మూసీకి దసరా ముహూర్తం.. రియల్‌ ఎస్టేట్‌కు కొత్త బూస్ట్‌?

The Musi River rejuvenation project is set to bring a major infrastructure push to areas along the river, with preparations underway for the foundation stone ceremony for Phase 1 on Dussehra.

Sep 19, 2026 - 06:29
 0  18
మూసీకి దసరా ముహూర్తం.. రియల్‌ ఎస్టేట్‌కు కొత్త బూస్ట్‌?
musi-riverfront-project-phase-1-hyderabad-real-estate

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మ్యాప్‌లో మరో భారీ మార్పునకు రంగం సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ నగరానికి మధ్యలో ఉన్నా.. అభివృద్ధి పరంగా వెనుకబడినట్టుగా కనిపించిన మూసీ పరివాహక ప్రాంతాలపై ఇప్పుడు భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫోకస్‌ పడుతోంది. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశ పనులకు దసరా రోజున శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫేజ్‌-1కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి లభించింది. ఇందులో రూ.4,500 కోట్లు ఏడీబీ రుణం, మరో రూ.2,845.12 కోట్లు HMDA, TGIIC ద్వారా సమకూర్చనున్నారు. అంటే.. మూసీ ప్రాజెక్టు ఇక కేవలం ప్రణాళిక కాదు. డబ్బు, డీపీఆర్‌, టెండర్లు, భూసేకరణ, అమలు దశకు చేరుతున్న ప్రాజెక్టు. ఇదే ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఆసక్తి రేపుతున్న అంశం.

21 కి.మీ.లో అసలు కథ..

తొలి దశలో మొత్తం 21 కిలోమీటర్ల మూసీ-ఈసా కారిడార్‌ అభివృద్ధి చేయనున్నారు. హిమాయత్‌సాగర్‌–బాపూఘాట్‌- 9.20 కి.మీ. ఉస్మాన్‌సాగర్‌–బాపూఘాట్‌- 11.80 కి.మీ. ఈ రెండు స్ట్రెచ్‌లకు కలిపి రూ.7,345 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. హిమాయత్‌సాగర్‌–బాపూఘాట్‌ జోన్‌కు సుమారు రూ.3,232 కోట్లు, ఉస్మాన్‌సాగర్‌–బాపూఘాట్‌ జోన్‌కు సుమారు రూ.4,113 కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వ అనుమతుల వివరాలు చెబుతున్నాయి. అంటే.. కిలోమీటర్‌కు సగటున రూ.350 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే స్థాయి ప్రాజెక్టు ఇది.

గండిపేట–మణికొండ–నార్సింగి.. వెస్ట్‌ హైదరాబాద్‌కు మరో ప్లస్‌?

రియల్‌ ఎస్టేట్‌ పరంగా తొలి దశలో ఎక్కువ ఆసక్తి రేపుతున్న ప్రాంతం పశ్చిమ హైదరాబాద్‌. గండిపేట, మణికొండ, నార్సింగి, మంచిరేవుల, బాపూఘాట్‌, రాజేంద్రనగర్‌ పరిసరాలు. ఇప్పటికే ఈ ప్రాంతాలకు ORR, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట్‌, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు మూసీ రివర్‌ఫ్రంట్‌ మరో అర్బన్‌ కనెక్టివిటీ, ల్యాండ్‌స్కేప్‌ పొరను జోడించే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారిక విజన్‌లో 55 కి.మీ. మూసీ కారిడార్‌లో మిక్స్‌డ్‌ యూజ్‌, ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్‌ నోడ్స్‌, నిరంతర ప్రొమెనేడ్లు, సాంస్కృతిక వేదికలు, చివరి మైలు కనెక్టివిటీ వంటి అంశాలు ఉన్నాయి. ఇవి పూర్తిస్థాయిలో అమలైతే.. నది ఒడ్డున ఉన్న భూమి మాత్రమే కాకుండా దానికి కనెక్ట్‌ అయ్యే అంతర్గత ప్రాంతాలకూ డిమాండ్‌ పెరగొచ్చు.

నార్సింగి రేట్లే ఇప్పటికే చెబుతున్నాయి..

2026 మార్కెట్‌ డేటా ప్రకారం నార్సింగిలో అపార్ట్‌మెంట్‌ ధర సగటు సుమారు రూ.10,428/చ.అడుగుగా ఉంది. గత త్రైమాసికంతో పోలిస్తే సుమారు 2 శాతం పెరుగుదల కనిపించింది. అయితే ఇక్కడి రేట్లు మూసీ ప్రాజెక్టు వల్ల మాత్రమే రావడం లేదు. ORR, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఐటీ కారిడార్‌, కోకాపేట్‌ ప్రభావం ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి మూసీ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కొత్త మార్కెట్‌ సృష్టించడంకంటే.. ఇప్పటికే ఉన్న ప్రీమియం మార్కెట్‌కు మరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బూస్ట్‌గా మారే అవకాశం ఎక్కువ. బాపూఘాట్‌.. ఇప్పుడు ల్యాండ్‌ విలువపై కొత్త చర్చ ఫేజ్‌-1లో గండిపేట, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ వైపు నుంచి బాపూఘాట్‌ వరకు పనులు జరగనున్నాయి.

