ధరలు బారెడు.. సౌకర్యాలు మూరెడు

Mumbai’s soaring property prices have sparked a fresh debate over whether the city’s infrastructure matches its premium real estate costs.

Aug 31, 2026 - 05:12
 0  9
ధరలు బారెడు.. సౌకర్యాలు మూరెడు
mumbai-luxury-property-prices-infrastructure-debate
  • గ్లోబల్ సిటీలో కోట్లలో ఇళ్ల ధరలు..
  • కాంపౌండ్ దాటి బయటకు వస్తే గుంతల రోడ్లు
  • ముంబైలో మౌలిక వసతుల లేమిపై సోషల్ మీడియాలో చర్చ

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు మరోసారి చర్చకు దారితీశాయి. నగరంలోని వర్లీ, బాంద్రా, సౌత్‌ ముంబై వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఫ్లాట్‌ కొనాలంటే రూ.8–10 కోట్లు, అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇంత భారీ ధరలు చెల్లిస్తున్న కొనుగోలుదారులకు అంతర్జాతీయ నగరాల స్థాయి మౌలిక వసతులు ఎందుకు అందడం లేదనే ప్రశ్న తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. రూ.8–10 కోట్లకు వర్లీ, బాంద్రా లేదా సౌత్‌ ముంబైలో ఇల్లు కొంటే అత్యాధునిక భవనం, మార్బుల్‌ లాబీ, స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌, ప్రైవేట్‌ లిఫ్ట్‌ వంటి సదుపాయాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

అయితే అదే ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టగానే గుంతల రోడ్లు, సరిగ్గా లేని ఫుట్‌పాత్‌లు, తవ్వకాలతో ఉన్న రహదారులు, వర్షాకాలంలో నీటిముంపు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. అంటే ‘గ్లోబల్‌ సిటీ ధరలు.. కానీ గ్లోబల్‌ సిటీ అనుభవం మాత్రం కాంపౌండ్‌ వాల్‌ వరకే’ అన్నది ఆ పోస్టులోని ప్రధాన వాదన. ముంబైలోని ప్రీమియం ప్రాపర్టీ ధరలను దుబాయ్‌, సింగపూర్‌తో పోల్చారు. దుబాయ్‌లో అదే స్థాయి బడ్జెట్‌తో మరింత విస్తీర్ణం, మెరుగైన సదుపాయాలు లభించే అవకాశముందని కొందరు స్పందించారు. మరోవైపు ముంబైకి ప్రత్యేకమైన సంస్కృతి, ఆహారం, ఉద్యోగ అవకాశాలు, ప్రజా రవాణా, తక్కువ ఖర్చుతో లభించే సేవలు వంటి ప్రయోజనాలు ఉన్నాయని మరికొందరు వాదించారు.

ముంబైలో ధరలు ఎంత?

ముంబైలో ప్రాపర్టీ ధరలు ప్రాంతాన్ని బట్టి భారీగా మారుతున్నాయి. సాధారణంగా నగరంలోని కొన్ని శివారు ప్రాంతాల్లో చదరపు అడుగుకు సుమారు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ధరలు ఉండగా, అత్యంత ప్రీమియం ప్రాంతాల్లో చదరపు అడుగు ధర రూ.లక్ష దాటుతోంది. కొన్ని లగ్జరీ ప్రాజెక్టుల్లో ఇది రూ.2–3 లక్షల స్థాయికి చేరుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇలాంటి ధరలు కేవలం ఇల్లు అనే ఆస్తికి మాత్రమే కాకుండా, లొకేషన్‌, పరిమిత భూమి లభ్యత, సముద్రతీరం, వ్యాపార కేంద్రాలకు సమీపం, భవిష్యత్‌ విలువ వంటి అంశాలకు చెల్లిస్తున్న ప్రీమియంగా నిపుణులు చూస్తున్నారు.

ఈ చర్చలో అందరూ ముంబైని దుబాయ్‌తో పోల్చడం సరైనదని అంగీకరించలేదు. కొందరు ముంబైలో ప్రజా రవాణా, ఇంటి వద్దకే అందే తక్కువ ఖర్చు సేవలు, ఆహారం, సాంస్కృతిక వైవిధ్యం వంటి ప్రయోజనాలను గుర్తుచేశారు. మరికొందరు మాత్రం ఇంటి లోపల విలాసవంతమైన సదుపాయాలు కల్పించడం సరిపోదని, నగరంలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి ప్రజా మౌలిక వసతులు కూడా మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు.

ఈ చర్చలో ఆసక్తికరమైన మరో కోణం లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీలపై వచ్చింది. భవనం లోపల జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, పార్క్‌, సెక్యూరిటీ, విద్యుత్‌ బ్యాకప్‌, ఇతర సదుపాయాలు అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. బయట నగర మౌలిక వసతులతో సంబంధం లేకుండా నివాసితులు తమకు కావాల్సిన చాలా సేవలను భవనం నుంచే పొందగలుగుతున్నారు. దీంతో ‘నగరంలోని సమస్యల నుంచి తప్పించుకునే ప్రైవేట్‌ ప్రపంచాలుగా ఖరీదైన అపార్ట్‌మెంట్లు మారుతున్నాయా?’ అనే ప్రశ్న కూడా చర్చలో వచ్చింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0