రూ.1–2 కోట్ల ఇళ్లకే గిరాకీ ఎందుకు?

Hyderabad’s residential real estate market is shifting towards the ₹1–2 crore housing segment, which accounted for 45% of total home sales in H1 2026, making it the city’s most in-demand price bracket.

Sep 11, 2026 - 06:50
 0  7
రూ.1–2 కోట్ల ఇళ్లకే గిరాకీ ఎందుకు?
Why Are ₹1–2 Crore Homes in Such High Demand?
  • హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మారుతున్న కొనుగోలు ధోరణి..
  • మొత్తం అమ్మకాల్లో 45 శాతం ఈ సెగ్మెంట్‌దే

హైదరాబాద్ నగర రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో కొనుగోలుదారుల ప్రాధాన్యాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు అందుబాటు ధరల్లో ఇళ్ల కోసం ఎక్కువగా వెతికిన కొనుగోలుదారులు ఇప్పుడు రూ.1–2 కోట్ల ధరల శ్రేణిలోని ఇళ్లవైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. 2026 తొలి అర్ధభాగంలో హైదరాబాద్‌లో జరిగిన మొత్తం నివాసాల అమ్మకాల్లో ఈ ధరల విభాగం ఏకంగా 45 శాతం వాటాను సాధించింది. దీంతో రూ.1–2 కోట్ల ఇళ్లు నగర మార్కెట్‌లో అత్యంత డిమాండ్‌ ఉన్న సెగ్మెంట్‌గా నిలిచాయి. ఇదే సమయంలో రూ.50 లక్షల లోపు ఇళ్ల వాటా 3 శాతానికి పడిపోయింది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఇళ్ల వాటా కూడా గత ఏడాది 28 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. అంటే హైదరాబాద్‌ హౌసింగ్‌ మార్కెట్‌ క్రమంగా ‘మిడ్‌-ప్రీమియం’ వైపు మళ్లుతోంది.

45 శాతం అమ్మకాలు.. ఎందుకింత డిమాండ్‌?

నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌లో రూ.1–2 కోట్ల ఇళ్ల అమ్మకాలు మొత్తం మార్కెట్‌లో 45 శాతం ఉన్నాయి. ఈ ధరల విభాగంలో 19,991 యూనిట్ల అన్‌సోల్డ్‌ ఇన్వెంటరీ ఉన్నప్పటికీ, ఈ సెగ్మెంట్‌కు సంబంధించిన ‘క్వార్టర్స్‌ టు సెల్‌’ 4.5గా ఉంది. అంటే ప్రస్తుత అమ్మకాల వేగంతో చూస్తే ఈ స్టాక్‌ను విక్రయించడానికి సుమారు 4.5 త్రైమాసికాలు పడుతుందని అంచనా. ఇది మార్కెట్‌లో గణనీయమైన డిమాండ్‌ ఉన్నదనే సంకేతంగా చూడొచ్చు. హైదరాబాద్‌లో రూ.1–2 కోట్ల ఇళ్లకు డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణాల్లో ఐటీ, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు, బీఎఫ్ఎస్ఐ, ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ రంగాల్లో ఉద్యోగాల వృద్ధి ఒకటి. అధిక ఆదాయం పొందుతున్న ఉద్యోగులు కేవలం ఇల్లు ఉండటానికే కాకుండా మెరుగైన జీవనశైలి, పెద్ద విస్తీర్ణం, ఆధునిక సౌకర్యాలు ఉన్న ఇళ్లను కోరుకుంటున్నారు. నైట్‌ ఫ్రాంక్‌ కూడా హైదరాబాద్‌ హౌసింగ్‌ డిమాండ్‌ ప్రధానంగా ఎండ్‌ యూజర్ల నుంచి వస్తోందని పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కొండాపూర్‌, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట, నార్సింగి ప్రాంతాల్లో ఉద్యోగ కేంద్రాలకు దగ్గరగా నివాసం ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ ప్రాంతాల్లో పెద్ద ఇళ్లకు, గేటెడ్‌ కమ్యూనిటీలకు డిమాండ్‌ బలంగా ఉంది. 2026 ప్రథమార్థంలో పశ్చిమ హైదరాబాద్‌ నగర కొత్త హౌసింగ్‌ లాంచ్‌లలో 61 శాతం, అమ్మకాల్లో 60 శాతం వాటాను కలిగి ఉంది.

