ఇల్లు ఇవ్వక.. ఈఎంఐ ఆపక..
The CBI has registered cases against two Mumbai-based developers, Schoolink Hospitality LLP and Ozone Homes Ltd, along with unidentified officials of a private home-finance company, over allegations linked to “No Pre-EMI Till Delivery” schemes.
- ఇద్దరు ముంబై బిల్డర్లపై సీబీఐ కేసులు..
- ‘నో ప్రీ-ఈఎంఐ’ ఆఫర్‌తో మోసం చేశారన్న ఆరోపణలు
ఇల్లు పూర్తయ్యే వరకు ప్రీ-ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదంటూ గృహ కొనుగోలుదారులను ఆకర్షించి, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ముంబైకి చెందిన ఇద్దరు నిర్మాణ సంస్థలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. స్కూలింక్ హాస్పిటాలిటీ ఎల్ఎల్ పీ, ఓజోన్ హోమ్స్ లిమిటెడ్ తో పాటు సంబంధిత ప్రైవేట్ హోమ్ ఫైనాన్స్ సంస్థకు చెందిన గుర్తుతెలియని అధికారులను కూడా నిందితులుగా చేర్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా బిల్డర్లు, ఆర్థిక సంస్థల మధ్య అనుమానిత కుమ్మక్కుపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ముంబైలోని రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఈ కేసులు నమోదయ్యాయి. శాంటాక్రూజ్‌లో 2017–18లో ప్రారంభించిన ప్రాజెక్టుకు సంబంధించి 10 మంది కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. ‘నో ప్రీ-ఈఎంఐ టిల్ డెలివరీ’ పథకంతో ఫ్లాట్లు కొనుగోలు చేసేలా ప్రోత్సహించారని, అయితే ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో పాటు చెల్లించిన మొత్తాలను కూడా తిరిగి ఇవ్వలేదని వారు ఆరోపించారు.
వడాలాలోని మరో ప్రాజెక్టుకు సంబంధించి ఆరుగురు కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ కూడా ఇల్లు అప్పగించే వరకు ప్రీ-ఈఎంఐ ఉండదంటూ హామీ ఇచ్చి, తర్వాత ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుల్లో బిల్డర్లతో పాటు ఫైనాన్స్ సంస్థకు చెందిన గుర్తుతెలియని అధికారులను చేర్చడం కీలకంగా మారింది. ‘నో ప్రీ-ఈఎంఐ’ పథకం రూపకల్పన, రుణాల మంజూరు, నిధుల విడుదలలో వారి పాత్ర ఏమైనా ఉందా? బిల్డర్లు కొనుగోలుదారుల నుంచి సేకరించిన మొత్తాలను ఇతర అవసరాలకు మళ్లించారా? అనే అంశాలను సీబీఐ పరిశీలిస్తోంది.
ఈ కేసులకు సంబంధించి ముంబై, పుణె, బెంగళూరులోని 12 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ‘నో ప్రీ-ఈఎంఐ’, ‘జీరో ఈఎంఐ’ వంటి ఆఫర్లు కనిపించినప్పుడు కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని ఈ వ్యవహారం సూచిస్తోంది. బిల్డర్ ఆర్థిక స్థితి, ప్రాజెక్టు అనుమతులు, రుణదాత పాత్ర, నిర్మాణ పురోగతి, ప్రాజెక్టు ఆలస్యమైతే బాధ్యత ఎవరిది వంటి అంశాలను ఒప్పందానికి ముందే పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0