బ్రాండెడ్ లివింగ్‌దే భవిష్యత్తు.. కానీ ఆర్థికంగా లాభసాటిగా ఉండాలి

Mahindra Lifespaces MD and CEO Amit Sinha says branded living is emerging as a key trend in India’s luxury real estate market.

Oct 24, 2026 - 01:26
 0  54
బ్రాండెడ్ లివింగ్‌దే భవిష్యత్తు.. కానీ ఆర్థికంగా లాభసాటిగా ఉండాలి
branded-living-financial-viability-amit-sinha

మహీంద్రా లైఫ్‌స్పేసెస్ ఎండీ, సీఈఓ అమిత్ సిన్హా

ఆర్ఈజీ న్యూస్‌, కోల్‌క‌తా: 

భారత్‌లో విలాసవంతమైన గృహాల మార్కెట్‌లో బ్రాండెడ్ రెసిడెన్సెస్‌ అనే కొత్త విభాగం వేగంగా ఎదుగుతోంది. కొనుగోలుదారులు కేవలం ఇల్లు మాత్రమే కాకుండా హోటల్ తరహా సేవలు, ఆరోగ్యం, వెల్‌నెస్, ప్రత్యేక జీవనశైలి అనుభవాలను కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ తరహా ప్రాజెక్టులను చేపట్టే నిర్మాణ సంస్థలకు ఖర్చులు ఎక్కువగా ఉండటంతో పాటు, అదనపు ధర వసూలు చేయడం ద్వారా ఆ ఖర్చులను భర్తీ చేసుకోగలమా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది.

“బ్రాండెడ్ రెసిడెన్సెస్‌ ప్రాజెక్టుల ఆర్థిక అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ తరహా ప్రాజెక్టులకు మొత్తం అమ్మకాల విలువలో 8 నుంచి 10 శాతం వరకు అదనపు ఖర్చు కావచ్చు. ఆ ఖర్చును భర్తీ చేసుకోవాలంటే సాధారణ ప్రాజెక్టులతో పోలిస్తే 20, 25 లేదా 30 శాతం వరకు అధిక ధర నిర్ణయించాల్సి రావచ్చు. ఇలాంటి ధరలకు కొనుగోలుదారుల నుంచి స్పందన ఉంటుందా? ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందా? అనే అంశాలను ముందుగానే అంచనా వేయాలి” అని మహీంద్రా లైఫ్‌స్పేసెస్‌ ఎండీ, సీఈఓ అమిత్ సిన్హా తెలిపారు.

అమెరికాలో మొదలై.. ఇతర దేశాలకు విస్తరణ

బ్రాండెడ్ రెసిడెన్సెస్‌ విధానం మొదట అమెరికాలో ప్రారంభమై, ఆ తర్వాత యూరప్‌, ఆసియా దేశాలకు విస్తరించిందని అమిత్ సిన్హా చెప్పారు. ప్రస్తుతం దుబాయ్‌ ఈ విభాగంలో అతిపెద్ద మార్కెట్‌గా ఉండగా, చైనా కూడా భారత్‌ కంటే ముందుంది. భారత్‌లో ఈ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా బ్రాండెడ్ రెసిడెన్సెస్‌ ప్రాజెక్టుల ప్రారంభం పెరుగుతోందన్నారు. అయితే, ఒక ప్రాజెక్టుకు అంతర్జాతీయ బ్రాండ్‌ పేరును లేదా హోటల్‌ బ్రాండ్‌ను జోడించడం మాత్రమే సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.

బ్రాండ్‌ పేరు ఉంటే సరిపోదు

మహీంద్రా లైఫ్‌స్పేసెస్‌ కూడా అంతర్జాతీయ లగ్జరీ ప్రాజెక్టులకు డిజైన్‌ సేవలు అందించే ఇటలీ సంస్థ పినిన్‌ఫరీనాతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సెస్‌ ప్రాజెక్టు చేపట్టే అవకాశాన్ని పరిశీలించిందని అమిత్ తెలిపారు. అయితే డిజైన్‌ సేవలు, బ్రాండ్‌ వినియోగానికి రాయల్టీ చెల్లించే విధానం తమ సంస్థకు ఆర్థికంగా అనుకూలంగా లేదని చెప్పారు.

