తెల్లచందనం తోట పేరుతో పెట్టుబడి.. రియల్ సంస్థకు షాక్

The Hyderabad Consumer Commission has directed Squares and Yards Infra Pvt. Ltd. to pay ₹60,000 per month to a consumer after the company allegedly failed to honour its commitments under a sandalwood plantation investment agreement.

Sep 11, 2026 - 00:40
 0  6
తెల్లచందనం తోట పేరుతో పెట్టుబడి.. రియల్ సంస్థకు షాక్
sandalwood-investment-real-estate-firm-consumer-commission-order
  • నెలకు రూ.60 వేల చొప్పున చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశం

తెల్లచందనం తోటల పెంపకం పేరుతో పెట్టుబడి పెట్టించిన రియల్ ఎస్టేట్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేయకుండా విఫలమైనందుకు ప్రతి నెలా రూ.60 వేల చొప్పున చెల్లించాలని స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ను ఆదేశించింది. అంతేకాకుండా మానసిక వేదన, శారీరక ఇబ్బందులకు రూ.25 వేలు, న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.5 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సురేశ్ కుమార్ చింతను 2023లో ఆ సంస్థ ప్రతినిధులు తెల్లచందనం సాగు ప్రాజెక్టు గురించి వివరించారు.

వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, అందులో తెల్లచందనం చెట్లు నాటి, వాటి పెంపకం, నిర్వహణను సంస్థ చూసుకుంటుందని చెప్పారు. ఈ పెట్టుబడి ద్వారా భూమి విలువ పెరగడంతో పాటు తెల్లచందనం చెట్లను 12 నుంచి 15 ఏళ్లపాటు పెంచి విక్రయించడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయని హామీ ఇచ్చారు. దీంతో సురేశ్ కుమార్ 2023 మార్చి 4 నుంచి మార్చి 23 మధ్య యూపీఐ లావాదేవీల ద్వారా రూ.17.50 లక్షలు చెల్లించారు. అనంతరం మార్చి 31, 2023న వ్యవసాయ భూమిని ఆయన పేరుతో రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత తెల్లచందనం తోట ఏర్పాటు, నిర్వహణ కోసం అవగాహన ఒప్పందం, లీజ్ డీడ్ కూడా కుదిరాయి.

ఒప్పందంలో భాగంగా సంస్థ ప్రతి నెలా రూ.30 వేల చొప్పున చెల్లించడం ప్రారంభించింది. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆ మొత్తాన్ని చెల్లించింది. అనంతరం అదే ఏడాది అక్టోబర్ నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో సురేశ్ కుమార్ సంస్థ డైరెక్టర్ బైర చంద్రశేఖర్ను పలుమార్లు కలిసినా ఫలితం కనిపించలేదు. చివరకు పెట్టుబడి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. దీంతో సురేశ్ కుమార్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందన్న కమిషన్

కేసును విచారించిన హైదరాబాద్ వినియోగదారుల కమిషన్.. ఫిర్యాదుదారు భూమికి సంపూర్ణ యజమానిగా ఉన్నారని గుర్తించింది. భూమిపై తెల్లచందనం మొక్కల పెంపకం, నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ఒప్పందం ఉందని పేర్కొంది. అలాగే సంస్థతో కుదిరిన లీజ్ డీడ్ కూడా రద్దు కాలేదని, అందులో పేర్కొన్న నిబంధనలు అమల్లో ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల ఒప్పందంలో పేర్కొన్న విధంగా చెల్లింపులు చేయాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ సంస్థపై ఉందని కమిషన్ తేల్చింది.

ఆ బాధ్యతను నిర్వర్తించకపోవడం సేవల్లో లోపం, అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం 2023 అక్టోబర్ 10 నుంచి 2031 జూన్ 10 వరకు ప్రతి నెలా రూ.60 వేల చొప్పున సురేశ్ కుమార్‌కు చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికే బకాయిపడిన మొత్తంతో పాటు, ఒప్పందం ప్రకారం ముందుముందు చెల్లించాల్సిన మొత్తాలపైనా సంస్థకు బాధ్యత ఉంటుందని కమిషన్ స్పష్టం చేసినట్టయింది.

ఏ నెల చెల్లింపు గడువులో చెల్లించలేదో, ఆ మొత్తంపై సంవత్సరానికి 9 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ ఆదేశించింది. చెల్లింపులు నిలిపివేయడం వల్ల ఫిర్యాదుదారుడికి కలిగిన మానసిక వేదన, శారీరక ఇబ్బందులకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. కేసు నడిపేందుకు అయిన ఖర్చుల కోసం మరో రూ.5 వేలు చెల్లించాలని సూచించింది. తీర్పు అందిన 45 రోజుల్లోగా ఆదేశాలను అమలు చేయాలని సంస్థను కమిషన్ ఆదేశించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0