హోమ్ బయ్యర్లకు విశ్వసనీయ సమాచారమే కీలకం: క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ఇంధ్రసేనారెడ్డి
CREDAI Telangana President K. Indrasena Reddy said that reliable and accurate information is one of the most important factors for people planning to buy a home.
కొత్తగా ఇల్లు కొనుక్కునేవారికి విశ్వసనీయ సమాచారాన్ని అందించడమే అత్యంత కీలకమైన అంశమని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ కె.ఇంధ్రసేనారెడ్డి తెలిపారు. సోమవారం టూరిజం ప్లాజాలో ప్రాపర్టీ పల్స్ సర్క్యులేషన్ ఏజెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియ సమాచారం సేకరణతోనే ప్రారంభమవుతుందన్నారు. అయితే పుకార్లు, ఊహాగానాలు, తప్పుడు ప్రచారాలతో నిండిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో.. గృహ కొనుగోలుదారులకు విశ్వసనీయమైన రియల్ ఎస్టేట్ వార్తల ప్రాధాన్యం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యంతోనే ఏర్పాటైన ప్రాపర్టీ పల్స్.. దేశంలోనే తొలి రియల్ ఎస్టేట్ వార్తాపత్రికగా గుర్తింపు పొందిందని అన్నారు.
హైదరాబాద్ వ్యాప్తంగా పత్రిక సర్క్యులేషన్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, పాఠకులకు విశ్వసనీయ రియల్ ఎస్టేట్ సమాచారాన్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న పత్రిక పంపిణీ ఏజెంట్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించింది. పత్రిక పంపిణీ ఏజెంట్లను ప్రింట్ మీడియా రంగానికి వెన్నెముకగా ఆయన అభివర్ణించారు. ప్రతిరోజూ ఉదయం పాఠకుల చేతికి పత్రికలను చేరవేయడానికి వారు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. సాధారణ వార్తాపత్రిక పంపిణీకి, ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ వార్తాపత్రిక పంపిణీకి ఎంతో తేడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే కుటుంబాలు జీవితంలో తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయాల్లో ఒకటైన ప్రాపర్టీ కొనుగోలుపై ప్రభావం చూపే సమాచారం ఇందులో ఉంటుందని అన్నారు. "రియల్ ఎస్టేట్ అందరి చేతుల్లో ఉంది. మన ప్రాపర్టీ ఇప్పుడు పల్స్ చేతుల్లో ఉంది. ఇది మీది కాదు... మనందరిదీ," అని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాపర్టీ పల్స్ విస్తరణకు క్రెడాయ్ తెలంగాణకు చెందిన అన్ని 15 చాప్టర్ల తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
క్రెడాయ్ హైదరాబాద్ తాజా మాజీ అధ్యక్షుడు వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, విశ్వసనీయ రియల్ ఎస్టేట్ సమాచారం ప్రజలకు చేరవేయడంలో పత్రిక పంపిణీ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. "ఒక కాగితం... ఒక కలం అత్యంత శక్తివంతమైన ఆయుధాలు" అని వ్యాఖ్యానించిన ఆయన, ప్రతిరోజూ తెల్లవారుజామునే తమ పనిని ప్రారంభించి పత్రికలను పాఠకులకు అందించే పంపిణీ ఏజెంట్లు అత్యంత కష్టపడే వర్గాల్లో ఒకరని ప్రశంసించారు. హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగం లక్షలాది మంది నైపుణ్యం కలిగిన, సాధారణ కార్మికులకు ఉపాధి కల్పించడమే కాకుండా వందలాది అనుబంధ పరిశ్రమలకు కూడా ఊతమిస్తోందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఉపాధి కల్పనతో పాటు ఆర్థికాభివృద్ధికి ఈ రంగం అందిస్తున్న విశేష సేవలను దృష్టిలో ఉంచుకుని రియల్ ఎస్టేట్ రంగానికి నిరంతర ప్రోత్సాహం అవసరమని అన్నారు.
రచయిత, పారిశ్రామికవేత్త, లీడర్‌షిప్ కోచ్, ప్రొఫెషనల్ స్పీకర్ వేణు భగవాన్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ (AI) ఏజెంట్ల యుగంలో కూడా పత్రిక పంపిణీ ఏజెంట్లు సూర్యోదయానికి ముందే తమ పనిని ప్రారంభించి వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారని ప్రశంసించారు. గత రెండు దశాబ్దాల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఉదాహరణగా పేర్కొంటూ, భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాలను ముందుగానే గుర్తించగలిగేది కొద్దిమంది పెట్టుబడిదారులేనని, అందుకే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి విశ్వసనీయ రియల్ ఎస్టేట్ సమాచారం అత్యంత అవసరమని చెప్పారు. బలమైన రియల్ ఎస్టేట్ రంగం ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఆయన అన్నారు.
అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రాపర్టీ పల్స్ ఎండీ కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. పాఠకులకు వాస్తవాలతో కూడిన సమాచారాన్ని అందించాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రాపర్టీ పల్స్ ను ఆరంభించామన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సర్క్యులేషన్ ఏజెంట్ల సేవల్ని గుర్తిస్తూ ప్రశంసాపత్రంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ సర్టిఫికెట్లను అందజేశారు. ప్రాపర్టీ పల్స్ సర్క్యులేషన్‌ను మరింత విస్తరించడంతో పాటు విశ్వసనీయ రియల్ ఎస్టేట్ సమాచారాన్ని హైదరాబాద్‌లో మరింత మంది గృహ కొనుగోలుదారులకు చేరవేయడంలో తమ పూర్తి సహకారం కొనసాగిస్తామని పంపిణీ ఏజెంట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాపర్టీ పల్స్ సర్క్యులేషన్ మనేజర్ ప్రసాద్, కొడాలి చరణ్, కొయ్య నితిన్, లహరికా, రూపారెడ్డి, కటికె భవానీ, హ్యారీ సిల్వెస్టర్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0