పండగ ఆఫర్లతో ఇల్లు కొనడం లాభమేనా?
During the festive season, real estate developers are attracting homebuyers with offers such as gold coins, iPhones, electronics, travel vouchers, price discounts and flexible payment plans.
బంగారం, ఐఫోన్లు, డిస్కౌంట్ల వెనక అసలు లెక్క ఇదే
పండగల సీజన్ వచ్చిందంటే రియల్ ఎస్టేట్ సంస్థలు గృహ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లతో ముందుకొస్తాయి. బంగారు నాణేలు, ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ట్రావెల్ వోచర్లు, ధరలో రాయితీలు.. ఇలా రకరకాల ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంటాయి. ఈసారి నవరాత్రి సందర్భంగా కూడా పలు సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే ఈ బహుమతుల కోసం ఇల్లు కొనడం సరైన నిర్ణయమేనా? నిజంగా ఎంత ఆదా అవుతుంది? ఆఫర్ వెనుక దాగి ఉన్న నిబంధనలేమిటి? ఇల్లు కొనాలనుకునేవారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దామా?
బహుమతులే కాదు.. చెల్లింపుల్లోనూ వెసులుబాటు
ఈ నవరాత్రి సీజన్లో దేశంలోని పలు నగరాల్లో డెవలపర్లు కేవలం ధర తగ్గింపులకే పరిమితం కావడం లేదు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు విలువైన బహుమతులు, సులభ వాయిదా పద్ధతులు, కొన్ని ఛార్జీల మినహాయింపులను కూడా ప్రకటిస్తున్నారు. గురుగ్రామ్‌కు చెందిన సిగ్నేచర్ గ్లోబల్ సంస్థ తన ప్రాజెక్టుల్లో ఐఫోన్లు, బంగారు వోచర్లు, మ్యాక్‌బుక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రయాణ వోచర్లు వంటి బహుమతులను అందించే ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. కొన్ని ఆఫర్లలో స్పిన్-ది-వీల్ విధానంలో బహుమతులు గెలుచుకునే అవకాశమూ కల్పిస్తోంది.
ఎక్స్పీరియన్ సంస్థ ప్రకటించిన ‘20:20’ పథకంలో ఇంటి ధరలో 20 శాతం ముందుగా చెల్లించి, మిగిలిన చెల్లింపులను రెండేళ్లపాటు వాయిదా వేసుకునే వెసులుబాటు ఉంది. ప్రిఫరెన్షియల్ లొకేషన్ ఛార్జీలపై (పీఎల్సీ) గరిష్ఠంగా 100 శాతం వరకు మినహాయింపు కూడా ప్రకటించింది. బెంగళూరుకు చెందిన వైబెజ్ ఎస్టేట్స్ స్పాట్ బుకింగ్‌పై తుది ధరలో రూ.5 లక్షల వరకు తక్షణ తగ్గింపు పొందే అవకాశం కల్పిస్తోంది. బీపీటీపీ సంస్థ తన ప్రాజెక్టుల్లో ఇల్లు బుక్ చేసుకునేవారికి 20 గ్రాముల బంగారు నాణెం, గృహోపకరణాలు, స్మార్ట్‌హోమ్ టెక్నాలజీ వంటి ప్రయోజనాలను అందించే ప్రచారాన్ని చేపట్టింది.
ఉచిత బహుమతులా? ధర తగ్గింపా?
ఇల్లు కొనుగోలు చేసే సమయంలో అత్యంత కీలకమైన ప్రశ్న ఇదే. ఉదాహరణకు, ఒక సంస్థ రూ.80 లక్షల విలువైన ఫ్లాట్ కొనుగోలుపై ఏసీలు, ఫర్నిచర్, బంగారు నాణెం ఇస్తామని ప్రకటించిందనుకుందాం. ఆ బహుమతులన్నింటి విలువ కలిపి కొన్ని లక్షల రూపాయలుగా కనిపించవచ్చు. కానీ అదే మొత్తాన్ని ఫ్లాట్ ధరలో తగ్గిస్తే కొనుగోలుదారుకు మరింత ప్రయోజనం కలగవచ్చు. అందుకే బహుమతుల విలువను మాత్రమే కాకుండా, వాటికి బదులుగా ధరలో తగ్గింపు పొందే అవకాశం ఉందా అని బిల్డర్‌ను అడగాలి. అలాగే ఆఫర్ ప్రకటించకముందు ఇదే ఫ్లాట్‌కు ఎంత ధర చెప్పారో తెలుసుకోవాలి. మార్కెట్ ధరతో పోల్చకుండా కేవలం పండగ ఆఫర్ ఆధారంగా నిర్ణయం తీసుకోవద్దు.
కొన్ని సందర్భాల్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మినహాయింపులు, ఉచిత పార్కింగ్, కొంతకాలం నిర్వహణ ఛార్జీలు లేకపోవడం వంటి ప్రయోజనాలు ఎక్కువ విలువను అందించవచ్చు. ఇంటికి అవసరమైన మాడ్యులర్ కిచెన్, ఏసీలు, ఫర్నిచర్ వంటి వస్తువులను కొనుగోలుదారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటే వాటిని ఉచితంగా అందించే ఆఫర్లు కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు. అయితే వాటి నాణ్యత, బ్రాండ్, వారంటీ వివరాలను ముందుగానే తెలుసుకోవాలి.
పండగ సీజన్లో కొనడమే మంచిదా?
పండగల సమయంలో ఇల్లు కొనడం శుభప్రదమని చాలామంది భావిస్తారు. ఈ సెంటిమెంట్‌ను గుర్తించిన నిర్మాణ సంస్థలు ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటాయి. అయితే పండగల సమయంలోనే ఇల్లు కొనాలనే తొందర అవసరం లేదు. ఆఫర్ బాగున్నా, ఆస్తి ధర ఎక్కువగా ఉంటే కొనుగోలుదారుకు నిజమైన లాభం ఉండకపోవచ్చు. మరోవైపు, బిల్డర్ వద్ద అమ్ముడుపోకుండా మిగిలిన ఇళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ధరపై చర్చించేందుకు అవకాశం దొరకవచ్చు.
అయితే ఈ వెసులుబాటు ప్రతి నగరంలోనూ, ప్రతి ప్రాజెక్టులోనూ ఒకేలా ఉండదు. బిల్డర్, ప్రాంతం, ఇంటి రకం, నిర్మాణ దశను బట్టి మారుతుంది. పండగ ఆఫర్ చూసి ఇల్లు కొనడం కంటే, ఆ ఇంటి ధర సరైనదా? మన అవసరాలకు సరిపోతుందా? దీర్ఘకాలంలో ఆర్థికంగా భరించగలమా? అనే మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం ముఖ్యం. బహుమతుల కంటే మొత్తం కొనుగోలు వ్యయం తగ్గడం, నాణ్యమైన ఇల్లు లభించడం ముఖ్యమని నిపుణుల సూచన.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0