2030 నాటికి రియల్ ఎస్టేట్‌లో పెను మార్పులు
India’s real estate sector is rapidly evolving, with infrastructure growth, changing buyer preferences, technology, and new investment opportunities expected to reshape the market by 2030.
భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా మారుతోంది. ప్రస్తుతం కనిపిస్తున్న కొన్ని కొత్త విధానాలు, పెట్టుబడి ధోరణులు, టెక్నాలజీ ఆధారిత పరిణామాలు వచ్చే నాలుగేళ్లలో మరింత విస్తరించి సాధారణంగా మారే అవకాశముంది. 2030 నాటికి ఇళ్లు కొనడం, అద్దెకు ఉండటం, వాణిజ్య స్థలాల్లో పెట్టుబడులు పెట్టడం నుంచి భవనాల నిర్మాణం, నిర్వహణ వరకు అనేక అంశాల్లో కొత్త ట్రెండ్లు కీలక పాత్ర పోషించనున్నాయి
1. మౌలిక వసతుల చుట్టూ రియల్ ఎస్టేట్ విస్తరణ
మెట్రో రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, విమానాశ్రయాలు, కొత్త ఉద్యోగ కేంద్రాలు ఏర్పడుతున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఇప్పటికే వేగం పుంజుకుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడిన ప్రాంతాలకు ప్రజలు, కంపెనీలు తరలివెళ్లడంతో అక్కడ ఇళ్లకు, కార్యాలయాలకు, షాపింగ్ ప్రాంతాలకు డిమాండ్ పెరుగుతోంది. 2030 నాటికి కనెక్టివిటీ–ఉద్యోగాలు–నివాస ప్రాంతాలు అనే మూడు అంశాలు రియల్ ఎస్టేట్ ధరలను, డిమాండ్‌ను ప్రభావితం చేసే ప్రధాన కారకాలుగా మారవచ్చని అంచనా. కొత్త మెట్రో కారిడార్లు, ఎయిర్‌పోర్టులు, రీజినల్ రోడ్లు, ఇండస్ట్రియల్ కారిడార్లకు సమీపంలోని ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
2. ప్రీమియం ఇళ్లకు పెరుగుతున్న ప్రాధాన్యం
భారతీయ హౌసింగ్ మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్ ఇప్పటికే బలమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లో రూ. కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయి. 2025 తొలి తొమ్మిది నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జరిగిన ఇళ్ల విక్రయాల్లో రూ. కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల వాటా సుమారు 62 శాతంగా ఉంది. దీంతో 2030 నాటికి పెద్ద విస్తీర్ణం, మెరుగైన సౌకర్యాలు, క్లబ్‌హౌస్, వెల్‌నెస్, సెక్యూరిటీ, కన్సియర్జ్ వంటి సేవలతో కూడిన ప్రీమియం గృహాలకు మరింత డిమాండ్ రావచ్చని అంచనా. అంటే కేవలం ‘ఇల్లు’ అనే అవసరానికి బదులుగా లైఫ్‌స్టైల్, సౌకర్యం, సర్వీసులు కలిపిన నివాసం కొనుగోలుదారులకు ముఖ్యమవుతోంది.
3. సీనియర్ లివింగ్.. ప్రత్యేక నివాస విభాగంగా
భారత్‌లో వృద్ధుల సంఖ్య పెరగడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గడం, పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర నగరాలు లేదా దేశాలకు వెళ్లడం వంటి పరిణామాలతో సీనియర్ లివింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. సీనియర్ లివింగ్ అంటే కేవలం వృద్ధుల కోసం నిర్మించిన ఇళ్లు కాదు. ఒకే ప్రాంగణంలో నివాసం, ఆరోగ్య సేవలు, వెల్‌నెస్, వినోదం, భద్రత, రోజువారీ సహాయక సేవలు అందించే విధానం పెరుగుతోంది. ఆరోగ్య సదుపాయాలు బాగా ఉన్న నగరాల్లో ఈ విభాగం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 2030 నాటికి సీనియర్ లివింగ్ కూడా సాధారణ రెసిడెన్షియల్ కేటగిరీల్లో ఒకటిగా మారే అవకాశం ఉందని పరిశ్రమ అంచనా వేస్తోంది.
4. అద్దె ఇళ్లకు కొత్త రూపం
భారత్‌లో రెంటల్ హౌసింగ్ మార్కెట్ ఇప్పటికీ చాలా వరకు అసంఘటితంగానే ఉంది. అయితే ఉద్యోగాల కోసం ఒక నగరం నుంచి మరో నగరానికి మారే యువత, విద్యార్థులు, ప్రొఫెషనల్స్ సంఖ్య పెరుగుతుండటంతో కో-లివింగ్, ప్రొఫెషనల్‌గా నిర్వహించే రెంటల్ హౌసింగ్కు డిమాండ్ పెరుగుతోంది. ఇకపై ఇంటి యజమాని–అద్దెదారు మధ్య సంప్రదాయ ఒప్పందాలకు బదులుగా డిజిటల్ అగ్రిమెంట్లు, ఆన్‌లైన్ రెంట్ పేమెంట్లు, ప్రొఫెషనల్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ, యుటిలిటీ బిల్లులు, ఇతర సేవలను ఒకే ప్యాకేజీగా అందించే విధానం పెరగవచ్చు. 2030 నాటికి ‘ఇల్లు అద్దెకు తీసుకోవడం’ కంటే ‘మేనేజ్డ్ రెంటల్ కమ్యూనిటీలో నివసించడం’ మరింత సాధారణంగా మారే అవకాశం ఉంది.
5. డేటా సెంటర్లు, గోదాములు, లాజిస్టిక్స్ పార్కులు
డిజిటల్ వినియోగం పెరగడంతో డేటా సెంటర్లకు భారీగా స్థలం అవసరం అవుతోంది. అదే సమయంలో ఈ-కామర్స్, తయారీ రంగం, సరఫరా వ్యవస్థల విస్తరణతో గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో ఏఐ రంగం వృద్ధికి 2030 నాటికి అదనంగా 4.5–5 కోట్ల చదరపు అడుగుల వరకు డేటా సెంటర్ రియల్ ఎస్టేట్ అవసరం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ప్రధానంగా నివాస, కార్యాలయ భవనాల చుట్టూ తిరిగిన సంస్థాగత రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో డేటా సెంటర్లు, వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ వంటి ప్రత్యేక ఆస్తుల వాటా పెరగవచ్చు.
నగరాల భవిష్యత్తును మార్చనున్న ట్రెండ్లు
భారత్‌లో పట్టణీకరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్‌కు దీర్ఘకాలిక డిమాండ్ కొనసాగే అవకాశం ఉంది. 2030 నాటికి భారత్ జనాభాలో 38 శాతం పట్టణ ప్రాంతాల్లో నివసించే అవకాశం ఉంది. దీంతో రియల్ రంగంలో ఈ ఐదు ట్రెండ్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0