మెట్రో స్టేషన్ నుంచి నేరుగా మీ ప్రాజెక్టులోకే వెళ్లొచ్చు..!
Hyderabad’s LB Nagar is set to get a direct metro-to-residential township skywalk, connecting the metro concourse with Vasavi Ananda Nilayam.
మెట్రో దిగారు.. బయటకు వచ్చారు.. ఇక ఇంటికి వెళ్లాలంటే రోడ్డుపై నడవాల్సిన పనిలేదు.. ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు.. రోడ్డు దాటే రిస్క్ అసలే ఉండదు. ఎందుకంటే.. మెట్రో స్టేషన్ నుంచి ఏకంగా నేరుగా రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌కు స్కైవాక్ రాబోతోంది. అదీ హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఎల్బీనగర్‌లో. మెట్రో కాంకోర్స్ నుంచి నేరుగా వాసవి ఆనంద నిలయం టౌన్‌షిప్‌కు కనెక్ట్ అయ్యే ఈ స్కైవాక్ అందుబాటులోకి వస్తే.. మెట్రో ప్రయాణానికి కొత్త అనుభూతి రావడం ఖాయం.
- ఎల్బీనగర్‌లో మెట్రో టు రెసిడెన్షియల్ స్కైవాక్
- మెట్రో స్టేషన్ నుంచి.. నేరుగా ఇంటికి
- NH-65 ట్రాఫిక్‌కు ఇక చెక్
- 10–12 నిమిషాల నడకకు బదులు 2–3 నిమిషాల్లో గమ్యం
- 3,576 ఫ్లాట్లకు మెట్రో కనెక్టివిటీ
ఎల్బీనగర్.. హైదరాబాద్‌లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. ఒకవైపు మెట్రో స్టేషన్.. మరోవైపు జాతీయ రహదారి-65పై పరుగులు తీసే వాహనాలు.. మధ్యలో పాదచారుల ఇబ్బందులు. ముఖ్యంగా మెట్రో స్టేషన్ నుంచి వాసవి ఆనంద నిలయం వైపు వెళ్లే వారికి రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ మధ్య ప్రయాణం.. రోడ్డు దాటే ఇబ్బందులు.. సమయంతో పాటు భద్రత కూడా సవాలే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఎలివేటెడ్ స్కైవాక్ నిర్మాణానికి వాసవి గ్రూప్ శ్రీకారం చుట్టింది. మెట్రో స్టేషన్ నుంచి టౌన్‌షిప్ వరకు ప్రస్తుతం పట్టే సమయంతో పోలిస్తే.. స్కైవాక్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఇప్పటివరకు రోడ్డుపై నడుస్తూ వెళ్లడానికి దాదాపు 10 నుంచి 12 నిమిషాలు పడుతుంటే.. స్కైవాక్ ద్వారా కేవలం 2 నుంచి 3 నిమిషాల్లోనే టౌన్‌షిప్‌కు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. అంటే.. మెట్రో దిగిన వెంటనే.. ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా.. ఎలివేటెడ్ మార్గంలో నేరుగా ఇంటి వైపు ప్రయాణం.
ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత కూడా ఉంది. హైదరాబాద్‌లో మెట్రో స్టేషన్లను షాపింగ్ మాల్స్, ఐటీ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలతో అనుసంధానించే సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. కానీ.. మెట్రో కాంకోర్స్ నుంచి నేరుగా ఒక రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌కు స్కైవాక్ అనుసంధానం చేయడం ఇదే తొలిసారి అని వాసవి గ్రూప్ చెబుతోంది. అందుకే ఎల్బీనగర్ స్కైవాక్ ఇప్పుడు నగర రియల్ ఎస్టేట్, రవాణా వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఇక నిర్మాణ పరంగా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. NH-65 ఫుట్‌పాత్ వెంట మొత్తం 10 ప్రధాన స్తంభాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్తంభం సుమారు 5.94 మీటర్ల వ్యాసం, 8.64 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్లు మాత్రమే కాకుండా.. ర్యాంపులు, లిఫ్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో వృద్ధులు, పిల్లలు, ఇతర ప్రత్యేక అవసరాలున్నవారికి కూడా స్కైవాక్ వినియోగం సులభంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు.
ఈ స్కైవాక్ నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయంతో అనుమతులు పొందినట్లు వాసవి గ్రూప్ వెల్లడించింది. ఐఐటీ హైదరాబాద్ డిజైన్, సాంకేతిక తనిఖీలతో నిర్మాణాన్ని చేపడుతున్నట్లు సంస్థ తెలిపింది. ఎల్‌అండ్‌టీతో కుదిరిన ఒప్పందం ప్రకారం 180 రోజుల్లో.. అంటే ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక ఉంది. ఇక ఈ స్కైవాక్ వల్ల నేరుగా ప్రయోజనం పొందబోయేది వేలాది మంది నివాసితులు. 29.37 ఎకరాల్లో.. 3,576 ఫ్లాట్లతో అభివృద్ధి చేస్తున్న వాసవి ఆనంద నిలయానికి ఈ స్కైవాక్ నేరుగా కనెక్ట్ కానుంది. అంటే.. ఇంటి నుంచి మెట్రోకు వెళ్లాలన్నా.. మెట్రో నుంచి ఇంటికి రావాలన్నా.. రద్దీ రోడ్లను దాటాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన ఎలివేటెడ్ మార్గం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రోజురోజుకూ పెరుగుతోంది.. నగరం శివార్ల వరకు విస్తరిస్తోంది.. ప్రజా రవాణాపై ఆధారపడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఇంటి గేటు వరకు కనెక్టివిటీ కల్పించే ఈ స్కైవాక్.. హైదరాబాద్‌లో కొత్త తరహా అర్బన్ కనెక్టివిటీకి నాంది పలకనుందా?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0