రూ.8,500 కోట్ల రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలపై ఐటీ నజర్‌..

The Income Tax Department is reportedly examining real estate transactions worth around ₹8,500 crore to detect tax evasion, benami dealings and under-valuation of properties.

Sep 2, 2026 - 01:26
 0  27
రూ.8,500 కోట్ల రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలపై ఐటీ నజర్‌..
income-tax-scrutiny-8500-crore-real-estate-deals
  • బినామీ, తక్కువ విలువ చూపిన డీల్స్‌పై ప్రత్యేక పరిశీలన

దేశంలో భూములు, ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాల్లో పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేసే దిశగా ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా సుమారు రూ.8,500 కోట్ల విలువైన భూమి, ఆస్తి లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ లావాదేవీల్లో కొన్ని పన్ను రిటర్నుల్లో వెల్లడించకపోవడం, ఆస్తుల విలువను తక్కువగా చూపించడం లేదా బినామీ లావాదేవీలకు సంబంధించినవిగా అనుమానాలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఐటీ శాఖ పరిశీలిస్తున్న రూ.8,500 కోట్ల లావాదేవీల్లో సుమారు రూ.2,000 కోట్ల విలువైన డీల్స్‌ బినామీ ఏర్పాట్లకు సంబంధించినవిగా అనుమానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే.. ఆస్తి రికార్డుల్లో ఒక వ్యక్తి కొనుగోలుదారుగా లేదా యజమానిగా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి ఆ ఆస్తికి సంబంధించిన డబ్బును మరో వ్యక్తి సమకూర్చి ఉండొచ్చన్న అనుమానం అధికారులకు ఉంది.

ఇలాంటి సందర్భాల్లో ఆస్తి ఎవరి పేరుపై ఉందన్నదే కాకుండా.. కొనుగోలుకు డబ్బు ఎవరు సమకూర్చారు? ఆస్తి నుంచి లాభం ఎవరికి వెళ్తుంది? అనే అంశాలను కూడా ఐటీ అధికారులు పరిశీలించనున్నారు. ఈ దర్యాప్తులో పాన్ కీలకంగా మారనుంది. భూమి లేదా ఆస్తి కొనుగోలు, విక్రయం, బదిలీ సమయంలో ఉపయోగించిన పాన్ వివరాలను.. సంబంధిత వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఉపయోగించిన పాన్ తో అధికారులు సరిపోల్చుతున్నారు.

అంతేకాదు.. ఆస్తి కొనుగోలుకు పెట్టిన పెట్టుబడి విలువను ఆ వ్యక్తి తన ఆదాయపు పన్ను రిటర్నులో వెల్లడించిన ఆదాయం, పెట్టుబడులతో పోల్చి చూస్తున్నారు. ఒక వ్యక్తి ఆదాయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కోట్ల రూపాయల ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి కేసులు ఐటీ శాఖ పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది.

ఆస్తి విలువ తక్కువగా చూపించారా?

రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల్లో మరో కీలక అంశం అండర్‌-వాల్యుయేషన్‌. అంటే ఆస్తికి వాస్తవంగా చెల్లించిన మొత్తం కంటే రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో తక్కువ విలువ చూపించడం. ఉదాహరణకు.. ఒక ఆస్తికి రూ.5 కోట్లు చెల్లించినా, రికార్డుల్లో దాని విలువను రూ.3 కోట్లుగా చూపిస్తే.. మిగిలిన మొత్తంపై పన్ను సంబంధిత అనుమానాలు తలెత్తవచ్చు. ఇలాంటి సందర్భాల్లో రికార్డుల్లో నమోదైన మొత్తం, వాస్తవ లావాదేవీ విలువ మధ్య తేడాను అధికారులు పరిశీలించనున్నారు.

అలాగే ఆస్తి కొనుగోళ్లలో లెక్కల్లో చూపని నగదు చెల్లింపులు కూడా ఐటీ శాఖ పరిశీలనలో ఉన్న మరో ముఖ్యమైన అంశం. రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో కనిపించే మొత్తానికి అదనంగా నగదు రూపంలో చెల్లింపులు జరిగాయా? అనే కోణంలో కూడా అధికారులు సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి లావాదేవీలు గుర్తిస్తే.. సంబంధిత వ్యక్తుల ఆదాయం, ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, పన్ను రిటర్నులతో వాటిని అనుసంధానించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0