ఆలస్యమైన ఫ్లాట్ తీసుకున్నారా?.. అయినా వడ్డీ కోరొచ్చు
The Allahabad High Court has clarified that a homebuyer does not lose the right to claim interest or compensation for delayed possession merely because they eventually accepted the flat.
- కీలక తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు
ఫ్లాట్ నిర్మాణం ఆలస్యమైనా.. చివరకు బిల్డర్ నుంచి ఇంటి స్వాధీనం తీసుకున్నంత మాత్రాన ఆ ఆలస్యానికి సంబంధించిన వడ్డీ లేదా పరిహారం కోరే హక్కును ఇంటి కొనుగోలుదారు కోల్పోడని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. నోయిడాలోని సెక్టార్-78లో ఉన్న ఆంత్రిక్ష్ గోల్ఫ్ వ్యూ ప్రాజెక్టులో శ్యామ్ సుందర్ అగర్వాల్ 2010లో ఫ్లాట్‌ను బుక్ చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం 2012 నవంబరులోగా ఇంటిని అప్పగించాల్సి ఉంది.
అయితే డెవలపర్ 2017 మేలో మాత్రమే స్వాధీనం ఇవ్వడానికి ముందుకొచ్చారు. అంటే నిర్ణీత గడువుకంటే దాదాపు ఐదేళ్లు ఆలస్యంగా ఫ్లాట్ అందించారు. దీంతో ఆలస్యానికి పరిహారంగా వడ్డీ చెల్లించాలని కొనుగోలుదారు కోరారు. ఇందుకు బిల్డర్ నిరాకరించడంతో ఆయన రెరాను ఆశ్రయించారు. ఈ వివాదాన్ని పరిశీలించిన రెరా అప్పీలేట్ ట్రైబ్యునల్.. కొనుగోలుదారు డెవలపర్‌కు చెల్లించిన మొత్తంపై ఎంసీఎల్ ఆర్ కంటే ఒక శాతం అధిక వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.
వడ్డీని 2012 డిసెంబరు నుంచి 2017 మే వరకు ఉన్న ఆలస్య కాలానికి వర్తింపజేసింది. దీనిపై డెవలపర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఫ్లాట్‌ను కొనుగోలుదారు స్వీకరించిన తర్వాత కూడా వడ్డీ కోరడం సమంజసం కాదని, ఆలస్యానికి జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్ జీటీ) ఆంక్షలు కారణమని వాదించాడు. అయితే హైకోర్టు ఈ వాదనను పూర్తిగా అంగీకరించలేదు. ఈ కేసులో మరో అంశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది.
ప్రాజెక్టు 2014లోనే పూర్తయిందని, అదే ఏడాది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశామని డెవలపర్ స్వయంగా పేర్కొన్నాడు. అలాంటప్పుడు ఎన్ జీటీ ఆంక్షల వల్ల ప్రాజెక్టు పూర్తి కాలేదని అదే సమయంలో వాదించడం పరస్పర విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు గుర్తించిన ‘జీరో పీరియడ్’ ప్రయోజనాన్ని కూడా డెవలపర్ తన వాదనకు ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు. అయితే హైకోర్టు కీలకమైన స్పష్టత ఇచ్చింది.
ప్రాజెక్టును ప్రభావితం చేసిన నియంత్రణలు అమల్లో ఉన్న నిజమైన కాలానికి మాత్రమే ‘జీరో పీరియడ్’ వర్తిస్తుంది. ఆ ఆంక్షలు రావడానికి ముందే ఏర్పడిన ఆలస్యాన్ని పూర్తిగా తొలగించడానికి దాన్ని ఉపయోగించలేమని కోర్టు తెలిపింది.
స్వాధీనం తీసుకున్నా హక్కు పోదు
ఈ కేసులో అత్యంత ముఖ్యమైన అంశం ఇదే. ఆలస్యమైన ఫ్లాట్‌ను కొనుగోలుదారు చివరకు స్వాధీనం తీసుకున్నాడనే కారణంతో, ఆలస్య కాలానికి సంబంధించిన వడ్డీపై అతని హక్కు రద్దు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే.. సంవత్సరాల తరబడి వేచి చూసిన తర్వాత ఇల్లు అందుబాటులోకి వచ్చినా, గతంలో జరిగిన ఆలస్యానికి చట్టబద్ధంగా పరిహారం లేదా వడ్డీ కోరే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం కింద నిర్ణీత సమయంలో ఇంటి స్వాధీనం ఇవ్వకపోతే కొనుగోలుదారుకు పరిహారం కోరే హక్కు ఉంది. ఆలస్యమైన స్వాధీనం విషయంలో వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత డెవలపర్‌పై పడొచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0