బకాయిలు చెల్లించని బయ్యర్‌కి పరిహారం నిరాకరణ

The Haryana Real Estate Regulatory Authority (Haryana RERA) has denied additional compensation to a homebuyer who stopped paying instalments over construction delays.

Nov 12, 2026 - 01:34
Nov 12, 2026 - 04:36
 0  83
బకాయిలు చెల్లించని బయ్యర్‌కి పరిహారం నిరాకరణ
బకాయిలు చెల్లించని బయ్యర్‌కి హర్యానా రెరా పరిహారం నిరాకరణ.
  • ఫ్లాట్‌ స్వాధీనంలో జాప్యం జరిగినా కొనుగోలుదారుడినే డిఫాల్టర్‌గా గుర్తించిన రెరా

నిర్మాణంలో జాప్యం జరిగిందనే కారణంతో ఫ్లాట్‌కు సంబంధించిన వాయిదాల చెల్లింపులు నిలిపివేసిన గృహ కొనుగోలుదారుడికి పరిహారం పొందే హక్కు లేదని హర్యానా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (హర్యానా రెరా) స్పష్టం చేసింది. గతంలోనే సదరు కొనుగోలుదారుడిని డిఫాల్టర్‌గా గుర్తించిన నేపథ్యంలో డెవలపర్‌ నుంచి అదనపు పరిహారం కోరలేరని పేర్కొంది.

గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 67ఏలో ఉన్న ఐరియో గ్రేస్‌ రియల్టెక్‌ సంస్థకు చెందిన ‘ది కారిడార్స్‌’ ప్రాజెక్టులో ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్న గగన్‌దీప్‌ సింగ్‌ దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన అడ్జుడికేటింగ్‌ అధికారి రాజేందర్‌ కుమార్‌ అక్టోబర్‌ 7న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌-1కు చెందిన గగన్‌దీప్‌ సింగ్‌ 2013లో 1,726.9 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్‌ను బుక్‌ చేసుకున్నారు. 2014 ఏప్రిల్‌ 3న రూ.1.70 కోట్లకు కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. 

నిర్మాణ పురోగతికి అనుగుణంగా చెల్లింపులు చేసే విధానంలో భాగంగా రూ.48.40 లక్షలు చెల్లించారు. అయితే, నిర్మాణంలో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ తదుపరి వాయిదాలను చెల్లించడం నిలిపివేశారు. దీంతో డెవలపర్‌ 2016 సెప్టెంబర్‌ 1న ఫ్లాట్‌ కేటాయింపును రద్దు చేసింది. దీనిపై గగన్‌దీప్‌ సింగ్‌ తొలుత హర్యానా రెరాను ఆశ్రయించారు.

ఈ ఫిర్యాదుపై 2024 ఫిబ్రవరి 8న విచారణ జరిపిన అథారిటీ.. ఫ్లాట్‌ విక్రయ విలువలో 10 శాతాన్ని బుకింగ్‌ మొత్తంగా మినహాయించి, మిగిలిన సొమ్మును రద్దు చేసిన తేదీ నుంచి ఏడాదికి 10.8 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఐరియో సంస్థను ఆదేశించింది.

ఇదీ చదవండి: గురుగ్రామ్‌లో రూ.3500 కోట్ల‌ అల్ట్రా ల‌గ్జ‌రీ ప్రాజెక్టు.. అలూరా

అడ్జుడికేటింగ్‌ అధికారిని ఆశ్రయించిన కొనుగోలుదారుడు

అయితే, దీనితో సంతృప్తి చెందని కొనుగోలుదారుడు మానసిక వేధింపులు, ఇబ్బందులకు పరిహారంగా రూ.50 లక్షలు, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ.50 లక్షలు, అలాగే 24 శాతం వడ్డీతో డబ్బు తిరిగి చెల్లించాలని కోరుతూ అడ్జుడికేటింగ్‌ అధికారిని ఆశ్రయించారు.

మరోవైపు కొనుగోలుదారుడు ఒప్పందం ప్రకారం వాయిదాలు చెల్లించడంలో విఫలమయ్యారని, పలుమార్లు గుర్తుచేసినా స్పందించలేదని డెవలపర్‌ వాదించింది. 2024 జూలై 15న కుదిరిన సెటిల్‌మెంట్‌ ప్రకారం కొనుగోలుదారుడి అన్ని క్లెయిమ్‌లు పరిష్కారమైనట్లు పేర్కొంది. 

ఈ కేసులో మరో కీలకమైన అంశాన్ని అడ్జుడికేటింగ్‌ అధికారి గుర్తించారు. ఒప్పందం ప్రకారం 2018 జనవరి 11న ఫ్లాట్‌ స్వాధీనం చేయాల్సి ఉండగా, నిర్మాణ సంస్థకు 2022 జనవరి 27న మాత్రమే ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ లభించింది.

అంటే స్వాధీనంలో నాలుగేళ్లకు పైగా జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి వైదొలగాలని కొనుగోలుదారుడు నిర్ణయించుకోవడం సమంజసమేనని అధికారి అభిప్రాయపడ్డారు. 

అయితే, గతంలో రెరా ఇచ్చిన ఉత్తర్వుల్లో కొనుగోలుదారుడినే చెల్లింపుల డిఫాల్టర్‌గా గుర్తించిందని, పలుమార్లు అవకాశాలు ఇచ్చిన తర్వాతే ఫ్లాట్‌ కేటాయింపును రద్దు చేసినట్లు పేర్కొందని గుర్తు చేశారు. హర్యానా రెరా నిబంధనలు 28, 29 ప్రకారం డెవలపర్‌ ఉల్లంఘనకు పాల్పడినట్లు అథారిటీ ముందుగా నిర్ధారించిన సందర్భాల్లోనే అడ్జుడికేటింగ్‌ అధికారి పరిహారంపై నిర్ణయం తీసుకోగలరని స్పష్టం చేశారు.

ఈ కేసులో గతంలోనే కొనుగోలుదారుడి తప్పిదాన్ని గుర్తించినందున అదనపు పరిహారం మంజూరు చేయలేమని పేర్కొంటూ ఫిర్యాదును కొట్టివేశారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మధ్యతరగతి జోరు..  ఇళ్ల కొనుగోళ్లకు పెరగనున్న డిమాండ్!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0