ఫ్యూచర్‌ సిటీకి మరింత విస్తరణ..

The Telangana government is considering expanding the Future City Development Authority (FCDA) limits by bringing the remaining villages in Maheshwaram and Kandukur mandals under its jurisdiction.

Oct 26, 2026 - 04:07
 0  65
ఫ్యూచర్‌ సిటీకి మరింత విస్తరణ..
future-city-expansion-maheshwaram-kandukur-fcda
  • ఎఫ్‌సీడీఏలోకి మహేశ్వరం, కందుకూరు

హైదరాబాద్‌ దక్షిణ భాగంలో అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టు పరిధి మరింత విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 71 రెవెన్యూ గ్రామాలతో కొనసాగుతున్న ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిధిలోకి మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని మిగిలిన గ్రామాలను కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానికుల విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. విలీన ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు సమాచారం.

మహేశ్వరం మండలంపై ప్రత్యేక ఫోకస్‌

ఫ్యూచర్‌ సిటీ పరిధిని విస్తరించే ప్రతిపాదనల్లో మహేశ్వరం మండలం కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ మండలంలోని రెండు గ్రామాలు మాత్రమే ఎఫ్‌సీడీఏ పరిధిలో ఉండగా.. మిగిలిన 32 రెవెన్యూ గ్రామాలను కూడా చేర్చే దిశగా చర్యలు సాగుతున్నాయి. మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్‌ సిటీలో విలీనం చేయాలంటూ స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ఈ అంశంపై కదలిక మొదలైంది. మరోవైపు కందుకూరు మండలంలోని ఎఫ్‌సీడీఏ పరిధిలోకి ఇంకా రాని గ్రామాలను కూడా విలీనం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొన్ని గ్రామాల నుంచి అవసరమైన తీర్మానాలు అందకపోవడంతో.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే రెండు మండలాల్లోని గ్రామాలన్నీ ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌సీడీఏకు.. అనుమతుల్లో మార్పులు?

గ్రామాల విలీనంతో స్థానికంగా పట్టణ ప్రణాళిక, లేఅవుట్ల అనుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పరిపాలనా వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాలు ఎఫ్‌సీడీఏలోకి వస్తే.. సంబంధిత అనుమతుల కోసం మీర్‌ఖాన్‌పేట-బేగరికంచ ప్రాంతంలోని ఎఫ్‌సీడీఏ కార్యాలయం ద్వారా సేవలు పొందే అవకాశం ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే, అనుమతుల జారీ విధానం, అధికార పరిధి, కొత్త నిబంధనలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

71 గ్రామాల నుంచి మరింత విస్తరణ దిశగా

హైదరాబాద్‌కు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నెట్‌జీరో గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. తొలుత ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని 56 రెవెన్యూ గ్రామాలు, సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. అనంతరం మరో 15 గ్రామాలను చేర్చడంతో ఎఫ్‌సీడీఏ పరిధి 71 గ్రామాలకు చేరింది. ఇప్పుడు మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని మిగిలిన గ్రామాల విలీన ప్రతిపాదనలు ముందుకు సాగితే.. ఫ్యూచర్‌ సిటీ పరిధి మరింత విస్తరించనుంది. ఈ ప్రాంతంలో భూములు, ఇళ్లు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, పట్టా భూముల వివరాలను సేకరించడం, గ్రామాల సరిహద్దులను గుర్తించడం వంటి పనులు కూడా కీలకంగా మారనున్నాయి.

రియల్‌ ఎస్టేట్‌పై ఎలాంటి ప్రభావం?

ఫ్యూచర్‌ సిటీ పరిధి విస్తరణ ప్రతిపాదనలు దక్షిణ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పై ప్రబావం చూపనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పారిశ్రామిక, వాణిజ్య, నివాస రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు స్పష్టమైతే భవిష్యత్తులో భూముల వినియోగం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. మాస్టర్‌ ప్లాన్‌, రహదారులు, ప్రభుత్వ పెట్టుబడులు, అనుమతుల విధానం, భూముల వర్గీకరణ వంటి అంశాలే మార్కెట్‌ దిశను నిర్ణయించనున్నాయి. మొత్తంగా చూస్తే.. ఫ్యూచర్‌ సిటీ విస్తరణలో మహేశ్వరం, కందుకూరు మండలాలు కీలకంగా మారుతున్నాయి. గ్రామాల విలీనంపై ప్రభుత్వ తదుపరి నిర్ణయాలు, అధికారిక నోటిఫికేషన్‌ వెలువడే సమయం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0