ప్రభుత్వం..హైడ్రాపై.. నమ్మకం లేదు
The Telangana High Court has expressed serious concern over the state government machinery’s alleged failure to comply with its orders in a private land dispute at Lothukunta in Medchal-Malkajgiri district.
- ఆర్మీ రంగ ప్రవేశానికి హైకోర్టు సంచలన ఆదేశాలు
- లోతుకుంట భూ వివాదంలో రాష్ట్ర యంత్రాంగంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
- కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో హైడ్రా కమిషనర్ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ఓ ప్రైవేటు ఆస్తి విషయంలో తమ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అత్యంత తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయవ్యవస్థకు అసలు నమ్మకమే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల అమలవుతున్నాయో లేదో చూసేందుకు, సదరు భూమికి రక్షణగా సైన్యాన్ని (ఆర్మీ) రంగంలోకి దింపాలని ఆదేశించింది.
వివాదాస్పద స్థలానికి రక్షణగా 10 మంది ఆర్మీ సిబ్బందిని నియమించాలని, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి అక్కడికి వచ్చే హైడ్రా అధికారులు, చివరకు కమిషనర్‌తో సహా ఎవరినైనా సరే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఆర్మీ అధికారుల జాబితాను అందజేయాలని రిజిస్ట్రార్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదనే స్పృహ ఉన్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం సడలడంతోనే ఇలాంటి అసాధారణ ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని ధర్మాసనం స్పష్టం చేసింది.
గతంలో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను, కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ అధికారులు తమ ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 'శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్' ఎండీ ఎం.నరసయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది హరీశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ స్థలంలో జోక్యం చేసుకోమని ఈ నెల 20న కోర్టుకు హాజరై హామీ ఇచ్చిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, దానికి కట్టుబడి ఉండలేదని తెలిపారు. ఈ నెల 21న పిటిషనర్ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా హైడ్రా అధికారులు, పోలీసులతో వచ్చి పనులను అడ్డుకుని బెదిరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వాదనలపై తీవ్రంగా స్పందించిన న్యాయమూర్తి.. హైడ్రా కమిషనర్ చట్టం కంటే తానే గొప్పవాడినని భావిస్తున్నారని, ఇప్పటికే మూడుసార్లు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తున్నందున.. అవసరమైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను సైన్యం అదుపులోకి తీసుకుని బ్యారక్స్‌లో ఉంచాలని ఆదేశించవచ్చని, సచివాలయంలో కూర్చున్న వారికి కూడా అసలు ఏం జరుగుతుందో తెలియాలి అంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
సదరు వివాదాస్పద స్థలం రక్షణ కోసం పది మంది ఆర్మీ సిబ్బందిని సిద్ధం చేసేందుకు ఫైర్ డివిజన్‌లోని అత్యున్నత బ్రిగేడియర్‌ను సంప్రదించాలని న్యాయమూర్తి రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. ఆర్మీకి అడ్డువస్తే హైడ్రాతో సహా ఎవరినైనా అదుపులోకి తీసుకుని బ్యారక్స్‌కు తరలించాలని, వారి వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాలని రిజిస్ట్రీకి సూచించారు.
కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణంలో, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ జోక్యం చేసుకున్నారు. పిటిషనర్ స్థలంలో అధికారులు ఇకపై ఎలాంటి జోక్యం చేసుకోరని కోర్టుకు హామీ ఇస్తూ, ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఏఏజీ ఇచ్చిన స్పష్టమైన హామీతో ఆర్మీకి సంబంధించిన ఉత్తర్వులను న్యాయమూర్తి తాత్కాలికంగా నిలుపుదల చేశారు. సదరు అధికారిచే అఫిడవిట్ దాఖలు చేయిస్తే పరిశీలిస్తామని తెలుపుతూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0