ఎల్లమ్మబండ చెరువును.. ఎవరు చెరపట్టారు?
A controversy has emerged over approximately 9.5 acres of land allegedly falling within the limits of Ellammabanda Lake in Hyderabad.
ఎల్లమ్మబండ చెరువు కింద 9.5 ఎకరాలు.. రాత్రివేళల్లో మట్టిపూడ్చుడు
హైదరాబాద్‌లో చెరువులు, వాటి పరిధిలోని భూములపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎల్లమ్మబండ చెరువు పరిధిలోని సుమారు 9.5 ఎకరాల భూమి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ భూమి చెరువు కట్ట కింద ఉందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అక్కడ రాత్రివేళల్లో గుంతలను పూడ్చే పనులు ప్రారంభమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించి అనుమతులు ఎలా వచ్చాయి? అసలు ఈ భూమి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా? లేక ఎఫ్టీఎల్‌కు బయట ఉందా? చెరువు బఫర్ జోన్‌కు సంబంధం ఉందా? అన్న అంశాలపై ఇప్పుడు అధికారుల పరిశీలన కీలకంగా మారింది.
100 అడుగుల రోడ్డు అప్రూవల్.. హెచ్ఎండీఏ పర్మిషన్?
ఈ భూమికి సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ 100 అడుగుల రోడ్డు అప్రూవల్‌కు సంబంధించిన సజెషన్ కాపీ ఆధారంగా హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందినట్లు సమాచారం. అయితే ఆ సజెషన్ ఏ ప్రాతిపదికన వచ్చింది? రోడ్డు ప్రతిపాదనకు సంబంధించిన భూమి స్థితిగతులు ఏమిటి? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకవైపు హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయని చెబుతుండగా.. మరోవైపు భూమి చెరువు పరిధిలోకి వస్తుందా లేదా అన్న అంశంపై వివాదం ఉండటంతో వివిధ శాఖల రికార్డులను సమగ్రంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాత్రివేళల్లో మట్టి పనులు.. ఎందుకంత తొందర?
స్థానికుల సమాచారం ప్రకారం.. సదరు భూమిలో ప్రస్తుతం రాత్రివేళల్లో గుంతలను పూడ్చే పనులు జరుగుతున్నాయి. భారీ వాహనాలతో మట్టి తరలించి భూమిని చదును చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చెరువు పరిధి, ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్‌కు సంబంధించి వివాదం ఉన్న భూమిలో ఇటువంటి పనులు జరుగుతున్నట్లయితే.. వాటికి ఏ శాఖ అనుమతి ఇచ్చింది? పనులకు సంబంధించిన పర్మిషన్లు, లేఅవుట్ అనుమతులు, రోడ్డు ప్రతిపాదనలు, రెవెన్యూ రికార్డులు ఏమి చెబుతున్నాయి? అన్నది తేలాల్సి ఉంది.
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా సర్వే ఎందుకు జరగలేదు?
ఈ వ్యవహారంలో మరో కీలక అంశం స్థానిక ఎమ్మెల్యే గాంధీ పలుమార్లు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి సర్వే చేయాలని కోరినట్లు చెబుతున్న విషయం. అయితే సంబంధిత రెవెన్యూ అధికారులు సర్వేపై పెద్దగా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అసలు సర్వే ఎందుకు పెండింగ్‌లో ఉంది? భూమి హద్దులు నిర్ధారించడంలో ఇబ్బంది ఏమిటి? చెరువు ఎఫ్టీఎల్‌ను నిర్ధారించడానికి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సంయుక్త సర్వే ఎందుకు జరగలేదు? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
సర్వే జరిగితేనే క్లారిటీ
మొత్తంగా ఎల్లమ్మబండ చెరువు పరిధిలోని ఈ 9.5 ఎకరాల భూమి వ్యవహారం ఇప్పుడు రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, హైడ్రా విభాగాల మధ్య సమన్వయంతో పరిశీలించాల్సిన అంశంగా మారింది. భూమి ఎఫ్టీఎల్‌లో ఉందా? బఫర్ పరిధిలో ఉందా? లేక పూర్తిగా ప్రైవేట్ భూమేనా? అనే విషయంపై అధికారిక సర్వే, ఎఫ్టీఎల్ మ్యాప్, రెవెన్యూ రికార్డులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అప్పటివరకు అనుమతులు ఉన్నాయనే వాదన ఒకవైపు.. చెరువు పరిధిపై వస్తున్న అభ్యంతరాలు మరోవైపు.. రాత్రివేళల్లో జరుగుతున్న మట్టి పనులు.. వరుసగా వస్తున్న ఆర్‌టీఐలు.. హైడ్రా పోలీస్ కేసు.. ఇవన్నీ కలిపి యల్లమ్మబండ భూమి వ్యవహారాన్ని ఇప్పుడు ఆసక్తికరంగా మార్చాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0