రూ.711 కోట్లతో ఓ టవరే కొనేశారు
Angel One founder, chairman and managing director Dinesh Thakkar has agreed to purchase an entire residential tower in Mumbai’s upscale Juhu Tara Road for around ₹711 crore from Embassy Developments.
- ముంబైలో యాంజెల్ వన్ అధినేత దినేశ్ ఠక్కర్ భారీ డీల్
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జూహులో భారీ స్థాయి రియల్ ఎస్టేట్ ఒప్పందం జరిగింది. యాంజెల్ వన్ వ్యవస్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ ఠక్కర్.. జూహు తారా రోడ్డులోని ఎంబసీ డెవలప్‌మెంట్స్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఎంబసీ టెర్రాజాలోని మొత్తం ఒక రెసిడెన్షియల్ టవర్‌ను సుమారు రూ.711 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలోనే అత్యంత విలువైన సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ లావాదేవీల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ డీల్ సాధారణంగా ఒక అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు కాదు. దినేశ్ ఠక్కర్ కొనుగోలు చేస్తున్నది గ్రౌండ్ ప్లస్ ఏడు అంతస్తుల పూర్తి టవర్.
దీని రెరా కార్పెట్ ఏరియా 63,000 చదరపు అడుగులు. మొత్తం లావాదేవీ విలువను చదరపు అడుగుకు లెక్కిస్తే సుమారు రూ.1.13 లక్షలు అవుతుంది. ఎంబసీ డెవలప్‌మెంట్స్ సెప్టెంబర్ 22న దినేశ్ ఠక్కర్‌తో ఈ టవర్ విక్రయానికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. రూ.711 కోట్ల విలువలో పన్నులు, రిజిస్ట్రేషన్ తదితర లావాదేవీ వ్యయాలు కూడా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఠక్కర్ ఈ నివాసానికి ‘ఏంజెలస్’ అనే పేరు పెట్టారు. దీనిని తన కుటుంబ నివాసంగా ఉపయోగించనున్నట్లు తెలిపారు. గోప్యత, విశాలమైన స్థలం, సముద్ర దృశ్యాలు, ప్రత్యేకమైన జీవనశైలి కోసం ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నట్లు ఆయన వెల్లడించారు.
2029లో అందుబాటులోకి..
జూహు తారా రోడ్డులో రెండు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఎంబసీ టెర్రాజా ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం ఐదు టవర్లలో సుమారు 50 నివాసాలు ఉంటాయి. ఒక్కో టవర్‌లో ఒక్కో అంతస్తుకు ఒకే నివాసం ఉండేలా ప్రణాళిక రూపొందించారు. మూడు, నాలుగు, ఐదు బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్లు ఇందులో ఉంటాయి. సముద్రం, ముంబై నగర దృశ్యాలు కనిపించేలా డిజైన్, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్లు, వెల్‌నెస్, లైఫ్‌స్టైల్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ 2029లో పూర్తికానుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం గ్రాస్ డెవలప్‌మెంట్ విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని ఎంబసీ డెవలప్‌మెంట్స్ తెలిపింది. ముంబయి లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో అతి సంపన్నుల నుంచి భారీ విలువైన ఇళ్లకు డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ముంబైలో 2025 నుంచి రూ.100 కోట్లకు పైబడిన 37 రెసిడెన్షియల్ లావాదేవీలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.5,600 కోట్లుగా ఉంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0