18 అంత‌స్తుల నిర్మాణాన్ని కూల్చేసి.. మ‌ళ్లీ క‌డుతున్న బిల్డ‌ర్‌! 

A Bengaluru real-estate developer, SNN Raj Corporation, has taken the unusual decision to voluntarily demolish and rebuild an 18-storey apartment tower after discovering that it had tilted by about 20 cm.

Aug 24, 2026 - 22:54
Aug 25, 2026 - 07:39
 0  15
18 అంత‌స్తుల నిర్మాణాన్ని కూల్చేసి.. మ‌ళ్లీ క‌డుతున్న బిల్డ‌ర్‌! 
bengaluru-tilted-18-storey-tower-demolition-rebuild-snn-raj-corporation-builder-safety-compensation
* బెంగళూరులో కొద్దిగా వాలిన 18 అంతస్తుల టవర్
* స్వచ్ఛందంగా కూల్చివేతకు సిద్ధమైన బిల్డర్
* ఆలస్యానికి పరిహారం కూడా చెల్లింపు
 
ఈ బిల్డ‌ర్‌ని మ‌న‌మంతా ముక్త‌కంఠంతో ప్ర‌శంసించాల్సిందే. భార‌త‌దేశంలోనే ఇలాంటి బిల్డ‌ర్ కూడా ఉంటార‌ని.. ఎవ‌రూ క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు. ఎందుకంటే, ఆయ‌న క‌ట్టిన అపార్టుమెంట్‌కి ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ వ‌చ్చేసింది. అందులో గృహ‌ప్ర‌వేశం చేసేందుకు కొంద‌రు బ‌య్య‌ర్లు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.
కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి క‌ట్టిన ఆ ప‌ద్దెనిమిది అంత‌స్తుల ట‌వ‌ర్‌లో ఒక చిన్న స‌మ‌స్య బయ‌ట‌ప‌డింది. ఇలాంటి సంద‌ర్భంలో అధిక శాతం మంది బిల్డ‌ర్లు చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి.. హ‌డావిడిగా ఫ్లాట్ల‌ను అప్ప‌గించి.. చేతులు దులిపేసుకుంటారు. అయితే, ఈ బిల్డ‌ర్ పొర‌పాటున కూడా అలా చేయ‌లేదు.
ఆ భ‌వ‌నం ఒక ప‌క్క‌కు 0.2 మీటర్ల వ్య‌త్యాసంలో కొద్దిగా వాలిన‌ట్లు.. నాణ్య‌తా త‌నిఖీలో తెలిసింది. అలాంట‌ప్పుడు కొద్దిపాటి రిపేర్ల‌తో స‌మ‌స్య‌ను క‌ప్పిపెట్టొచ్చు. కాక‌పోతే, ఆ బిల్డ‌ర్ అలా చేయ‌లేదు. కొనుగోల‌దారుల ర‌క్ష‌ణే ముఖ్య‌మ‌ని భావించిన స‌ద‌రు బిల్డ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప‌ద్దెనిమిది అంత‌స్తుల ఆ విలాస‌వంత‌మైన ట‌వ‌ర్‌ను స్వచ్ఛంధంగా కూల్చివేసి.. మ‌ళ్లీ మొద‌ట్నుంచి నిర్మిద్దామ‌ని చెప్పారు.
దీంతో, వెండార్లు, బ‌య్య‌ర్లు అంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఇర‌వై కోట్లు అద‌నంగా ఖ‌ర్చు అయినా ఫ‌ర్వాలేదు.. బ‌య్య‌ర్ల ర‌క్ష‌ణే ప్రధాన‌మంటూ ఆ బిల్డ‌ర్ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. భారత రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఈ సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది.
 
