హైదరాబాద్ లో రూ.500 కోట్ల  ప్రీ-లాంచ్‌ మోసం..

Allegations of a ₹500 crore pre-launch fraud have surfaced in Hyderabad’s real estate sector over the Tripura Nirvana project in Tellapur.

Oct 23, 2026 - 06:44
 0  28
హైదరాబాద్ లో రూ.500 కోట్ల  ప్రీ-లాంచ్‌ మోసం..
Hyderabad ₹500 Crore Pre-Launch Fraud Allegations Over Tripura Nirvana Project

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మరోసారి ప్రిలాంచ్ ఆఫర్ మోసం సంచలనం రేపుతోంది. తక్కువ ధరకే లగ్జరీ ఫ్లాట్‌.. మార్కెట్‌ ధర కంటే భారీ డిస్కౌంట్‌.. ఇలా ఆశ చూపించి వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తెల్లాపూర్‌లో త్రిపుర నిర్వాణ పేరుతో 2021లో ప్రకటించిన ప్రాజెక్టు చుట్టూ ఈ వివాదం మొదలైంది. తక్కువ ధరకే ఫ్లాట్‌ దక్కుతుందన్న ఆశతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, బీడీఎల్‌ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు సహా పలువురు కొనుగోలుదారులు డబ్బులు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. 

ప్రీ-లాంచ్‌ ఆఫర్‌.. భారీ వసూళ్లు

బాధితుల ఆరోపణల ప్రకారం.. 2021లో ప్రాజెక్టు పేరుతో ప్రీ-లాంచ్‌ బుకింగ్స్‌ ప్రారంభించారు. మార్కెట్‌ ధరల కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని చెప్పడంతో పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ముందస్తుగా డబ్బులు చెల్లించారు. ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు.. వందల మంది నుంచి కోట్ల రూపాయలు.. మొతంగా సుమారు రూ.500 కోట్ల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 350 మంది బాధితులు తమ డబ్బులు ఈ ప్రాజెక్టులో పెట్టినట్లు చెబుతున్నారు. 

ఐదేళ్లు గడిచినా.. పునాది పడలేదా?

డబ్బులు చెల్లించి సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము చెల్లించిన మొత్తానికి ఫ్లాట్‌ వస్తుందని ఎదురుచూస్తుంటే.. ప్రాజెక్టు స్థలంలో కనీసం పునాది పనులు కూడా ప్రారంభం కాలేదని వారు వాపోతున్నారు. దీంతో తమ జీవితకాల పొదుపు మొత్తం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అసలు ట్విస్ట్‌.. భూమి అమ్మకానికి?

ఈ వ్యవహారంలో మరో కీలక ఆరోపణ తెరపైకి వచ్చింది. తమ నుంచి ఫ్లాట్ల పేరుతో డబ్బులు తీసుకున్న తర్వాత.. ప్రాజెక్టుకు సంబంధించిన భూమిని మరో రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. అదే నిజమైతే.. ఇప్పటికే డబ్బులు చెల్లించిన వందలాది మంది కొనుగోలుదారుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఆరోపణలపై పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. 

సీసీఎస్‌ను ఆశ్రయించిన బాధితులు

తమకు న్యాయం చేయాలని కోరుతూ సుమారు 350 మంది బాధితులు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులను ఆశ్రయించారు. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ ఛైర్మన్‌ పసుపులేటి సుధాకర్‌తో పాటు సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

గతంలోనూ ఫిర్యాదులు?

ఇదే ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనూ ఫిర్యాదులు నమోదైనట్లు సమాచారం. 2026 మార్చిలో 10 మంది కొనుగోలుదారుల నుంచి సుమారు రూ.5.68 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై సీసీఎస్‌లో కేసు నమోదైనట్లు, 2025 నవంబర్‌లో సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగంలో మరో ఫిర్యాదు నమోదైనట్లు బాధితులు గుర్తుకొస్తున్నారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0