- అయోధ్యలో రూ.3.31 కోట్ల పెట్టుబడి తర్వాత కొత్త బాధ్యత
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక అడుగు వేశారు. ఇటీవల అయోధ్యలో రూ.3.31 కోట్ల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసిన ఆయన, ఇప్పుడు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హౌస్ ఆఫ్ అభినందన్ లోధాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అయోధ్యలో సంస్థ అభివృద్ధి చేస్తున్న 'ది సరయూ' ప్రాజెక్టుతో పాటు దేశవ్యాప్తంగా చేపడుతున్న లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రజలకు చేరువ చేసే బాధ్యతను ఆయన నిర్వర్తించనున్నారు.
కొద్ది రోజుల క్రితమే రణ్‌బీర్ కపూర్ అయోధ్యలోని 'ది సరయూ' పేరుతో అభివృద్ధి చేస్తున్న ప్రీమియం ప్రాజెక్టులో 2,134 చదరపు అడుగుల స్థలాన్ని సుమారు రూ.3.31 కోట్లకు కొనుగోలు చేశారు. సరయూ నది ఒడ్డున 75 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో క్లబ్‌హౌస్, ఆధునిక సౌకర్యాలు, లగ్జరీ హోటల్ వంటి వసతులు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'రామాయణం'లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే అయోధ్యలో పెట్టుబడి పెట్టడం, అనంతరం అదే ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం సినీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
అయోధ్యలో పెరుగుతున్న పెట్టుబడులు
రామమందిరం ప్రారంభం తర్వాత అయోధ్య దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కేంద్రంగా మారుతోంది. విమానాశ్రయం, రహదారులు, హోటళ్లు, పర్యాటక మౌలిక సదుపాయాల విస్తరణతో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖులు అయోధ్యలో భారీగా పెట్టుబడులు పెట్టగా, ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ కూడా ఆ జాబితాలో చేరారు. దీంతో అయోధ్య లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కొత్త ఊపు వచ్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.