నియోపోలిస్‌ భూముల వేలంతో రూ.2,000 కోట్లపై హెచ్‌ఎండీఏ గురి

The Hyderabad Metropolitan Development Authority (HMDA) plans to auction 114 land parcels across Hyderabad in November 2026, targeting revenue of around ₹2,000 crore.

Oct 27, 2026 - 08:21
Oct 28, 2026 - 06:40
 0  108
నియోపోలిస్‌ భూముల వేలంతో రూ.2,000 కోట్లపై హెచ్‌ఎండీఏ గురి
నియోపోలిస్‌ భూముల వేలంతో రూ.2,000 కోట్లపై హెచ్‌ఎండీఏ గురి.
  • కోకాపేటలో కీలక భూముల విక్రయం.. నవంబర్‌లో 114 స్థలాల వేలం

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరో భారీ భూముల వేలానికి సిద్ధమైంది. నగరంలోని కోకాపేట నియోపోలిస్‌, రాయదుర్గం, బంజారాహిల్స్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న 114 భూఖండాలను వచ్చే నవంబరులో వేలం వేయడం ద్వారా సుమారు రూ.2,000 కోట్ల ఆదాయం సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలానికి భారీ స్పందన రావడంతో, ఇప్పుడు నియోపోలిస్‌పై హెచ్‌ఎండీఏ ప్రధానంగా దృష్టి సారించింది.

కోకాపేటలోని నియోపోలిస్‌ లేఅవుట్‌లో 4.59 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ నంబర్‌ 17కు హెచ్‌ఎండీఏ ఎకరాకు రూ.120 కోట్ల కనీస ధర (రిజర్వ్‌ ప్రైస్‌) నిర్ణయించింది. అలాగే కూకట్‌పల్లి సమీపంలోని మూసాపేటలో 3.15 ఎకరాల భూమికి రూ.99 కోట్ల కనీస ధరను ఖరారు చేసింది.

కోకాపేటలో 8,591 చదరపు గజాల స్థలానికి చదరపు గజానికి రూ.1.50 లక్షలు, రాయదుర్గం నౌఖల్సా గ్రామంలోని 1,815 చదరపు గజాల స్థలానికి చదరపు గజానికి రూ.1.75 లక్షల కనీస ధర నిర్ణయించారు.

బంజారాహిల్స్‌లోనూ విలువైన భూముల వేలం

బంజారాహిల్స్‌లోని హకీంపేట గ్రామం సర్వే నంబర్‌ 102/1 పరిధిలో ఎనిమిది ప్లాట్లను వేలానికి హెచ్‌ఎండీఏ ప్రకటించింది. వీటి విస్తీర్ణం ఒక్కోటి 1,084 నుంచి 1,437 చదరపు గజాల వరకు ఉంది. చదరపు గజానికి రూ.2 లక్షల కనీస ధర నిర్ణయించారు.

ఈ భూములపై గతంలో యమునానగర్‌ సొసైటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వేలానికి ప్రతిపాదించిన భూమి తమ భూములతో కలిసివస్తోందని సొసైటీ ఆరోపించగా, రెవెన్యూ శాఖ ఆ వాదనను తోసిపుచ్చింది.

ఈ నేపథ్యంలో గతంలో నిలిచిపోయిన ప్రక్రియకు బదులుగా ఇప్పుడు ఎనిమిది ప్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ఇదీ చదవండి: బకాయిలు చెల్లించలేదని డెలివరీలు, పనివాళ్ల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చా?

బాచుపల్లి, ఇన్ముల్‌నర్వాలోనూ ప్లాట్లు

హెచ్‌ఎండీఏ తాజా వేలం జాబితాలో బాచుపల్లి లేఅవుట్‌లో 50 ప్లాట్లు, ఇన్ముల్‌నర్వా లేఅవుట్‌లో 45 ప్లాట్లు ఉన్నాయి. అమీన్‌పూర్‌, కాప్రా, సూరారం తదితర ప్రాంతాల్లోని భూములనూ వేలం వేయనున్నారు.

బంజారాహిల్స్‌ భూములను మినహాయిస్తే, వేలం జాబితాలోని ప్లాట్లకు చదరపు గజానికి రూ.15 వేల నుంచి రూ.55 వేల వరకు కనీస ధరలు నిర్ణయించారు. ఇన్ముల్‌నర్వాలో అత్యల్పంగా చదరపు గజానికి రూ.15 వేల ధర ఉంది.

నవంబర్‌ 12 నుంచి వేలం ప్రక్రియ

వివిధ ప్రాంతాల్లోని భూముల వేలాన్ని నవంబర్‌ 12, 20, 23, 25, 27 తేదీల్లో నిర్వహించేందుకు హెచ్‌ఎండీఏ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ విక్రయాల ద్వారా సుమారు రూ.2,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. గతంలో నియోపోలిస్‌ భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు నివేదిక పేర్కొంది.

మరోవైపు, ఈ ఏడాది రాయదుర్గంలోని భూముల వేలంలో ఎకరాకు రూ.200 కోట్లకు పైగా ధరలు పలికాయి. దీంతో హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో విలువైన భూములకు ఉన్న డిమాండ్‌ మరోసారి చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: భారత రియల్‌ ఎస్టేట్‌లో విదేశీ పెట్టుబడుల జోరు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0