ప్రీలాంచ్ బిల్డర్లు, ఛానెల్ పార్ట్‌నర్లపై.. రెరా సుమోటోగా కేసు నమోదు చేయాలి?
The article calls for TG RERA to take suo motu action against builders and channel partners involved in pre-launch sales in Hyderabad.
హైదరాబాద్‌లో రెరా అనుమతి పొందిన ప్రాజెక్టుల్ని ప్రీలాంచ్ అమ్మకాలే దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. ఒకప్పుడు బిల్డర్లు నేరుగా ఫ్లాట్లను కొనుగోలుదారులకు విక్రయించేవారు. కానీ, నేడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు బయ్యర్లతో బిల్డర్లకు ప్రత్యక్ష సంబంధాలు పెద్దగా లేనే లేవు. ఇన్వెస్టర్లతో ఫ్లాట్లను ముందే కొనిపించే సంస్కృతికి తెరలేచింది. కార్పొరేట్ బిల్డర్ల రంగప్రవేశంతో ఛానెల్ పార్ట్‌నర్ల హడావిడి పెరిగింది. వీరిలో కొందరు ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్మకాన్ని ప్రారంభించారు.
గత ప్రభుత్వ హయంలో టీజీ రెరా నిర్లక్ష్యం కారణంగా.. అనేకమంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్రీలాంచ్ బిల్డర్ల మోసాలకు బలయ్యారు. ఇప్పుడా సంస్కృతికి మరింత బీజం పడింది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆలోచనలతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించే కొందరు బిల్డర్లు.. ఇలాంటి ఛానెల్ పార్ట్‌నర్లను తెగ ప్రోత్సహిస్తున్నారు. అందుకే, టీజీ రెరా వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది.
హైదరాబాద్‌లో.. ఏదో ఒక ప్రాంతంలో.. ఈ ప్రీలాంచ్‌ల దొంగల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. తాజాగా కొల్లూరు ఓఆర్ఆర్ పక్కనే ఒక బిల్డర్ ప్రీమియం హైరైజ్ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడట.. 9.65 ఎకరాల్లో జి ప్లస్ 41 అంతస్తుల్లో ఈ ప్రాజెక్టును కడుతున్నాడట. ఇందులో మొదటి ఐదు బుకింగుల కోసం చదరపు అడుక్కీ రూ.4699కే అమ్ముతున్నాడట. టీజీ రెరా అనుమతి రాక ముందే కొందరు ఛానల్ పార్ట్‌నర్లు ఈ ప్రాజెక్టును ప్రమోట్ చేస్తున్నారు.
గరిష్ఠంగా ఫ్లాట్ సైజు రెండు వేల చదరపు అడుగులు వేసుకున్నా.. కనీసం యాభై కోట్లను ముందే కొనుగోలుదారుల నుంచి కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడీ ప్రీలాంచ్ బిల్డర్. నలభై ఒక్క అంతస్తుల నిర్మాణానికి నిర్మాణ వ్యయమే దాదాపు ఐదు వేల దాకా ఖర్చవుతుంది. అలాంటప్పుడు, సదరు బిల్డర్ ఎలా 41 అంతస్తుల ప్రాజెక్టును పూర్తి చేస్తాడు. ఇలాంటి ప్రీలాంచ్ బిల్డర్లతో పాటు ఛానెల్ పార్ట్‌నర్లపై టీజీ రెరా సుమోటాగా కేసును స్వీకరించి కఠిన చర్యల్ని తీసుకోవాల్సిన అవసరముంది. ఇప్పటికైనా టీజీ రెరా కళ్లు తెరవకపోతే, అనేకమంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇలాంటి ప్రీలాంచ్ బిల్డర్ల మోసగాళ్ల బారిన పడి మోసపోయే ప్రమాదముంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0