ఇక్కడ రివర్‌ క్లీనింగ్‌తో పాటు.. నది ఒడ్డున రోడ్లు, ల్యాండ్‌స్కేపింగ్‌, సైకిల్‌ ట్రాక్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, నీటి నిల్వ, బోటింగ్‌, మురుగునీటి ట్రంక్‌ లైన్లు, స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్లు, ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి మౌలిక సదుపాయాలు ప్రతిపాదించారు. ఇలాంటి సదుపాయాలు పూర్తయితే బాపూఘాట్‌–గండిపేట బెల్ట్‌లో రివర్‌ఫ్రంట్‌ ఫేసింగ్‌ ప్రాపర్టీకి కొత్త ప్రీమియం మార్కెట్‌ ఏర్పడుతుందా? అన్నదే రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో ఆసక్తి. అయితే ఇది ఇప్పటికీ భవిష్యత్‌ అంచనా మాత్రమే. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు రేట్ల పెరుగుదలను ఖచ్చితంగా చెప్పలేం.

మూసీతో పాటు.. నాగోలు నుంచి గౌరెల్లి వరకు మరో రియల్‌ ఎస్టేట్‌ బెల్ట్‌

ఇక రెండో దశ మరింత ఆసక్తికరం. నాగోలు నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కి.మీ. విస్తరించే రెండో దశపై డీపీఆర్‌ ప్రక్రియ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి కూడా ఫేజ్‌-2 టెండర్లను త్వరగా పిలవాలని అధికారులను ఆదేశించారు. ఇది తూర్పు హైదరాబాద్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మరో కనెక్టివిటీ పొరను జోడించవచ్చు.

నాగోలు రేట్లు

2026 రెండో త్రైమాసికం డేటా ప్రకారం నాగోలులో అపార్ట్‌మెంట్ల సగటు ధర సుమారు రూ.6,023/చ.అడుగు. ఇండిపెండెంట్ ఇళ్ల సగటు సుమారు రూ.8,287/చ.అడుగు. రెసిడెన్షియల్‌ ప్లాట్ల సగటు సుమారు రూ.72,122/చ.గజంగా మార్కెట్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అంటే నాగోలు ఇప్పటికే పూర్తిగా డెవలప్‌ అయిన మార్కెట్‌. ఇక్కడ మూసీ ప్రాజెక్టు ప్రభావం కొత్త భూముల మార్కెట్‌ను తెరవడంకంటే ప్రస్తుత ఆస్తుల విలువ, కనెక్టివిటీ, కమర్షియల్‌ యాక్టివిటీపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువ.

ఉప్పల్‌–పీర్జాదిగూడ.. తూర్పు వైపు కొత్త లెక్కలు

ఫేజ్‌-2 ప్రభావాన్ని నాగోలుతో ఆపేయలేం. ఉప్పల్‌, పీర్జాదిగూడ, బోడుప్పల్‌, రాంపల్లి వైపు కూడా కనెక్టివిటీ పెరిగితే రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై ప్రభావం పడొచ్చు. 2026లో ఉప్పల్‌లో అపార్ట్‌మెంట్ల సగటు ధర సుమారు రూ.6,595/చ.అడుగు, ఇండిపెండెంట్ ఇళ్ల సగటు రూ.8,997/చ.అడుగు, రెసిడెన్షియల్‌ ప్లాట్ల సగటు రూ.70,638/చ.గజంగా ఉన్నాయి. పీర్జాదిగూడలో అపార్ట్‌మెంట్‌ ధర సుమారు రూ.5,501/చ.అడుగు స్థాయిలో ఉంది. 2025 సెప్టెంబర్‌ నుంచి 2026 మధ్యకాలంలో అక్కడి ధరల్లో పెరుగుదల కనిపించింది. అంటే.. తూర్పు హైదరాబాద్‌లో కూడా ఇప్పటికే ధరలు పెరిగిన మార్కెట్‌ ఉంది. మూసీ ఫేజ్‌-2, కొత్త రోడ్లు, ట్రాన్సిట్‌ కనెక్టివిటీ, మిశ్రమ వినియోగ అభివృద్ధి కలిస్తే మరో రియల్‌ ఎస్టేట్‌ గ్రోత్‌ లేయర్‌ ఏర్పడే అవకాశం ఉంది.

మొత్తంగా.. దసరాకు మూసీ ఫేజ్‌-1కు శంకుస్థాపన జరిగితే.. అది కేవలం ఒక ప్రాజెక్టు ప్రారంభం కాదు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మూసీని నగరాన్ని విడదీసే నదిగా కాకుండా.. నగరాన్ని కలిపే అర్బన్‌ కారిడార్ గా మార్చే ప్రక్రియకు శ్రీకారం కావచ్చు. రూ.7,345 కోట్ల తొలి దశ.. 21 కిలోమీటర్ల ప్రాధాన్య కారిడార్‌.. ఆ తర్వాత 55 కిలోమీటర్ల విస్తృత రివర్‌ఫ్రంట్‌ విజన్‌.. మిక్స్‌డ్‌ యూజ్‌ నోడ్స్‌, రోడ్లు, సైకిల్‌ ట్రాక్‌లు, ల్యాండ్‌స్కేపింగ్‌, బోటింగ్‌, డ్రైనేజీ, ట్రాన్సిట్‌ కనెక్టివిటీ.. ఇవన్నీ ఒకేసారి జరిగితే.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ల్యాండ్‌ వాల్యూ లెక్కలు కూడా మారే అవకాశం ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0