జాతీయ సంపదను సృష్టించే శక్తి  రియల్ ఎస్టేట్‌కు ఉంది: అభిషేక్ లోధా

India’s real estate sector is entering a crucial growth phase and could play a major role in wealth creation, employment generation and strengthening the middle class over the next 10–15 years, said Abhishek Lodha, MD and CEO of Lodha Group, at CREDAI’s 24th NATCON conference in Kolkata.

Oct 24, 2026 - 03:10
 0  9
జాతీయ సంపదను సృష్టించే శక్తి   రియల్ ఎస్టేట్‌కు ఉంది: అభిషేక్ లోధా
abhishek-lodha-real-estate-growth-india-2047

ఆర్ఈజీ న్యూస్, కోల్‌క‌తా: భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం కీలకమైన దశలోకి అడుగుపెడుతోంది. రాబోయే 10–15 ఏళ్లలో ఈ రంగం దేశ సంపదను పెంచడంతో పాటు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించి, మధ్యతరగతి అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉందని లోధా గ్రూప్‌ ఎండీ, సీఈఓ అభిషేక్ లోధా అన్నారు.

దేశంలోని మొత్తం సంపదలో సుమారు 50 శాతం రియల్ ఎస్టేట్‌లోనే ఉంది. అదే సమయంలో వ్యక్తుల సంపదలో కేవలం 5–5.5 శాతం మాత్రమే ఈక్విటీ మార్కెట్‌లో ఉంది. ఇళ్ల ధరలు ఏటా 8 శాతం పెరిగితే, ఆ ఏడాది దేశ సంపద 4 శాతం పెరుగుతుంది. మరే ఇతర రంగానికీ సాధ్యం కానంత స్థాయిలో ఉపాధి అవకాశాలను, జాతీయ సంపదను సృష్టించే అవకాశం రియల్ ఎస్టేట్‌కు ఉంది అని ఆయన పేర్కొన్నారు.

అమెరికా, చైనా అభివృద్ధి నుంచి పాఠాలు

ఇతర దేశాల ఆర్థిక అభివృద్ధిలో గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషించాయని అభిషేక్ లోధా తెలిపారు. 1945 నుంచి 1970 మధ్య అమెరికాలో నిర్మాణ‌ రంగం, మౌలిక సదుపాయాల విస్తరణ వల్ల మధ్యతరగతి బలపడిందని గుర్తుచేశారు. అలాగే, 1990వ దశకం నుంచి చైనాలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులకు దోహదపడ్డాయని వివరించారు. భారత్‌ కూడా ప్రస్తుతం ఇలాంటి దశలోనే ఉందని, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పాదక శక్తి కలిగిన జనాభా దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పారు. కోల్‌కతాలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (CREDAI) నిర్వహించిన 24వ నాట్‌కాన్ సదస్సులో ఆయన మాట్లాడారు.

వినియోగదారుల నమ్మకమే అసలైన సంపద

రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అవకాశాలతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని అభిషేక్ అన్నారు. వినియోగదారులు, ఉద్యోగులు, పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని చెప్పారు. తమ సంస్థ పనితీరును అంచనా వేయడానికి మూడు ప్రశ్నలు వేసుకుంటామని వివరించారు. ఇప్పటికే తమ వద్ద ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తి మరోసారి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉద్యోగం వదిలి వెళ్లిన వ్యక్తి తిరిగి తమ సంస్థలో చేరాలనుకుంటారా? గతంలో పెట్టుబడి పెట్టిన వ్యక్తి మరోసారి పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తారా? అనే అంశాలను పరిశీలిస్తామని తెలిపారు.

