బాలీలో నిర్మించారు.. హవాయికి చేర్చారు!
A unique luxury estate built in Bali and later relocated to Hawaii is now on the market for more than ₹270 crore ($32.5 million).
- 280 మంది కళాకారుల నాలుగేళ్ల శ్రమ
- తర్వాత ముక్కలుగా విడదీసి ఓడలో హవాయికి తరలింపు
- సముద్రం పక్కనే మూడెకరాల స్థలంలో యథాతథంగా మళ్లీ నిర్మాణం
- ఇప్పుడు అమ్మకానికి.. ధర రూ.270 కోట్లకు పైమాటే
సాధారణంగా ఇల్లు కట్టాలంటే స్థలం వెతుక్కుంటాం.. ఆ తర్వాత ఇటుకలు, సిమెంట్, కలప తెచ్చి నిర్మిస్తాం. కానీ ఓ బిలియనీర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ముందుగా ఇండోనేషియాలోని బాలీలో ఓ అద్భుతమైన ఇంటిని నిర్మించారు. ఆ తర్వాత దాన్ని ముక్కలుగా విడదీసి వేల కిలోమీటర్ల దూరంలోని హవాయికి తరలించారు. అక్కడ మళ్లీ అదే ఇంటిని యథాతథంగా నిర్మించారు. ఇదంతా 1990లలో జరిగింది. దాదాపు 280 మంది నిపుణులైన బాలీ కళాకారులు నాలుగేళ్లపాటు శ్రమించి నిర్మించిన ఈ ప్రత్యేకమైన ఆస్తి.. ఇప్పుడు అమెరికాలోని హవాయి బిగ్ ఐలాండ్‌లో అమ్మకానికి వచ్చింది. దీని ధర రూ.270 కోట్లకు పైమాటే.
జాన్ పాల్ డిజోరియా అనే బిలియనీర్ వ్యాపారవేత్తకు బాలీ సంప్రదాయ ఆలయ నిర్మాణ శైలిపై ఉన్న ప్రత్యేకమైన అభిమానం ఈ ఇంటి నిర్మాణానికి కారణమైంది. 1990లలో బాలీలోనే ఒక అసలైన బాలినీస్ ఎస్టేట్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీంతో స్థానిక సంప్రదాయ నిర్మాణ పద్ధతుల్లో నైపుణ్యం ఉన్న 280 మంది మాస్టర్ క్రాఫ్ట్స్‌మెన్‌ను రంగంలోకి దించారు. ఆధునిక నిర్మాణ సామగ్రి కంటే సంప్రదాయ ఇండోనేషియా ఐరన్‌వుడ్, టీక్ కలపను విస్తృతంగా ఉపయోగించారు.
ఈ ఇంటి నిర్మాణానికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది. 1994లో నిర్మాణం పూర్తయింది. ఇల్లు పూర్తయిన తర్వాత దాన్ని బాలీలోనే ఉంచేస్తే ఇది మరో అందమైన భవనంగా మిగిలిపోయేది. కానీ డిజోరియా ఆ ఇంటిని హవాయిలోని తన స్థలంలో ఉండాలని కోరుకున్నారు. వెంటనే భవనాన్ని పద్ధతి ప్రకారం విడదీయడం ప్రారంభించారు. చెక్క భాగాలను ఒక్కొక్కటిగా తొలగించారు. వాటిని భద్రంగా సముద్ర మార్గంలో ఇండోనేషియా నుంచి హవాయి వరకు తరలించారు. వేల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆ నిర్మాణ భాగాలు హవాయి బిగ్ ఐలాండ్‌కు చేరుకున్నాయి.
మూడు ఎకరాల సముద్రతీర స్థలంలో దీనిని పునర్ నిర్మించడానికి మళ్లీ నిపుణులైన కళాకారులు రంగంలోకి దిగారు. బాలీలో ఎలా నిర్మించారో.. అదే విధంగా ఒక్కో భాగాన్ని తిరిగి అమర్చారు. బాలీలో నిర్మించినప్పుడు పాటించిన నిర్మాణ సాంకేతికతను హవాయిలోనూ సాధ్యమైనంతవరకు కొనసాగించారు. అందుకే ఈ భవనం కేవలం బాలినీస్ శైలిని అనుకరించిన కొత్త ఇల్లు కాదు. బాలీలో నిర్మించి, హవాయిలో తిరిగి అమర్చిన ఒక అసలైన నిర్మాణం అనే ప్రత్యేకతను సొంతం చేసుకుంది. సుమారు 3,413 చదరపు అడుగుల నివాస విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో మూడు బెడ్‌రూమ్‌లు, మూడు బాత్‌రూమ్‌లు ఉన్నాయి.
పైకప్పుపై ఏకంగా పది లక్షలకు పైగా షింగిల్స్!
ఈ ఎస్టేట్‌లో చూపు తిప్పుకోనివ్వని మరో అంశం పైకప్పు. దీనిపై 10 లక్షలకు పైగా షింగిల్స్ ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఈ పైకప్పు సహజసిద్ధమైన ఒక భారీ పొరలా కనిపిస్తుంది. ఇంటి మొత్తం నిర్మాణం చుట్టూ ఉన్న ప్రకృతితో కలిసిపోయేలా రూపొందించారు. హవాయి ప్రకృతి సౌందర్యం, బాలీ సంప్రదాయ వాస్తుశిల్పం రెండింటినీ కలిపే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. అరుదైన ఎస్టేట్ హవాయి బిగ్ ఐలాండ్‌లోని కోహాలా కోస్ట్ ప్రాంతంలో, కిహోలో బే సమీపంలో దాదాపు మూడు ఎకరాల సముద్రతీర స్థలంలో ఉంది. అలాంటి అదిరిపోయే భవనం ప్రస్తుతం అమ్మకానికి వచ్చింది. దీనికి 32.5 మిలియన్లను అమ్మకపు ధరగా నిర్ణయించారు. అంటే.. మన కరెన్సీలో దాదాపు రూ.270 కోట్లు. ఎక్కడో పుట్టి అక్కడకు చేరిన ఈ భవనం.. కొత్త యజమాని కోసం ఎదురుచూస్తోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0