మై హోమ్ భూములపై సీఎం సంచలన ఆరోపణలు
Telangana Chief Minister A. Revanth Reddy made several allegations in the Assembly regarding land holdings linked to My Home Group, including around 2,463 acres in the Shamshabad region.
- శంషాబాద్‌లోనే 2,463 ఎకరాల భూములున్నాయంటూ ప్రస్తావన
- అసైన్డ్, నిషేధిత, ఎవాక్యూ, భూదాన్ భూములపై అనేక ఆరోపణలు
- ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్
ఆర్ఈజీ న్యూస్:
మై హోమ్ గ్రూప్‌కు సంబంధించిన భూవ్యవహారాలపై శాసనసభలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా శంషాబాద్, మేడ్చల్, మేళ్లచెరువు తదితర ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు, నిషేధిత జాబితాలోని భూములు, అసైన్డ్, ఎవాక్యూ, భూదాన్ భూములకు సంబంధించిన అంశాలను సభలో సీఎం రేంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ వ్యవహారాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.
శంషాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో మై హోమ్ గ్రూప్‌కు సంబంధించిన సంస్థలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశాయని సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సుమారు 2,463 ఎకరాల భూములున్నాయని, వీటిలో కొంత భూమి అసైన్డ్ లేదా పేదలకు సంబంధించిన భూములుగా ఉన్నట్లు ఆరోపణలు చేశారు. ఈ ఆస్తులు సుమారు 28 కంపెనీల పేర్లపై ఉన్నాయని పేర్కొన్నారు. శంషాబాద్, ముచ్చింతల్, పాల్మాకుల, మదనపల్లి, పెద్దతూప్ర, సాగర్‌గూడ, గొల్లూరు, అమీర్‌పేట్, నాగారం, నందిపల్లి, కాల్వకోల్, సుభాన్‌పూర్, వెంకన్నగూడ తదితర గ్రామాల్లో భూముల కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని సభలో ప్రస్తావించారు.
నిషేధిత జాబితా భూములపై ఆరోపణలు
గొల్లూరు గ్రామానికి సంబంధించి 1994 నుంచి 2004 వరకు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లలో సుమారు 301.07 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సీఎం ఆరోపించారు. అనంతరం 2014లో సంబంధిత సర్వే నంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 195లో నిషేధిత జాబితాలో ఉన్న సుమారు 315 ఎకరాల భూముల వ్యవహారాన్ని కూడా సభలో ప్రస్తావించారు. ఈ భూముల కొనుగోళ్లు, జాబితా నుంచి తొలగింపు ప్రక్రియపై సమగ్ర విచారణ అవసరమని ఆయన డిమాండ్ చేశారు.
కాప్రాలో ఎవాక్యూ ప్రాపర్టీపై ఆరోపణలు
మేడ్చల్ జిల్లా కాప్రా ప్రాంతంలోని ఎవాక్యూ ప్రాపర్టీ విషయంలోనూ ఆరోపణలు వచ్చాయి. సంబంధిత భూములను గతంలో ప్రభుత్వ భూములు, ఎవాక్యూ ప్రాపర్టీగా పేర్కొంటూ పత్రికల్లో కథనాలు వచ్చినట్లు సభలో సీఎం ప్రస్తావించారు. అనంతరం ఆ భూములు మై హోమ్‌కు బదిలీ అయినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పాత పత్రికా కథనాలు, రెవెన్యూ రికార్డులు, బదిలీ వివరాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మేళ్లచెరువులో భూదాన్ భూముల అంశం
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన భూముల విషయంలోనూ సీఎం ఆరోపణలు చేశారు. మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన సుమారు 242 ఎకరాల్లో 113 ఎకరాలు భూదాన్ భూములుగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందని సభలో పేర్కొన్నారు. భూదాన్, అసైన్డ్, ఎవాక్యూ వంటి వివిధ రకాల భూములు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే అంశంపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
రూ.1,000 కోట్ల భూమిపై కూడా ప్రస్తావన
ఎవాక్యూ భూములకు సంబంధించి సుమారు 90 ఎకరాల భూమి విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని, ఆ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. సంబంధిత వ్యవహారంలో జీపీఏ హోల్డర్‌కు హక్కు లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని కూడా సభలో ఆయన ఆరోపించారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలి
ధరణి వ్యవస్థలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న భూవ్యవహారాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భూముల రికార్డులు, సర్వే నంబర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, నిషేధిత జాబితా నుంచి తొలగించిన వివరాలు, బదిలీ ప్రక్రియలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.డసభలో ప్రస్తావించిన భూములే కాకుండా మరిన్ని భూవ్యవహారాలు వెలుగులోకి రావాల్సి ఉందని, పెద్ద మొత్తంలో ప్రభుత్వ, వివాదాస్పద భూములపై విచారణ అవసరమని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం చేసిన ఈ సంచలన ఆరోపణలపై మై హోమ్ గ్రూప్ నుంచి వివరణ తీసుకునేందుకు ఆర్ఈజీ న్యూస్ సంస్థ ప్రతినిధులు అందుబాటులో లేరు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0