టైర్-2, టైర్-3 నగరాల్లో రియల్ ఎస్టేట్ దూకుడు
Real estate growth in India is increasingly shifting beyond major metros, with Tier-2 and Tier-3 cities recording stronger residential price growth.
- ఐదేళ్లలో ఇళ్ల ధరలు 63% పెరుగుదల
దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వృద్ధి ఇప్పుడు చిన్న, మధ్యస్థ నగరాల వైపు వేగంగా విస్తరిస్తోంది. టైర్-2, టైర్-3 నగరాల్లోని 11 ప్రముఖ మార్కెట్లలో నివాస ధరలు 2021 నుంచి 2026 మధ్య ఏకంగా 63 శాతం పెరిగాయి. ఇదే కాలంలో దేశంలోని టాప్-8 మెట్రో నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 42 శాతంగా ఉంది. సీఐఐ–నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియాస్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ మార్కెట్స్’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
ఈ ఐదేళ్లలో అభివృద్ధి చెందుతున్న 11 మార్కెట్లలో నివాస ధరలు సగటున 8 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటునమోదు చేశాయి. అదే సమయంలో ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, చెన్నై, పుణె, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి టాప్-8 నగరాల్లో సగటు ఇది 4 శాతం మాత్రమే. అంటే చిన్న నగరాల్లో ఇళ్ల ధరల వృద్ధి రేటు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే రెండింతలుగా ఉంది. నివేదికలో పరిశీలించిన 11 మార్కెట్లలో భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్ ట్రైసిటీ, గోవా, ఇండోర్, జైపూర్, కొచ్చి, లక్నో, నాగ్‌పూర్, విశాఖపట్నం, కోయంబత్తూరు ఉన్నాయి.
మౌలిక వసతులే కీలక చోదకశక్తి
ఈ నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకోవడానికి ప్రధాన కారణాల్లో మెరుగైన మౌలిక వసతులు, రవాణా కనెక్టివిటీ, పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, వినియోగ వ్యయం, సేవల రంగం విస్తరణ ఉన్నాయని నివేదిక పేర్కొంది. చిన్న నగరాల్లో ఎంఎస్‌ఎంఈల విస్తరణతోపాటు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు కూడా కొత్త ఉద్యోగ కేంద్రాలను సృష్టిస్తున్నాయి.
దీంతో గతంలో పెద్ద నగరాలకే పరిమితమైన కార్యాలయాలు, నివాస డిమాండ్ ఇప్పుడు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ 11 మార్కెట్లలో నివాస ప్రాపర్టీల సగటు ధరలు చదరపు అడుగుకు సుమారు రూ.4,500 నుంచి రూ.13,500 మధ్య ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మెట్రో నగరాలతో పోలిస్తే అనేక ప్రాంతాల్లో ఇక్కడ ఇళ్ల ధరలు అందుబాటులో ఉండటంతో పాటు, మౌలిక వసతులు మెరుగుపడటం కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.
కరోనా తర్వాత హైబ్రిడ్ వర్కింగ్ విధానం కూడా నివాస ఎంపికలపై ప్రభావం చూపింది. కార్యాలయానికి ప్రతిరోజూ దగ్గరగా ఉండాల్సిన అవసరం తగ్గడంతో ఉద్యోగులు, కుటుంబాలు మెట్రో నగరాల వెలుపల నివాస ప్రాంతాలను పరిశీలించే అవకాశం పెరిగింది. దీంతో టైర్-2 నగరాల్లో సౌకర్యాలు, కమ్యూనిటీ ఫీచర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.
ఒక్కో నగరానికి ఒక్కో డిమాండ్
టైర్-2, టైర్-3 మార్కెట్లను ఒకే కోణంలో చూడలేమని నివేదిక స్పష్టం చేస్తోంది. నగర ఆర్థిక స్వభావాన్ని బట్టి గృహ డిమాండ్ మారుతోంది. ఉదాహరణకు టెక్నాలజీ, సేవల రంగం బలంగా ఉన్న నగరాల్లో ఉద్యోగ కేంద్రాల చుట్టూ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండగా, పారిశ్రామిక నగరాల్లో తయారీ యూనిట్లు, పారిశ్రామిక క్లస్టర్ల సమీపంలో గృహ మార్కెట్ అభివృద్ధి చెందుతోంది.
పర్యాటక ప్రాంతాల్లో మాత్రం ప్రీమియం ఇళ్లు, రెండో ఇళ్లకు డిమాండ్ ఏర్పడుతోంది. ఇక రెసిడెన్షియల్ మార్కెట్‌తో పాటు వాణిజ్య రియల్ ఎస్టేట్ కూడా ఈ నగరాల్లో విస్తరిస్తోంది. 2025లో కీలక టైర్-2 నగరాల్లో 11.2 మిలియన్ చదరపు అడుగుల వేర్‌హౌసింగ్ లీజింగ్ నమోదైంది. 2024లో ఇది 11.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
ఇందులో లక్నో, జైపూర్, నాగ్‌పూర్, ఇండోర్, కోయంబత్తూరు, భువనేశ్వర్ నగరాలు కలిపి 5.3 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్‌కు కారణమయ్యాయి. అలాగే రిటైల్ రంగం కూడా మెట్రోల బయటకు విస్తరిస్తోంది. 2025 నాటికి దేశవ్యాప్తంగా 32 నగరాల్లో 134 మిలియన్ చదరపు అడుగుల ఆర్గనైజ్డ్ షాపింగ్ సెంటర్ స్టాక్ ఉంది. ఇందులో 24 టైర్-2 నగరాల్లోనే 36 మిలియన్ చదరపు అడుగులు ఉన్నాయి. భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్ ట్రైసిటీ, కోయంబత్తూరు, ఇండోర్, జైపూర్, కొచ్చి, లక్నో, నాగ్‌పూర్, విశాఖపట్నం నగరాలు కలిపి టైర్-2 షాపింగ్ సెంటర్ స్టాక్‌లో దాదాపు 60 శాతం వాటా కలిగి ఉన్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0