మనం సంపాదించాల్సిన అసలైన సంపద నమ్మకం. ఒక వినియోగదారుడు మొదటిసారి మన దగ్గర ఇల్లు కొన్నప్పుడు మనపై ఆశతో కొనుగోలు చేస్తాడు. రెండోసారి కొన్నప్పుడు మాత్రం నమ్మకంతో కొనుగోలు చేస్తాడు. ఆ రెండో కొనుగోలే మనపై ఉన్న నమ్మకానికి అసలైన పరీక్ష అని అభిషేక్ పేర్కొన్నారు. తమ సంస్థలోనూ గతంలో తప్పులు జరిగాయని, వ్యాపారాన్ని సామర్థ్యానికి మించి విస్తరించడం, నిర్మాణ నాణ్యతలో సమస్యలు, ప్రాజెక్టుల అప్పగింతలో ఆలస్యం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయని అంగీకరించారు. అయితే, కాలక్రమంలో ఆ సమస్యలు తొలగిపోయినా, వినియోగదారుల నమ్మకమే తమతో నిలిచిందని చెప్పారు.

20 కోట్ల అమ్మకాల నుంచి 5,000 మందికి పైగా ఉద్యోగులు

అభిషేక్ లోధా 2003 ఫిబ్రవరిలో కుటుంబ వ్యాపారంలో చేరినప్పుడు సంస్థ వార్షిక అమ్మకాలు రూ.20 కోట్లుగా ఉండేవి. అప్పట్లో 20–25 మంది ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. సంస్థపై ఎలాంటి అప్పులు కూడా లేవు. ప్రస్తుతం సంస్థలో 5,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని ఆయన తెలిపారు. నివాస ప్రాజెక్టులు, అద్దె వ్యాపారం, డేటా సెంటర్ల విభాగాలకు ప్రత్యేక నాయకత్వ బృందాలు పనిచేస్తున్నాయని వివరించారు. వివిధ రంగాలు, ప్రాంతాల నుంచి ప్రతిభావంతులను సంస్థలోకి తీసుకోవడం తమ అభివృద్ధికి తోడ్పడిందని చెప్పారు. ఉద్యోగులు సంస్థ ప్రయాణంలో తాము కూడా భాగస్వాములమనే భావనతో పనిచేసేలా చూడాలని సూచించారు.

కేవలం ఎఫ్‌ఎస్‌ఐ, మార్కెట్ విలువే..

నిర్మాణ సంస్థలు ఎఫ్‌ఎస్‌ఐ (అనుమతించిన అంతస్తుల నిర్మాణానికి సంబంధించిన నిష్పత్తి), మార్కెట్ క్యాపిటలైజేషన్ వంటి అంశాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చి, నమ్మకాన్ని పక్కన పెట్టకూడదని అభిషేక్ హెచ్చరించారు. దీర్ఘకాలంలో మంచి పేరు సంపాదించుకోవడమే ముఖ్యమని పేర్కొన్నారు.

బెంగళూరులో ప్రెస్టీజ్ గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్‌ను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. ఆయనపై ఉన్న నమ్మకం కారణంగా భూ యజమానులు, నిర్మాణ సంస్థలు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఆయనను సంప్రదిస్తారని తెలిపారు. నమ్మకం కూడా ఒక వ్యాపార ఆస్తిగా మారుతుందని ఈ ఉదాహరణ తెలియజేస్తోందన్నారు.

భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రియల్ ఎస్టేట్ రంగం సుమారు 7–8 శాతం వాటా కలిగి ఉందని అభిషేక్ చెప్పారు. సిమెంట్, ఉక్కు, పెయింట్లు, టైల్స్ సహా సుమారు 400 అనుబంధ రంగాలతో ఈ పరిశ్రమకు సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఉపాధి కల్పనపై దీని ప్రభావం విస్తృతంగా ఉంటుందని వివరించారు.

2047 నాటికి భారత్‌ను 25 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలిపారు. రానున్న‌ 15 ఏళ్లు మన రంగానికి స్వర్ణయుగం. ఈ కాలంలో అమ్మకాలు పెంచుతాం, లాభాలు ఆర్జిస్తాం, మార్కెట్ విలువను పెంచుకుంటాం. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల నమ్మకాన్ని సంపాదిస్తాం. మేం కేవలం భవనాలను నిర్మించే వాళ్లం మాత్రమే కాదు.. దేశ నిర్మాణంలో భాగస్వాములం అని అభిషేక్ లోధా పేర్కొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0