంది.
అమలు తేదీ, ప్రయాణ సమయం ఎంత తగ్గుతుందనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఐటీ కారిడార్‌లో బస్సుల ప్రయాణం మెరుగుపడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ చట్టంలో సమూల మార్పులు చేయాలి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0