జీసీసీల జోరుతో హైదరాబాద్‌కు కొత్త కళ

Hyderabad is rapidly emerging as a major Global Capability Centre (GCC) destination, with the city adding GCCs faster than Bengaluru, Pune and Chennai.

Sep 18, 2026 - 08:29
 0  7
జీసీసీల జోరుతో హైదరాబాద్‌కు కొత్త కళ
hyderabad-gcc-growth-commercial-real-estate
  • బెంగళూరును మించిన వేగం..
  • ఏడాదిలో మరో 50–70 కేంద్రాలు వచ్చే అవకాశం

 ఒకప్పుడు ఐటీ, ఐటీఈఎస్‌ రంగానికి మాత్రమే ప్రధాన కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌.. ఇప్పుడు గ్లోబల్‌ కంపెనీల వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలక గమ్యస్థానంగా ఎదుగుతోంది. గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) నగరంలో భారీగా ఏర్పాటవుతుండటంతో వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు కొత్త ఊపు వచ్చింది. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్‌లో మరో 50 నుంచి 70 కొత్త GCCలు ఏర్పడే అవకాశం ఉందని అనరాక్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ, ఫిక్కీ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం జీసీసీల సంఖ్య పరంగా బెంగళూరు ముందంజలో ఉంది. బెంగళూరులో 880కుపైగా జీసీసీలు ఉండగా.. హైదరాబాద్‌లో సుమారు 515, పుణెలో 475, చెన్నైలో 280కుపైగా కేంద్రాలు ఉన్నాయి. అయితే కొత్తగా జీసీసీలు ఏర్పాటు అవుతున్న వేగంలో మాత్రం హైదరాబాద్‌ మిగతా నగరాలను అధిగమించింది.

2025 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 70 కొత్త జీసీసీలు ఏర్పాటయ్యాయి. అదే సమయంలో బెంగళూరులో 30–35, పుణెలో 15–20, చెన్నైలో 12–15 కొత్త కేంద్రాలు మాత్రమే వచ్చాయి. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో మరో 50–70 కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, బ్యాంకింగ్‌-ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (బీఎఫ్ఎస్ఐ), లైఫ్‌ సైన్సెస్‌, అనలిటిక్స్‌, కన్సల్టింగ్‌, డిజిటల్‌ ఆపరేషన్స్‌ వంటి రంగాల సంస్థలు ఇందులో కీలకంగా ఉండనున్నాయి. 2026 మార్చి నాటికి హైదరాబాద్‌లో సుమారు 515 జీసీసీలు ఉండగా, వీటిలో 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జీసీసీలలో హైదరాబాద్‌ వాటా దాదాపు 20 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. దీంతో హైదరాబాద్‌ సంప్రదాయ సైబర్‌ హబ్‌ స్థాయి నుంచి ప్రపంచ కంపెనీలకు కీలకమైన జీసీసీ గమ్యస్థానంగా మారుతోందని విశ్లేషించింది.

నాలుగేళ్లలో రెట్టింపైన కార్యాలయ డిమాండ్‌

జీసీసీల రాకతో నగరంలోని ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. జీసీసీలను ఏర్పాటు చేస్తున్న విదేశీ సంస్థలు 2021లో హైదరాబాద్‌లో 1.9 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజ్‌కు తీసుకోగా.. 2025 నాటికి అది 4.5 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది. 2026 తొలి ఆరు నెలల్లోనే జీసీసీలకు సంబంధించిన లీజింగ్‌ 3 మిలియన్‌ చదరపు అడుగులు దాటింది. తొలి అర్ధభాగంలోనే జీసీసీ ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం 3.05 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. హైదరాబాద్‌ ఇక కేవలం తక్కువ ఖర్చుతో ఉద్యోగులను అందించే నగరం మాత్రమే కాకుండా, ప్రపంచ కంపెనీల పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధి, సాంకేతిక నిర్ణయాలు, ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతోంది.

రియల్‌ ఎస్టేట్‌కు భారీ ప్రయోజనం

జీసీసీల విస్తరణకు అనుగుణంగా హైదరాబాద్‌ వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కూడా విస్తరించనుంది. ప్రస్తుతం నగరంలో సుమారు 125 మిలియన్‌ చదరపు అడుగుల గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ స్పేస్‌ ఉంది. ఇది దేశంలోని మొత్తం గ్రేడ్‌-ఏ కార్యాలయ స్థలంలో దాదాపు 15 శాతం. మరో 36 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ నిర్మాణంలో ఉంది. 2025లో హైదరాబాద్‌ నికర ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం 8.5 మిలియన్‌ చదరపు అడుగులు కాగా.. 2026 తొలి ఆరు నెలల్లోనే మరో 5.2 మిలియన్‌ చదరపు అడుగులు నమోదైంది. అదే సమయంలో కార్యాలయాల ఖాళీ స్థలం 2025లో 26.3 శాతం నుంచి 2026 తొలి అర్ధభాగంలో 23.5 శాతానికి తగ్గింది. ఇది కార్యాలయ స్థలానికి డిమాండ్‌ పెరుగుతున్నదానికి సంకేతంగా కనిపిస్తోంది.

అద్దెల్లోనూ పెరుగుదల ప్రభావం

హైదరాబాద్‌లో సగటు ఆఫీస్‌ అద్దె ప్రస్తుతం చదరపు అడుగుకు నెలకు సుమారు రూ.75గా ఉంది. దేశవ్యాప్తంగా సగటు రూ.96తో పోలిస్తే ఇది ఇంకా తక్కువే. ఈ వ్యయ ప్రయోజనం కూడా గ్లోబల్‌ కంపెనీలను హైదరాబాద్‌ వైపు ఆకర్షిస్తోంది. అదే సమయంలో జీసీసీల డిమాండ్‌ పెరగడంతో అత్యుత్తమ కార్యాలయ భవనాలకు అద్దెలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. జీసీసీల విస్తరణ ప్రభావం కేవలం ఆఫీస్‌ మార్కెట్‌కే పరిమితం కాదు. కొత్త కంపెనీలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. ఉద్యోగుల సంఖ్య పెరిగే కొద్దీ పశ్చిమ హైదరాబాద్‌లో నివాస గృహాలు, అద్దె ఇళ్లు, రిటైల్‌, హోటళ్లు, రెస్టారెంట్లు, కో-వర్కింగ్‌ స్పేస్‌లు, స్కూళ్లు, ఇతర సేవలకు కూడా డిమాండ్‌ పెరుగుతుంది. ముఖ్యంగా కార్యాలయాలకు సమీపంలోని ప్రాంతాల్లో నివాస, కమర్షియల్‌ ప్రాజెక్టులకు డిమాండ్‌ మరింత బలపడే అవకాశం ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0