హైద‌రాబాద్‌లో రెండు గ్రోత్ ఇంజిన్లు 

Hyderabad’s real estate market is increasingly being driven by two growth corridors: the established western corridor, led by HITEC City, Gachibowli, Kokapet and the Financial District, and the emerging southern corridor centred on Bharat Future City.

Oct 24, 2026 - 07:13
 0  53
హైద‌రాబాద్‌లో రెండు గ్రోత్ ఇంజిన్లు 
hyderabad-real-estate-west-vs-future-city

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఇప్పుడు రెండు గ్రోత్‌ ఇంజిన్లు.. ఒకవైపు వెస్ట్‌ హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు.. మరోవైపు దక్షిణాన భారత్‌ ఫ్యూచర్‌ సిటీ.. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట వంటి ప్రాంతాలు ఇప్పటికే ఐటీ, ప్రీమియం హౌసింగ్‌ మార్కెట్‌లో దూసుకెళ్తుంటే.. ఫ్యూచర్‌ సిటీ కొత్త పారిశ్రామిక, సాంకేతిక కేంద్రంగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ రెండు కారిడార్లలో రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి ఉన్న అవకాశాలేంటి? వెస్ట్‌ హైదరాబాద్‌ ఆధిపత్యం కొనసాగుతుందా? దక్షిణ హైదరాబాద్‌ భవిష్యత్తులో మరో కీలక గ్రోత్‌ సెంటర్‌గా మారుతుందా?

  • హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు రెండు గ్రోత్‌ ఇంజిన్లు
  • వెస్ట్‌ హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు, లగ్జరీ ప్రాజెక్టుల జోరు
  • హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట కీలక రియల్‌ ఎస్టేట్‌ కేంద్రాలు
  • 2026 జనవరి-జూన్‌లో నగరంలో 19,249 ఇళ్ల విక్రయాలు
  • ఏడాది వ్యవధిలో గృహ ధరల్లో 7 శాతం వృద్ధి
  • ఇళ్ల విక్రయాల్లో వెస్ట్‌ హైదరాబాద్‌ వాటా 63 శాతం
  • కార్యాలయ స్థలాల లీజింగ్‌ 75 లక్షల చదరపు అడుగులకు చేరిక
  • దక్షిణాన భారత్‌ ఫ్యూచర్‌ సిటీపై దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు
  • ఏఐ, డేటా సెంటర్లు, ఈవీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు ప్రాధాన్యం
  • ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధిలో మౌలిక సదుపాయాలే కీలకం
  • మెట్రో, రహదారులు, ప్రజా రవాణాతోనే దక్షిణ కారిడార్‌కు ఊతం

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో వెస్ట్‌ హైదరాబాద్‌ కీలక పాత్ర పోషిస్తోంది.. హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట, నియోపోలిస్‌ ప్రాంతాలు ఐటీ, ఆర్థిక సేవలు, అంతర్జాతీయ సంస్థలకు కేంద్రాలుగా మారాయి.. ఉద్యోగ అవకాశాలు, అద్దె డిమాండ్‌, మెరుగైన మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతంలో నివాస రియల్‌ ఎస్టేట్‌కు బలాన్నిస్తున్నాయి.. కోకాపేట, నియోపోలిస్‌ పరిసరాల్లో హైరైజ్‌ భవనాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు, మిశ్రమ వినియోగ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి.. ఇప్పటికే ఏర్పడిన మార్కెట్‌ డిమాండ్‌ వెస్ట్‌ హైదరాబాద్‌కు ప్రధాన బలంగా నిలుస్తోంది.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ గణాంకాలు కూడా వెస్ట్‌ హైదరాబాద్‌ ప్రాధాన్యతను చాటుతున్నాయి.. 2026 జనవరి నుంచి జూన్‌ వరకు నగరంలో 19 వేల 249 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఒక శాతం వృద్ధి నమోదైంది.. కొత్త గృహాల ప్రారంభాలు 2 శాతం తగ్గి 20 వేల 466 యూనిట్లకు చేరాయి.. నగరంలో సగటు నివాస ధర చదరపు అడుగుకు 8 వేల 258 రూపాయలుగా నమోదైంది.. ఏడాది వ్యవధిలో ధరలు 7 శాతం పెరిగాయి.

కొత్త గృహాల ప్రారంభాల్లో వెస్ట్‌ హైదరాబాద్‌ వాటా 61 శాతం కాగా, ఇళ్ల విక్రయాల్లో ఏకంగా 63 శాతం వాటా ఈ ప్రాంతానిదే.. అంటే నగరంలో విక్రయమైన ప్రతి 100 ఇళ్లలో సుమారు 63 ఇళ్లు వెస్ట్‌ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి.. కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లోనూ ఇదే జోరు కొనసాగుతోంది.. 2026 తొలి ఆరు నెలల్లో కార్యాలయ స్థలాల లీజింగ్‌ 75 లక్షల చదరపు అడుగులకు చేరింది.. ఇందులో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల వాటా 45 శాతం.. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు నెలకు 80 రూపాయలుగా నమోదైంది. వెస్ట్‌ హైదరాబాద్‌లో ఇప్పటికే స్థిరపడిన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు భిన్నంగా.. దక్షిణాన భారత్‌ ఫ్యూచర్‌ సిటీ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతోంది.. మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయాన్ని 2026 జూన్‌ 10న ప్రారంభించారు.. సుమారు 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రణాళిక రూపొందించనుండగా.. తొలి దశలో 30 వేల ఎకరాలపై దృష్టి పెట్టాలన్నది ప్రతిపాదన. లైఫ్‌ సైన్సెస్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సెంటర్లు, అధునాతన తయారీ రంగాలకు ప్రత్యేక కేంద్రాలను అభివృద్ధి చేయాలనేది లక్ష్యం.. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే దక్షిణ హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగ అవకాశాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంటుంది.. అయితే రహదారులు, నీరు, విద్యుత్‌, ప్రజా రవాణా, పరిశ్రమల స్థాపన వంటి మౌలిక సదుపాయాలు దశలవారీగా అభివృద్ధి చెందాల్సి ఉంది..

రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధిలో భూమి ధరలు మాత్రమే కాదు.. కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ కేంద్రాల లభ్యత కూడా కీలకమే.. వెస్ట్‌ హైదరాబాద్‌లో ప్రధాన రహదారులు, మెట్రో, కార్యాలయ సముదాయాలు, విద్యా, వైద్య సదుపాయాలు ఇప్పటికే మార్కెట్‌కు మద్దతుగా ఉన్నాయి.. దక్షిణాన ఫ్యూచర్‌ సిటీ విజయవంతం కావాలంటే విమానాశ్రయానికి అనుసంధానంతోపాటు ఇతర ఉద్యోగ కేంద్రాలకు ప్రయాణ సౌలభ్యం పెరగాలి.. మెట్రో రైల్‌, ప్రజా రవాణా, నీటి సరఫరా, విద్యుత్‌, మురుగునీటి నిర్వహణ వంటి అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. మొత్తంగా చూస్తే.. వెస్ట్‌ హైదరాబాద్‌ ప్రస్తుత రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌కు కేంద్రంగా కొనసాగుతుండగా.. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ దక్షిణాన కొత్త అభివృద్ధి అవకాశాలకు వేదికగా మారే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.. ఒకటి ఇప్పటికే బలపడిన మార్కెట్‌.. మరొకటి భవిష్యత్తు ప్రణాళికలపై ఆధారపడిన మార్కెట్‌.. ఈ రెండు కారిడార్ల వృద్ధిని నిర్ణయించేది మాత్రం మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ఉద్యోగాల కల్పనే.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0