రీట్లలో హైదరాబాద్ దూకుడు

Hyderabad has emerged as India’s second-largest market for REIT-owned office space after Bengaluru, according to a recent Colliers report.

Sep 17, 2026 - 02:11
Sep 17, 2026 - 02:12
 0  11
రీట్లలో హైదరాబాద్ దూకుడు
hyderabad-second-in-reit-office-space-after-bengaluru
  • బెంగళూరు తర్వాత రెండో స్థానం
  • కొలియర్స్ నివేదిక వెల్లడి

దేశంలోని ప్రధాన వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లలో హైదరాబాద్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు (రీట్స్) ద్వారా నిర్వహిస్తున్న ఆఫీస్‌ స్థలం విషయంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. 2026 తొలి అర్ధభాగానికి సంబంధించిన తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లోని మొత్తం ఆఫీస్‌ స్టాక్‌లో దాదాపు 20 శాతం రీట్ల ఆధీనంలో ఉందని కొలియర్స్ తాజా నివేదిక వెల్లడించింది.

 దేశవ్యాప్తంగా ఆపరేషనల్‌ ఆఫీస్‌ రీట్ పోర్ట్‌ఫోలియో 2025 తొలి అర్ధభాగంలోని 95.8 మిలియన్‌ చదరపు అడుగుల నుంచి 2026 తొలి అర్ధభాగంలో 167 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగిందని తెలిపింది. అంటే ఏడాది వ్యవధిలో 74 శాతం వృద్ధి నమోదైంది. దేశంలోని మొత్తం 1.05 బిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్టాక్‌లో REITల వాటా ప్రస్తుతం సుమారు 16 శాతానికి చేరింది.

బెంగళూరు తర్వాత హైదరాబాద్‌

నగరాల వారీగా చూస్తే బెంగళూరులో 67.6 మిలియన్‌ చదరపు అడుగుల రీట్ ఆధారిత ఆఫీస్‌ స్టాక్ ఉంది. ఇది ఆ నగరంలోని మొత్తం ఆఫీస్‌ ఇన్వెంటరీలో 27 శాతానికి సమానం. దీంతో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో 26.2 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలం రీట్ల పరిధిలో ఉంది. ఇది నగరంలోని మొత్తం ఆఫీస్‌ ఇన్వెంటరీలో 20 శాతం. హైదరాబాద్‌ తర్వాత ముంబైలో 14 శాతం రీట్ పెనెట్రేషన్‌ నమోదైంది.

రీట్ అంటే పెద్ద మొత్తంలో ఆదాయం తెచ్చే వాణిజ్య ఆస్తులను ఒక ట్రస్టు కింద సమీకరించి, వాటిలో పెట్టుబడులకు అవకాశం కల్పించే విధానం. సాధారణంగా పెద్ద ఆఫీస్‌ క్యాంపస్‌లు, కమర్షియల్‌ బిల్డింగ్‌లు వంటి ఆదాయాన్ని అందించే ఆస్తులు రీట్ల పోర్ట్‌ఫోలియోలో ఉంటాయి. హైదరాబాద్‌లో రీట్ల వాటా 20 శాతానికి చేరడం ద్వారా నగరంలోని కమర్షియల్‌ ఆఫీస్‌ మార్కెట్‌లో సంస్థాగత పెట్టుబడుల స్థాయి పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

నాలెడ్జ్‌ రియాల్టీ ట్రస్ట్‌ (కేఆర్టీ), మైండ్‌స్పేస్‌ వంటి రీట్ ప్లాట్‌ఫామ్‌లు హైదరాబాద్‌ మార్కెట్‌లో కీలకంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా రీట్ల విస్తరణకు ఇంకా అవకాశం ఉందని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్నాయి. డెవలపర్లు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల వద్ద ఉన్న 300 మిలియన్‌ చదరపు అడుగులకు పైగా ఆఫీస్‌ స్థలం భవిష్యత్తులో రీట్ల కొనుగోళ్లకు అవకాశంగా మారవచ్చని ఇటీవల వచ్చిన నివేదిక ఒకటి పేర్కొంది.

ఇదే సమయంలో నిర్మాణంలో ఉన్న ఆఫీస్‌ స్థలంలోనూ రీట్ల భాగస్వామ్యం పెరుగుతోంది. 2026 తొలి అర్ధభాగంలో దేశవ్యాప్తంగా సుమారు 36 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలం నిర్మాణంలో ఉంది. బెంగళూరు, హైదరాబాద్‌, ముంబై వంటి ప్రధాన మార్కెట్లలో సంస్థాగత పెట్టుబడుల విస్తరణకు ఇది మరింత అవకాశాన్ని కల్పించవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0