రూ.50 లక్షల ఇల్లు ఎందుకు వెనుకబడింది?

రూ.1–2 కోట్ల ఇళ్లకు డిమాండ్‌ పెరగడానికి మరో కారణం రూ.50 లక్షల లోపు ఇళ్ల సరఫరా తగ్గిపోవడం. 2026 తొలి అర్థభాగంలో రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు మొత్తం హైదరాబాద్‌ మార్కెట్‌లో కేవలం 3 శాతానికి పరిమితమయ్యాయి. ఏడాది క్రితం ఇది 5 శాతం. అదే సమయంలో రూ.1–2 కోట్ల ఇళ్ల వాటా 45 శాతంగా కొనసాగింది. నిర్మాణ వ్యయాలు, భూమి ధరలు పెరగడంతో డెవలపర్లకు తక్కువ ధరల ఇళ్లను నిర్మించడం కష్టమవుతోంది. దీంతో కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా రూ. కోటి పైబడిన ధరల విభాగంలో వస్తున్నాయి. మరోవైపు కొనుగోలుదారుల ఆదాయాలు పెరగడం, పెద్ద ఇళ్లపై ఆసక్తి పెరగడంతో డిమాండ్‌ కూడా అదే దిశలో కదులుతోంది. ఇక రూ.1–2 కోట్ల బడ్జెట్‌లో కొనుగోలుదారులు కేవలం ఎక్కువ చదరపు అడుగుల విస్తీర్ణాన్నే చూడటం లేదు. క్లబ్‌హౌస్‌, జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్పేస్‌, పిల్లల ఆట స్థలాలు, సెక్యూరిటీ, ల్యాండ్‌స్కేపింగ్‌, పార్కింగ్‌ వంటి సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే గేటెడ్‌ కమ్యూనిటీల్లోని 3బీహెచ్‌కేలు, పెద్ద 2బీహెచ్‌కేలు ఈ ధరల విభాగంలో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.

ధరలు కూడా పెరుగుతున్నాయి

హైదరాబాద్‌లో నివాస ఆస్తుల సగటు ధర వార్షిక ప్రాతిపదికన 7 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.8,258కు చేరింది. అయితే అన్ని ప్రాంతాల్లో ధరలు ఒకే స్థాయిలో పెరగడం లేదు. బంజారాహిల్స్‌లో వార్షిక ధర వృద్ధి 7 శాతం, మణికొండలో 5 శాతం, బండ్లగూడలో 4 శాతం నమోదైంది. కోకాపేట, కొంపల్లిలో 2 శాతం చొప్పున పెరుగుదల కనిపించింది. సైనిక్‌పురిలో మాత్రం ధరలు 3 శాతం తగ్గాయి.

రూ.2–5 కోట్ల ఇళ్లకూ పెరుగుతున్న ఆదరణ

రూ.1–2 కోట్ల సెగ్మెంట్‌ మాత్రమే కాదు.. అంతకంటే ఖరీదైన ఇళ్లకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. హైదరాబాద్‌లో రూ.2–5 కోట్ల ఇళ్ల అమ్మకాల వాటా 18 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 30 శాతం పెరిగాయి. రూ.5–10 కోట్ల ఇళ్ల వాటా కూడా 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2026 మొదటి ఆరునెలల్లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రూ.1 కోటి పైబడిన ఇళ్ల వాటా మొత్తం అమ్మకాల్లో 54 శాతానికి చేరింది. 2025 తొలి అర్థభాగంలో ఇది 49 శాతం. రూ.1–2 కోట్ల విభాగం దేశవ్యాప్తంగా 50,488 ఇళ్ల అమ్మకాలతో మొత్తం విక్రయాల్లో 29 శాతం వాటాను సాధించింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం ఇల్లు కొనుగోలు చేస్తున్నవారిలో స్వయంగా నివసించేందుకు కొనుగోలు చేసే ఎండ్‌ యూజర్లే ప్రధానంగా ఉన్నారని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0