నియోపోలిస్ వేలంలో.. హెచ్ఎండీఏకు 75 కోట్ల నష్టమా?
The latest Neopolis auction has raised concerns over a possible ₹75 crore difference in HMDA’s land realisation.
- 2025 నవంబరులో ఎకరం.. రూ.136.50 కోట్లు
- అదే ప్లాటుకు 11 నెలలయ్యాక రూ.120 కోట్లు
- 4.59 ఎకరాలపై హెచ్ఎండీఏకు రూ.75 కోట్ల నష్టం?
- ధర తక్కువ పలకడానికి ప్రధాన కారణాలేమిటి?
- వేలంలో ఒకే ఒక్క బిల్డరే ఎందుకు పాల్గొన్నాడు?
- రియాల్టీకి ప్రభుత్వం సపోర్టు లేన్నందుకేనా!
(కె.జాన్సన్, 9030034591)
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని డెవలప్ చేస్తున్న కోకాపేట్ నియోపోలిస్‌కు ఆదరణ తగ్గుతోందా? ఇక్కడ భూముల్ని కొనడానికి ఏ బిల్డర్ ముందుకు రావట్లేదా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే, గురువారం హెచ్ఎండీఏ నియోపోలిస్ వేలం పాటే ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు. హెచ్ఎండీఏ ఎంతో ఆర్భాటంగా ఈ వేలం పాటను నిర్వహించే
ప్రయత్నం చేసినా.. కేవలం ఒకే ఒక్క సంస్థ ఇందులో పాల్గొనడం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు. ఆ సంస్థ కూడా హెచ్ఎండీఏ నిర్ణయించిన కనీస ధరకు బిడ్ వేసిందే తప్ప.. నయా పైసా కూడా అదనంగా పెట్టలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఏ నిర్మాణ సంస్థ నియోపోలిస్‌లో భూమిని కొనేందుకు ముందుకు రాకపోవడం మార్కెట్ ప్రతికూలంగా మారిందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చని రియల్ వర్గాలు అంటున్నాయి.
2025 నవంబరులో హెచ్ఎండీఏ చేపట్టిన వేలం పాటలో.. వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పీ ఎకరానికి రూ.136.50 కోట్లు పెట్టి 17వ ప్లాటును సొంతం చేసుకుంది. 4.59 ఎకరాలకు గాను ఈ సంస్థ రూ.626.53 కోట్లను పెట్టింది. కాకపోతే, ప్రీలాంచ్‌లో సొమ్మును సమీకరించలేక చతికిలపడింది. అయితే పదకొండు నెలల తర్వాత అదే ప్లాటును వేలం వేయగా కేవలం ఒకే ఒక్క సంస్థ ముందుకొచ్చింది. ఎకరానికి కేవలం రూ.120 కోట్లు పెట్టింది. అంటే, 4.59 ఎకరాలకు గాను.. తాజాగా ఈ సంస్థ వెచ్చించింది రూ.550 కోట్లు. ఈ లెక్కన కేవలం పదకొండు నెలల వ్యవధిలో హెచ్ఎండీఏకు సుమారు 75 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. తెలంగాణ రియల్ రంగాన్ని ప్రోత్సహించడానికి కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకోలేదు. అమ్మకాల్లేక నిర్మాణ సంస్థలు దారుణంగా దెబ్బతింటున్నా సానుకూల నిర్ణయాల్ని తీసుకున్న దాఖలాలు లేవు. గత క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేసి కాస్త పాజిటివ్‌గా మాట్లాడినా.. ఆ తర్వాత ఈ రంగాన్ని పరుగులు పెట్టించే ఎలాంటి ప్రోత్సాహాకాల్ని ప్రకటించలేదు. పైగా హైడ్రా సృష్టించిన భయానక వాతావరణం, సెక్షన్-22ఏ వంటి కారణాల వల్ల కొనుగోలుదారులు వేచి చూసే ధోరణీని అవలంబించారు. దీంతో, అమ్మకాలు తగ్గిపోయి అధిక శాతం మంది నిర్మాణ సంస్థలు.. ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి నెలకొంది.
నియోపోలిస్‌ను ప్రభుత్వం మొత్తం కాంక్రీటు జంగిల్ మయం చేస్తుందని.. ఇందులో నివసించే ప్రజలు సేదతీరటానికి ఎలాంటి పార్కుల్ని అభివృద్ధి చేయడం లేదని తెలుసుకున్న బిల్డర్లు.. వేలం పాటలో పాల్గొనేందుకు వెనుకంజ వేసిందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇక్కడి ఆకాశహర్మ్యాల్లో నివసించే ప్రజలకు అవసరమయ్యే ఉద్యానవనాల్ని ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరముంది. లేకపోతే, భవిష్యత్తులో ఎలాంటి వేలాన్ని నిర్వహించినా, ఇలాంటి ప్రతికూల ఫలితం వెలువడే ప్రమాదముంది. కాబట్టి, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0