అధిక ధరలతో ఇళ్లను విక్రయిస్తే అమ్మకాలకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని, దీంతో సంస్థకు నగదు తిరిగి వచ్చే ప్రక్రియ ఆలస్యమవుతుందని వివరించారు. ఇది పెట్టుబడిపై రాబడిపైనా ప్రభావం చూపుతుందన్నారు. అందువల్ల బ్రాండ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకునే ముందు దాని ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయాలని సూచించారు. బ్రాండ్‌ వల్ల ధర పెరిగినా, ఆ ధరకు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉండాలి. ఇళ్ల అమ్మకాలు కూడా ఆశించిన వేగంతో జరగాలని చెప్పారు.

‘బ్రాండెడ్ రెసిడెన్సెస్‌ కాదు.. బ్రాండెడ్ లివింగ్‌’

కోల్‌కతాలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (CREDAI) నిర్వహించిన 24వ నాట్‌కాన్‌ సదస్సులో అమిత్ సిన్హా మాట్లాడారు. భవిష్యత్తులో తమ సంస్థ రియల్‌ ఎస్టేట్‌ను ఆతిథ్య సేవలు, ప్రత్యేక అనుభవాలు, ఇతర సేవలతో కలిపి విస్తృతమైన విధానంలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. “మేం బ్రాండెడ్ రెసిడెన్సెస్‌ గురించి మాత్రమే ఆలోచించడం లేదు. బ్రాండెడ్ లివింగ్‌ గురించి ఆలోచిస్తున్నాం” అని ఆయన అన్నారు. ఈ విధానాన్ని సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేక నివాసాలు, రెండో ఇళ్లు, వ్యక్తిగత సహాయక సేవలు (కన్సియర్జ్‌ సర్వీసెస్‌), ప్రత్యేక అనుభవాలు, వెల్‌నెస్‌ సేవల వరకు విస్తరించవచ్చని వివరించారు.

నగరాలు, రిసార్ట్‌లకు వేర్వేరు వ్యూహాలు

ఈ వ్యాపార విధానంలో ప్రాజెక్టు ఉన్న ప్రాంతం కూడా కీలకమని అమిత్ చెప్పారు. మహీంద్రా లైఫ్‌స్పేసెస్‌కు ముంబై, పుణె, బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉంది. మరోవైపు, సంస్థ ఆతిథ్య విభాగం ఫిన్‌లాండ్‌లోని ఒక సంస్థతో సహా సుమారు 70 రిసార్ట్‌లను నిర్వహిస్తోంది. నగరాల్లోని ప్రాజెక్టులకు మార్కెట్‌ పరిమాణం, కొనుగోలుదారుల డిమాండ్‌ ముఖ్యమని, రిసార్ట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక అనుభవాలు, ఆ ప్రాంత ఆకర్షణలు కీలకమని ఆయన వివరించారు. అందువల్ల రెండు విభాగాలకు వేర్వేరు వ్యాపార వ్యూహాలు అవసరమన్నారు.

ప్రధాన నగరాలకు రెండు గంటల్లో చేరుకునే ప్రాంతాలపై దృష్టి

భవిష్యత్తులో ప్రధాన నగరాలు, విమానాశ్రయాల నుంచి రెండు గంటల్లో చేరుకోగల ప్రాంతాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని అమిత్ సిన్హా అభిప్రాయపడ్డారు. నగరాలకు సమీపంలో ఉండే ఇలాంటి ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధిని ఆతిథ్య సేవలతో కలిపి అందించడంపై సంస్థ దృష్టి సారించనుందని తెలిపారు. ప్రత్యేకించి, ఎక్కువ దూరం ప్రయాణించకుండా రెండో ఇల్లు లేదా ప్రత్యేక జీవనశైలి అనుభవాన్ని కోరుకునే నగరాల కొనుగోలుదారులకు ఇలాంటి ప్రాజెక్టులు ఆకర్షణీయంగా మారవచ్చని చెప్పారు. రిసార్ట్‌ ప్రాంతాల్లోనూ ఈ విధానానికి అవకాశాలు పెరుగుతున్నాయని, ప్రధాన నగరాలు, విమానాశ్రయాలకు సమీపంలోని ప్రాంతాలే బ్రాండెడ్ లివింగ్‌ రంగంలో తదుపరి వృద్ధికి కీలకంగా మారవచ్చని అమిత్ సిన్హా పేర్కొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0