నాలుగేళ్లలో రూ.లక్ష కోట్ల డాలర్లకు..
India’s real estate market is projected to grow from around $660 billion today to $1 trillion by 2030, with the sector’s contribution to the country’s GDP potentially rising from about 7% to 13%.
- 2030 నాటికి జీడీపీలో 13 శాతానికి రియల్ వాటా
- తాజా నివేదిక అంచనా
భారత రియల్ ఎస్టేట్ రంగం దీర్ఘకాలిక నిర్మాణాత్మక వృద్ధి దిశగా సాగుతోంది. ప్రస్తుతం సుమారు 66,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి లక్ష కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రంగం ఏటా దాదాపు 10 శాతం వృద్ధి చెందుతుందని, దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ వాటా ప్రస్తుతం సుమారు 7 శాతం ఉండగా.. 2030 నాటికి 13 శాతానికి చేరొచ్చని భావిస్తున్నారు. భారత్‌లో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న మధ్యతరగతి ఆదాయాలు, నగరాల్లో ఉద్యోగ అవకాశాల విస్తరణ, ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ రియల్ ఎస్టేట్ వృద్ధికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన గృహాల కొరత కూడా డిమాండ్‌ను పెంచుతోంది. దేశంలోని టాప్ ఏడు నగరాల్లో 2024లో ఇళ్ల కొనుగోళ్ల విలువ దాదాపు రూ.5.68 లక్షల కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 16 శాతం పెరుగుదల. దీంతో భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి కేవలం ధరల పెరుగుదల వల్ల కాకుండా, వాస్తవిక డిమాండ్, పట్టణీకరణ, ఆదాయాల పెరుగుదల వంటి దీర్ఘకాలిక కారణాలతో కొనసాగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రైవేట్ ఈక్విటీకి ఎందుకు ఆకర్షణ?
ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్న భారీ మార్కెట్ కావడంతో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలకు భారత్ కీలక పెట్టుబడి గమ్యస్థానంగా మారుతోంది. బ్యాంకులు డెవలపర్లకు రుణాలు ఇవ్వడంలో ఇప్పటికీ కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో నిధుల అవసరం పెరుగుతోంది. ఈ ఖాళీని ప్రైవేట్ క్యాపిటల్ భర్తీ చేస్తోంది. 2024లో భారత రియల్ ఎస్టేట్‌లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు 32 శాతం పెరిగి సుమారు 4.2 బిలియన్ డాలర్లకు చేరాయి. 2026 నాటికి ఇవి 6.5–7.5 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. మరోవైపు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పరిధి కూడా విస్తరిస్తోంది. గతంలో ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులకే పెట్టుబడులు పరిమితమయ్యేవి. ఇప్పుడు ఆఫీస్ స్పేస్, డేటా సెంటర్లు, వేర్‌హౌసింగ్, రిటైల్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీలు వంటి విభాగాల్లోనూ పీఈ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. 2025లో పీఈ పెట్టుబడుల్లో ఆఫీస్ రంగం సుమారు 35 శాతంతో ముందుండగా, డేటా సెంటర్లు దాదాపు 23 శాతం, రెసిడెన్షియల్ రంగం 21 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగం మరింత వ్యవస్థీకృతంగా మారడం కూడా సంస్థాగత పెట్టుబడులకు అనుకూలంగా మారింది. రెరా ద్వారా ప్రాజెక్టులపై పారదర్శకత, నియంత్రణ పెరిగింది. దీంతో బలహీనమైన, అనుభవం తక్కువ ఉన్న డెవలపర్ల సంఖ్య తగ్గి, మరింత వ్యవస్థీకృత సంస్థలు మార్కెట్లో బలపడుతున్నాయి. అలాగే ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు నమ్మకమైన భాగస్వాములతో కలిసి పనిచేసే అవకాశం పెరిగింది. మెరుగైన గవర్నెన్స్, పారదర్శకత, ప్రాజెక్టులపై స్పష్టమైన సమాచారం పెట్టుబడిదారుల రిస్క్‌ను తగ్గిస్తున్నాయి. మరోవైపు భారత్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, ఐటీ, ఫైనాన్స్, ఇంజినీరింగ్ కంపెనీల విస్తరణతో ప్రీమియం ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ కొనసాగుతోంది.
అదే సమయంలో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవల వినియోగం పెరగడంతో డేటా సెంటర్ల అవసరం కూడా వేగంగా పెరుగుతోంది. 2025లో భారత రియల్ ఎస్టేట్‌లో మొత్తం సంస్థాగత పెట్టుబడులు 8.5 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయని కొలియర్స్ ఇండియా తెలిపింది. ఇందులో ఆఫీస్ ఆస్తులు 54 శాతంతో ప్రధాన వాటా దక్కించుకున్నాయి అయితే భారత రియల్ ఎస్టేట్ వృద్ధికి కొన్ని సవాళ్లు లేకపోలేదు. భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు, వడ్డీ రేట్లు, నియంత్రణల మార్పులు, ప్రాజెక్టుల అమలులో ఆలస్యం వంటి అంశాలు పెట్టుబడిదారులకు రిస్క్‌ను పెంచవచ్చు. అంతేకాకుండా నగరాల మధ్య డిమాండ్‌లో తేడాలు, ప్రీమియం హౌసింగ్‌పై అధిక ఆధారపడటం వంటి అంశాలను కూడా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0