ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌కు కేంద్రం  నుంచి కదలిక.. పీఎంఓ ఆరా

The Northern Regional Ring Road (RRR) project around Hyderabad has reached a crucial stage, with the PMO seeking updates on the project’s progress and the Telangana government pushing for final Union Cabinet approval.

Aug 26, 2026 - 07:54
 0  15
ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌కు కేంద్రం  నుంచి కదలిక.. పీఎంఓ ఆరా
Movement from Centre on RRR North… PMO Seeks Update

ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌పై పీఎంఓ ఆరా

కేంద్ర క్యాబినెట్‌ ఆమోదమే కీలకం

రూ.23,995 కోట్లకు చేరిన ప్రాజెక్టు వ్యయం

95 శాతం భూసేకరణ పూర్తి

సంగారెడ్డి-చౌటుప్పల్‌ 161.5 కి.మీ.

ఓఆర్‌ఆర్‌కు అవతల కొత్త గ్రోత్‌ కారిడార్‌

పరిశ్రమలు, లాజిస్టిక్స్‌ హబ్‌లకు ఊతం

నార్త్‌తో పాటు సౌత్‌పైనా కేంద్రం ఫోకస్‌

హైదరాబాద్‌ చుట్టూ మరో భారీ గ్రోత్‌ స్టోరీకి రంగం సిద్ధమవుతోందా..? ఏళ్లుగా ప్రతిపాదనలు.. డీపీఆర్‌లు.. టెండర్లతో సాగుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఏకంగా పీఎంఓ స్థాయిలో ప్రాజెక్టుపై ఆరా తీయడంతో కేంద్రంలో కదలిక మొదలైంది. భూసేకరణ దాదాపు పూర్తి.. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించిన ప్రక్రియలోనూ ముందడుగు.. ఇక కేంద్ర క్యాబినెట్‌ ఆమోదమే కీలకంగా మారింది. రూ.24 వేల కోట్లకు చేరిన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే.. హైదరాబాద్‌ చుట్టూ మరో భారీ రవాణా, అభివృద్ధి కారిడార్‌ రూపుదిద్దుకోనుంది.

సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు సుమారు 161.5 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేగా ఈ రహదారిని నిర్మించనున్నారు. ఏళ్లుగా వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుపై ఇప్పుడు పీఎంఓ స్థాయిలో ఆరా తీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాజెక్టు పురోగతి ఎంతవరకు వచ్చింది? భూసేకరణ పరిస్థితి ఏంటి? టెండర్ల ప్రక్రియ ఎక్కడుంది? క్యాబినెట్‌ ఆమోదానికి ఇంకా ఎలాంటి ప్రక్రియ పూర్తి కావాలి? వంటి అంశాలపై కేంద్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌కు సంబంధించి ఇప్పటికే కీలక ప్రక్రియలు పూర్తయ్యాయి. ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా పెరిగింది. మొదట సుమారు 15 వేల కోట్ల అంచనాతో ఉన్న ఈ ప్రాజెక్టు.. ఆరు లేన్లకు విస్తరణ, భూసేకరణ, ఇతర వ్యయాల కారణంగా ఇప్పుడు 23,995.60 కోట్లకు చేరింది. ఈ వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ ఆమోదం లభించింది. అంటే.. ప్రాజెక్టు ఆర్థిక పరంగా కూడా మరో కీలక దశ దాటినట్టే.

వ్యయ ప్రతిపాదనకు ముందడుగు పడినా.. ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలంటే కేంద్ర క్యాబినెట్‌ తుది ఆమోదం కీలకం. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. జూలైలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదాన్ని త్వరగా ఇప్పించాలని కోరారు. అంతేకాదు.. ఉత్తర భాగానికి సంబంధించి 95 శాతం భూసేకరణ పూర్తయిందని సీఎం కేంద్రానికి వివరించారు.

మొత్తంగా సుమారు 1,918.50 హెక్టార్ల భూమి సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో భూసేకరణ కోసం మరోసారి పెద్ద ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం లేకుండా.. మిగిలిన అనుమతులు, ఆర్థిక ఆమోదాలు పూర్తయితే పనులను వేగంగా ప్రారంభించే అవకాశం ఏర్పడింది. అందుకే ఇప్పుడు పీఎంఓ ఆరా.. క్యాబినెట్‌ ఆమోదం అనే రెండు అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. సంగారెడ్డి నుంచి మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల మీదుగా చౌటుప్పల్‌ వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌ విస్తరించనుంది. ఇది పూర్తయితే హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌కు అవతల మరో భారీ రవాణా వలయం అందుబాటులోకి వస్తుంది.

పరిశ్రమలు.. లాజిస్టిక్స్‌ పార్కులు.. గోదాములు.. కమర్షియల్‌ హబ్‌లు.. కొత్త టౌన్‌షిప్‌లకు ఈ కారిడార్‌ ఊతమిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంటర్‌చేంజ్‌ల చుట్టూ భవిష్యత్‌లో కొత్త అభివృద్ధి కేంద్రాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి క్యాబినెట్‌ ఆమోదం కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే.. దక్షిణ భాగంపైనా కేంద్రం కసరత్తు చేస్తోంది. దక్షిణ భాగానికి డీపీఆర్‌ తయారీ ప్రక్రియ కూడా ముందుకు సాగుతోంది. అంటే.. ఉత్తర భాగానికి తుది అనుమతులు లభిస్తే.. ఆర్‌ఆర్‌ఆర్‌ మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి మరింత వేగం వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా.. ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌ ఇప్పుడు మరో కీలక మలుపులో ఉంది.

పీఎంఓ ఆరా తీయడం.. దాదాపు 95 శాతం భూసేకరణ పూర్తి కావడం.. 24 వేల కోట్లకు చేరిన ప్రాజెక్టు వ్యయానికి సంబంధించిన ప్రక్రియలో ముందడుగు పడటం.. ఇప్పుడు అందరి చూపు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదంపైనే పడేలా చేస్తోంది. క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ వస్తే.. ఇన్నాళ్లూ ఫైళ్లకే పరిమితమైన ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌.. హైదరాబాద్‌ భవిష్యత్‌ గ్రోత్‌ను మార్చే రియాలిటీ ప్రాజెక్టుగా మారే అవకాశం ఉంది. గోదాములు, కమర్షియల్‌ హబ్‌లు విస్తరించే అవకాశం ఉంది.

అందుకే ఇప్పుడు RRR నార్త్‌పై ప్రతి అడుగూ కీలకంగా మారింది. పీఎంఓ స్థాయిలో ఆరా.. ప్రాజెక్టు వ్యయానికి ఆమోదం.. భూసేకరణ దాదాపు పూర్తి.. ఇక మిగిలింది కేంద్ర క్యాబినెట్‌ తుది నిర్ణయం. ఆ ఆమోదం లభిస్తే ఎన్నేళ్లుగా కాగితాలపై ఉన్న RRR నార్త్‌.. నిర్మాణ దశలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు హైదరాబాద్‌ చుట్టూ మరో భారీ గ్రోత్‌ స్టోరీకి నాంది కానుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0