ఘటన నేపథ్యం ఏంటంటే..?
దక్షిణ బెంగళూరులోని కుడ్లు 'ఎస్ఎన్ఎన్ రాజ్ కార్పొరేషన్' సంస్థ 'ఎస్ఎన్ఎన్ రాజ్ ఎటర్నియా' పేరుతో ఒక భారీ హౌసింగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. 15 టవర్లలో 972 అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఇందులో ప్లాట్ల ధరలు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర మధ్య ఉన్నాయి. 14 టవర్లలోని 822 ఫ్లాట్లను ఇప్పటికే కస్టమర్లకు అందజేయగా, ఈ-3 బ్లాక్ నిర్మాణం పూర్తయి, 3 నెలల క్రితమే ఓసీ కూడా వచ్చింది. అందులో ఉన్న 49 ఫ్లాట్లు అమ్ముడైపోగా, ఫైనల్ క్వాలిటీ చెక్ చేస్తున్న సమయంలో డ్రైవ్‌వే గ్రౌండ్ లెవెల్‌లో స్వల్ప మార్పులను ఇంజనీర్లు గమనించారు.
స్పెషలైజ్డ్ పరికరాలతో తనిఖీ చేయగా 60 మీటర్ల ఎత్తు ఉన్న ఆ టవర్ సుమారు 20 సెం.మీ వాలినట్లు బయటపడింది. నిర్మాణం ప్రారంభంలో జరిపిన 'జియోటెక్నికల్ సాయిల్ ఇన్వెస్టిగేషన్'నివేదికలో దొర్లిన సాంకేతిక పొరపాటే దీనికి కారణమని తేలింది. భవనానికి 'మైక్రో పైలింగ్' ద్వారా స్టెబిలిటీ తేవచ్చని పలువురు కన్సల్టెంట్లు సూచించినప్పటికీ, మరో 10 లేదా 15 ఏళ్ల తర్వాత కస్టమర్లకు ఎలాంటి ప్రమాదం రాకూడదనే ఉద్దేశంతో భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేసి మళ్లీ కట్టాలని బిల్డర్ నిర్ణయించారు.
 
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చిన సంస్థకే బాధ్యతలు..
ఈ 18 అంతస్తుల భవనాన్ని ఇతర టవర్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సురక్షితంగా కూల్చేందుకు, గతంలో నోయిడాలోని 'సుపర్‌టెక్ ట్విన్ టవర్స్'ను విజయవంతంగా నేలమట్టం చేసిన 'ఎడిఫిస్ ఇంజనీరింగ్' సంస్థను రంగంలోకి దించారు. వైబ్రేషన్లు రాకుండా 'డైమండ్ వైర్ రోప్ కటింగ్' టెక్నాలజీ ద్వారా భవనాన్ని డిస్‌మాంటిల్ చేయనున్నారు. కూల్చివేతకు 5 నుంచి 6 నెలలు, తిరిగి నిర్మాణం పూర్తి చేయడానికి 18 నెలలు పడుతుందని అంచనా.
 
కొనుగోలుదారులపై పైసా భారం పడదు..
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కస్టమర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఎస్ఎన్ఎన్ రాజ్ కార్పొరేషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. పునర్నిర్మాణానికి అయ్యే రూ.20 కోట్ల ఖర్చును కంపెనీయే స్వయంగా భరిస్తుంది. ఈ ఆలస్య సమయానికి ఫ్లాట్ కొనుగోలుదారుల ఈఎమ్‌ఐ, అద్దె ఖర్చులను కవర్ చేస్తూ బిల్డర్ నష్టపరిహారం కూడా చెల్లించనున్నారు. కర్ణాటక రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఛైర్మన్ రాకేష్ సింగ్ మాట్లాడుతూ.. "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చినా కూడా కొనుగోలుదారుల రక్షణ కోసం స్వచ్ఛందంగా టవర్‌ను కూల్చి కడుతున్న ఘటన దేశంలోనే ఇదే తొలిసారి" అని ప్రశంసించారు.
 
నోయిడా ట్విన్ టవర్స్ లేదా కొచ్చి మరడు ఫ్లాట్ల కూల్చివేతలు కోర్టుల ఉత్తర్వుల వల్ల, చట్ట ఉల్లంఘనల వల్ల జరిగాయి. కానీ బెంగళూరు ఘటనలో డెవలపర్ ప్రదర్శించిన వ్యాపార విలువలు, కస్టమర్ల భద్రత పట్ల నిబద్ధత భారతీయ రియల్ ఎస్టేట్ రంగానికే ఒక నూతన మార్గదర్శకంగా నిలుస్తాయని నిపుణులు కొనియాడుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0