రియల్టర్ రాంరెడ్డి ఆత్మహత్య.. సీఎంకు దూరపు బంధువు?
The suicide of realtor Ram Reddy has raised concerns over the growing financial and operational pressures facing Hyderabad’s real estate sector.
రియల్ రంగానికి కరువైన ప్రభుత్వ ప్రోత్సాహం
అధికారులు, సిబ్బందిలో పెరిగిన అవినీతి
రెవెన్యూలో సమస్యల పరిష్కారానికి
లక్షల్లో డిమాండ్ చేసినట్లు ఆరోపణలు
ల్యాండ్‌లార్డ్స్, పార్టనర్ల నుంచి ఒత్తిళ్లు
రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు
పెరిగిన అప్పులు, వడ్డీల భారం..
రియాల్టీకి కరువైన ప్రభుత్వ ప్రోత్సాహం
అమ్మకాల్లేక దెబ్బతిన్న నగర రియాల్టీ
దివాలా తీసే స్థితిలో కొందరు బిల్డర్లు
(కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591)
రియల్ ఎస్టేట్ రంగం గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడంతో.. హైదరాబాద్ నిర్మాణ రంగం మరింత మెరుగ్గా అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు. శంషాబాద్- రాయదుర్గం మెట్రో రద్దు, ఫార్మా సిటీ రద్దుతో ఆరంభమైన రియల్ పతనం.. హైడ్రా దెబ్బకు కునారిల్లిపోయింది.. సెక్షన్ 2- ఏ దాటికి బొక్కాబోర్లా పడింది. పశ్చిమంలో భూముల్ని వేలం వేసి.. అధిక ధరకు అమ్ముకున్న ప్రభుత్వం.. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యక్షంగా తీసుకున్న నిర్ణయాలేమీ లేకపోవడం దారుణమైన విషయం. అందుకే, కోకాపేట్‌లో ఇటీవల నిర్వహించిన వేలం పాటలో.. బెంగళూరుకు చెందిన ఒకే ఒక్క కార్పొరేట్ బిల్డర్ పాల్గొన్నాడు.. ఒక్క పైసా కూడా అదనంగా పెట్టకుండా.. హెచ్ఎండీఏ నిర్ణయించిన ధరకే కొన్నాడు.. ఇక రానున్న రోజుల్లో కోకాపేట్‌లో ఎలాంటి వేలం పాటల్ని నిర్వహించినా.. స్థానిక బిల్డర్ల నుంచి పెద్దగా స్పందన రాదనే విషయం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావాలి.
* హైదరాబాద్ గ్రోత్ ఆరంభమైనప్పట్నుంచి.. ఐటీ ఉద్యోగాలకు నిలయమైన పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వం వచ్చాక డైరెక్షన్‌ను మొత్తం దక్షిణం వైపు మార్చేసింది. ఐటీ కారిడార్లో భూముల్ని వేలం వేసి.. ఆ సొమ్ముతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం వెచ్చిస్తుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా.. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. నిర్మాణ రంగం అభివృద్ధి చెందడానికి అవసరమయ్యే ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి పెద్దగా లభించలేదు. దీంతో, మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతిన్నది. ఫలితంగా నిర్మాణ ప్రాజెక్టుల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని నిర్మాణ సంస్థలైతే ఉద్యోగులకూ జీతాలివ్వలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
* మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల పుణ్యమా అంటూ.. వివిధ ప్రాంతాల్లో పలు ప్రాజెక్టుల్ని ప్రారంభించిన బిల్డర్లు.. తమ ప్రణాళికల్ని పూర్తిగా మార్చుకుంటున్నారు. లాభాల మాట దేవుడెరుగు.. ప్రతి ప్రాజెక్టులో నుంచి ఎంత తక్కువ నష్టంతో బయటపడతామా అని కొందరు డెవలపర్లు ఆందోళన చెందుతున్నారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేని రాంరెడ్డి వంటి రియల్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 280 ఎకరాల భారీ వెంచర్‌ను ఆరంభించేందుకు ప్రణాళికల్ని రచించడం.. భూమికి సంబంధించిన రెవెన్యూ సమస్యలు సకాలంలో పరిష్కారం కాకపోవడం, అధికారులతో పాటు సిబ్బంది భారీ స్థాయిలో లంచాల్ని డిమాండ్ చేయడం, ఫలితంగా అప్పుల్లో కూరుకుపోవడం, ల్యాండ్‌లార్డ్స్, పార్ట్‌నర్స్, స్థానిక రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్ల పెరగడంతో.. ఏం చేయాలో అర్థం కాక బలవంత మరణానికి పాల్పడ్డారని సమాచారం.
* గతంలో కూడా ఒక చిన్న సైజు బిల్డర్ అల్వాల్‌లో బలవన్మరణం పొందిన విషయం తెలిసిందే. చిన్నచిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులూ ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనల్ని చూస్తూనే ఉన్నాం. మరి, ఇలాంటి దుస్థితి నుంచి రియల్ రంగం ఎప్పుడు బయటపడుతుంది? ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని నిర్మాణ రంగం భయంభయంతో కాలం వెళ్లదీస్తోంది.
* హైదరాబాద్ రియల్ రంగానికి గల ప్రతిష్ఠ పూర్తిగా మసక బారిపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుటుంబానికి దగ్గర బంధువైన రాంరెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్య చేసుకోవడం.. రియల్ ఎస్టేట్ దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ రంగానికి అవసరమయ్యే ప్రోత్సహం రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించకపోవడమే ఇందుకు కారణమని రియల్ ఎస్టేట్ రంగం సర్వత్రా అభిప్రాయపడుతోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0