22/ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం

The Telangana government has initiated a fast-track process to resolve issues related to lands listed under Section 22-A, Revenue Minister Ponguleti Srinivas Reddy said.

Aug 26, 2026 - 07:31
 0  11
22/ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం
telangana-22a-land-registration-fast-track-resolution-ponguleti-srinivas-reddy
  • ప్రతి కేసును వేగంగా పరిష్కరించాలి
  • ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి పొంగులేటి
  • అధికారులకు టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం

ఆర్ఈజీ న్యూస్‌, హైదరాబాద్: 22/ఎ  నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22/ఎ జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి 22/ఎ అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు సబ్‌ రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు.

అనంతరం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.22/ఎ జాబితాలో భూమి ఉందనే కారణంతో మాత్రమే రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం లేదా తిరస్కరించడం చేయవద్దని ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాల‌ని ఆదేశించారు. సంబంధిత భూమి 22/ఎ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటి? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22/ఎభూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను కూడా పరిరక్షిస్తూ, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0