ఫ్లాట్ బుకింగ్‌ క్యాన్సిల్‌ చేస్తున్నారా?

The Maharashtra Real Estate Regulatory Authority (MahaRERA) has clarified the rules on deductions when homebuyers cancel a flat booking.

Sep 2, 2026 - 01:58
 0  28
ఫ్లాట్ బుకింగ్‌ క్యాన్సిల్‌ చేస్తున్నారా?
maharera-flat-booking-cancellation-charges-rules

-      బిల్డర్‌ ఎంత డబ్బు కట్‌ చేయొచ్చు

-      మహారెరా కీలక వివరణ

సొంతింటి కలతో ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత అనుకోని ఆర్థిక ఇబ్బందులు, బ్యాంకు రుణం మంజూరు కాకపోవడం, వ్యక్తిగత కారణాలు, ఇతర ప్రాజెక్టు నచ్చడం వంటి కారణాలతో బుకింగ్‌ను రద్దు చేసుకునే పరిస్థితి రావచ్చు. అయితే ఫ్లాట్‌ బుకింగ్‌ క్యాన్సిల్‌ చేస్తే బిల్డర్‌ మొత్తం బుకింగ్‌ మొత్తాన్ని జప్తు చేయగలడా? లేక కొంత మొత్తం మాత్రమే మినహాయించి మిగతా మొత్తాన్ని తిరిగి ఇవ్వాలా? అనే ప్రశ్నలు చాలామంది హోమ్‌బయ్యర్లను వేధిస్తుంటాయి. ఈ అంశంపై మహారాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) తాజాగా స్పష్టత ఇచ్చింది. బిల్డర్లు తమ ప్రాజెక్టుకు సంబంధించిన రద్దు నిబంధనలను నిర్దేశించుకోవచ్చని, అయితే అవి కొనుగోలుదారులకు ముందుగానే స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. నిబంధనలకు మించి అదనంగా డబ్బును కట్‌ చేసుకునే అధికారం డెవలపర్‌కు ఉండదని స్పష్టం చేసింది.

సాధారణంగా ఎంత కట్‌ చేయొచ్చు?

మహారెరా మోడల్‌ అలాట్‌మెంట్‌ లెటర్‌లో కొనుగోలుదారు తనంతట తాను బుకింగ్‌ను రద్దు చేసుకున్నప్పుడు మినహాయించగల మొత్తానికి ఒక పరిమితిని నిర్దేశించింది. ప్రస్తుతం సంబంధిత మోడల్‌ నిబంధనల ప్రకారం, బుకింగ్‌ రద్దు చేసిన సమయాన్ని బట్టి మినహాయించుకోవచ్చు. ప్లాట్ బుక్ చేసుకున్న నాటి నుంచి 15 రోజుల్లోపు క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి మొత్తం ఇచ్చేయాలి.

అదే 16 నుంచి 30 రోజులలోపు ఒక శాతం వరకు 31 నుంచి 60 రోజులలోపు 1.5 శాతం వరకు, 61 రోజులు అంతకంటే ఎక్కువ అయితే 2 శాతం వరకు మినహాయించుకోవచ్చని రెరా చెబుతోంది. అంటే రూ.1 కోటి విలువైన ఫ్లాట్‌ను 61 రోజుల తర్వాత కొనుగోలుదారు తన కారణాలతో క్యాన్సిల్‌ చేస్తే, మోడల్‌ నిబంధన ప్రకారం గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మినహాయించే పరిస్థితి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే, 2 శాతం అనేది ప్రతి ప్రాజెక్టుకు, ప్రతి పరిస్థితిలో తప్పనిసరిగా వర్తించే ఒకే ఒక్క పరిమితి అని భావించకూడదు. డెవలపర్‌ తన ప్రాజెక్టుకు ప్రత్యేకమైన రద్దు నిబంధనలను నిర్ణయించుకునే అవకాశం ఉంది. అయితే ఆ విషయాలను కొనుగోలుదారుకు ముందుగానే స్పష్టంగా తెలియజేయాలి. ప్రాజెక్టుకు సంబంధించిన డీవియేషన్ షీట్ లో నమోదు చేసి, కొనుగోలుదారుకు అందుబాటులో ఉంచాలి. అంతకుమించి అదనంగా డబ్బు కట్ చేసుకునే హక్కు బిల్డర్ కు ఎంతమాత్రం ఉండదు.

బ్యాంకు లోన్‌ రాకపోతే?

ఫ్లాట్‌ బుక్‌ చేసిన తర్వాత హోమ్‌లోన్‌ మంజూరు కాకపోవడం కూడా బుకింగ్‌ రద్దుకు ప్రధాన కారణాల్లో ఒకటి. అయితే ‘లోన్‌ రాలేదు కాబట్టి పూర్తి బుకింగ్‌ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి’ అనే ఆటోమేటిక్‌ హక్కు ప్రతి సందర్భంలో ఉండదు. బుకింగ్‌ నిబంధనల్లో లోన్ రిజెక్షన్ పరిస్థితిని ఎలా పరిగణించారో చూడాలి. ఇక డెవలపర్‌ తప్పిదం వల్ల బుకింగ్‌ రద్దు చేస్తే సాధారణ క్యాన్సిలేషన్ నిబంధనలు యథాతథంగా వర్తించవు. రెరా చట్టంలోని సెక్షన్ 18 కింద, డెవలపర్‌ ఒప్పంద ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలమైతే లేదా అంగీకరించిన గడువులో ఇల్లు అప్పగించకపోతే కొనుగోలుదారుకు రీఫండ్‌, వడ్డీ, వర్తించే పరిహారం వంటి హక్కులు ఏర్పడవచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0