షాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త ఆధ్యాత్మిక హబ్..
Shabad is attracting fresh real estate interest following the Telangana government’s allocation of 300 acres for an Isha Foundation project, with a proposed investment of around ₹900 crore.
ఈషా ఫౌండేషన్ ప్రాజెక్టుతో భూములపై కొత్త ఆశలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్‌లో మరో కొత్త ప్రాంతం చర్చకు వస్తోంది. ఇన్నాళ్లూ వ్యవసాయ భూములు, ఫామ్‌ల్యాండ్స్, ప్రశాంతమైన జీవనశైలికి గుర్తింపుగా ఉన్న షాబాద్.. ఇప్పుడు ఆధ్యాత్మికత, విద్య, వెల్‌నెస్, పర్యాటక రంగాల కలయికతో కొత్త అభివృద్ధి దిశగా అడుగులు వేయనుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఈషా ఫౌండేషన్ కోసం 300 ఎకరాల భూమి కేటాయింపు, సుమారు రూ.900 కోట్ల పెట్టుబడి ప్రణాళిక ఈ ప్రాంతంపై రియల్ ఎస్టేట్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ప్రభావం కేవలం ఆధ్యాత్మిక కేంద్రానికే పరిమితం కాదు. చుట్టుపక్కల భూముల వినియోగం, రవాణా, వసతి రంగం, వాణిజ్య కార్యకలాపాలు, విల్లాలు–ఫామ్‌హౌస్‌ల మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
300 ఎకరాల్లో మెగా ప్రాజెక్టు..
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని రేగడి దోస్వాడ, తాళ్లపల్లి గ్రామాల పరిధిలో ఈషా ఫౌండేషన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 300 ఎకరాల భూమి కేటాయించింది. సుమారు రూ.900 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక. ఆధ్యాత్మిక కేంద్రం, ఆదియోగి విగ్రహం, విద్యా సంస్థలు, యోగా-వెల్‌నెస్ సదుపాయాలు, సందర్శకుల వసతి, అగ్రోఫారెస్ట్రీ వంటి విభాగాలు ఇందులో భాగంగా ఉండనున్నాయి. ఇవన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే షాబాద్‌కు పర్యాటక ప్రాధాన్యం పెరగవచ్చు. రియల్ ఎస్టేట్ కోణంలో చూస్తే, ఒక పెద్ద ప్రాజెక్టు ఏర్పాటుతో ఆ ప్రాంతంపై అవగాహన పెరగడం మొదటి మార్పు. ఆ తర్వాతే రవాణా, వసతి, వాణిజ్య అవసరాలు పెరిగి భూముల వినియోగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.
భూముల ధరలకు ఊతం?
షాబాద్ పరిసరాల్లో భూములపై ఆసక్తి పెరగడానికి ఈశా ప్రాజెక్టు ఒక్కటే కారణం కాదు. హైదరాబాద్ దక్షిణ-పశ్చిమ ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు, నగర విస్తరణ, విమానాశ్రయానికి అనుసంధానం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సమీపంలోని గ్రామాలు, ప్రధాన రహదారులకు అనుసంధానమైన భూములు, భవిష్యత్తులో వాణిజ్య అవసరాలకు అనువైన స్థలాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, రోడ్డు సదుపాయాలు, భూమి వినియోగ అనుమతులు, స్థానిక డిమాండ్ నేపధ్యంలో భూముల ధరలు పెరిగే ఛాన్స్ ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
ఫామ్‌ల్యాండ్స్ నుంచి విల్లాల వరకు..
షాబాద్ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన స్థలాలు కోరుకునే కొనుగోలుదారులకు ఇప్పటికే ఫామ్‌ల్యాండ్స్, వీకెండ్ హోమ్స్ ఒక ఎంపికగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టు పూర్తయి సందర్శకుల రాక పెరిగితే ఈ తరహా ఆస్తులకు ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. షాబాద్‌తో పాటు చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి పరిసరాల్లో భూముల ధరలు ప్రాంతం, రహదారి కనెక్టివిటీ, భూమి స్వభావాన్ని బట్టి భారీ వ్యత్యాసంతో ఉన్నాయి. షాబాద్‌లో వ్యవసాయ భూముల ధరలు సుమారు ఎకరానికి రూ.1.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0