సెప్టెంబ‌రులో ప్రాపర్టీ  రిజిస్ట్రేషన్లు డల్..

Hyderabad’s residential real estate market witnessed a slowdown in property registrations in September 2026, according to a latest report by Knight Frank India.

Oct 23, 2026 - 00:15
 0  28
సెప్టెంబ‌రులో ప్రాపర్టీ  రిజిస్ట్రేషన్లు డల్..
hyderabad-property-registrations-decline-15-percent-september-2026
* గతేడాడితో పోలిస్తే 15 శాతం మేర తగ్గుదల
* ఆస్తుల విలువ కూడా 7 శాతం తగ్గిన వైనం
 
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో గత నెలలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. గత ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య 15 శాతం పడిపోయి 5,620 యూనిట్లకు చేరింది. రిజిస్ట్రేషన్ల ద్వారా నమోదైన ఆస్తుల మొత్తం విలువ కూడా 7 శాతం తగ్గింది. అయితే, సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ, 2026 జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 55,715 నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
గత ఏడాది ఇదే కాలంలో 55,505 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే స్వల్పంగా పెరిగాయి. ఈ తొమ్మిది నెలల్లో నమోదైన లావాదేవీల మొత్తం విలువ 4 శాతం పెరిగి రూ.39,910 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.38,536 కోట్లుగా ఉంది. ఈ మేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది.
 
ఈ ఏడాది ఆగస్టులో 5,937 నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగ్గా, సెప్టెంబర్‌లో ఆ సంఖ్య 5,620కి తగ్గింది. నెలవారీగా చూస్తే 5 శాతం క్షీణత నమోదైంది. రిజిస్ట్రేషన్ల విలువ కూడా ఆగస్టులోని రూ.4,576 కోట్ల నుంచి సెప్టెంబర్‌లో రూ.4,487 కోట్లకు పడిపోయింది. ప్రభుత్వ గైడెన్స్‌ విలువల సవరణల నేపథ్యంలో మార్కెట్‌ కార్యకలాపాల్లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా పేర్కొంది.
 
ధరల వారీగా చూస్తే, రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్లు సెప్టెంబర్‌లో మొత్తం రిజిస్ట్రేషన్‌ లావాదేవీల విలువలో 56 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ వాటా 54 శాతంగా ఉంది. అయితే, ఈ విభాగంలోనూ రిజిస్ట్రేషన్లు వార్షిక ప్రాతిపదికన 12 శాతం తగ్గి 1,291 యూనిట్లకు చేరాయి. లావాదేవీల విలువ మాత్రం 2 శాతమే తగ్గి రూ.2,514 కోట్లుగా నమోదైంది. రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్‌లో 20 శాతం తగ్గి 2,883 యూనిట్లకు చేరాయి.
ఈ విభాగంలోని లావాదేవీల విలువ 15 శాతం పడిపోయి రూ.970 కోట్లుగా నమోదైంది. రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 6 శాతం తగ్గి 1,446 యూనిట్లకు చేరాయి. ఈ విభాగంలోని లావాదేవీల విలువ 8 శాతం తగ్గి రూ.1,004 కోట్లుగా ఉంది. మొత్తంగా చూస్తే, అన్ని ధరల విభాగాల్లోనూ సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ, తక్కువ ధరల ఇళ్ల విభాగంలో క్షీణత ఎక్కువగా కనిపించింది.
 
చదరపు అడుగు ధరలో 6 శాతం పెరుగుదల
రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ, నివాస ఆస్తుల వెయిటెడ్‌ యావరేజ్‌ లావాదేవీ ధర చదరపు అడుగుకు 6 శాతం పెరిగి రూ.5,021కు చేరింది. జిల్లాల వారీగా సంగారెడ్డిలో ధరలు 20 శాతం పెరగగా, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 8 శాతం వృద్ధి నమోదైంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ధరలు 2 శాతం చొప్పున పెరిగాయి. సెప్టెంబర్‌ రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా 49 శాతం వాటాతో ముందుండగా, మేడ్చల్‌-మల్కాజిగిరి 33 శాతం, హైదరాబాద్‌ జిల్లా 16 శాతం, సంగారెడ్డి 1 శాతం వాటా కలిగి ఉన్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0