బీవీఆర్ ఇన్ ఫ్రాపై తెలంగాణ రెరా కన్నెర్ర

The TG-RERA has directed BVR Infra Developers to refund ₹10.95 lakh, along with 10.7% annual interest, to two homebuyers for failing to hand over a plot in an unregistered real estate project in Kadthal, Rangareddy district.

Oct 23, 2026 - 00:04
Oct 23, 2026 - 10:14
 0  76
బీవీఆర్ ఇన్ ఫ్రాపై తెలంగాణ రెరా కన్నెర్ర
bvr-infra-rera-orders-refund-10-95-lakh-kadthal
  • అనుమతి లేని వెంచర్‌లో ప్లాట్లు విక్రయించిన డెవలపర్‌
  • రూ.10.95 లక్షలు వడ్డీతో తిరిగివ్వాలని ఆదేశం
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నిబంధనలు పాటించకుండా ప్లాట్లు విక్రయించే డెవలపర్లపై తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ ప్రాధికార సంస్థ (టీజీ రెరా) చర్యలు చేపట్టింది.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో రేరా రిజిస్ట్రేషన్‌ లేకుండా వెంచర్‌ నిర్వహించిన బీవీఆర్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ సంస్థ.. ఇద్దరు కొనుగోలుదారులకు రూ.10.95 లక్షలను 10.7 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. 
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, నిబంధనల ఉల్లంఘనపై సంస్థకు జరిమానా విధించే ప్రక్రియ ప్రారంభించాలని కార్యదర్శిని ఆదేశించింది.
 
కడ్తాల్‌లోని ‘ఎస్‌వీ గోల్డెన్‌ సిటీ-III’ వెంచర్‌లో ప్లాట్‌ నంబర్‌ 28ను కొనుగోలు చేసేందుకు ఎం. శీల, పద్మ శ్రీరాములు అంగీకరించారు. ప్లాట్‌ ధర రూ.10.95 లక్షలుగా నిర్ణయించారు. కొనుగోలుదారులు 2022 ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య ఐదు విడతల్లో నగదు చెల్లించారు. 2024 ఫిబ్రవరి 13న విక్రయ ఒప్పందం కూడా చేసుకున్నారు.
అయితే, పూర్తి మొత్తం చెల్లించినప్పటికీ డెవలపర్‌ ప్లాట్‌ను అప్పగించలేదని, విక్రయ దస్తావేజును రిజిస్టర్‌ చేయలేదని కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. దీంతో వారు తెలంగాణ రేరాను ఆశ్రయించారు. ఈ వెంచర్‌లో మొత్తం 85 నివాస ప్లాట్లు ఉన్నాయి.

రేరా రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్రాజెక్టు ప్రకటన

డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) నుంచి లేఅవుట్‌కు తాత్కాలిక అనుమతి పొందినప్పటికీ, ప్రాజెక్టుకు రేరా రిజిస్ట్రేషన్‌ తీసుకోలేదని ప్రాధికార సంస్థ గుర్తించింది. లేఅవుట్‌కు డీటీసీపీ అనుమతి ఉన్నంత మాత్రాన రేరా చట్టం కింద తప్పనిసరిగా పొందాల్సిన రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయింపు లభించదని స్పష్టం చేసింది. 
రేరా రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్రాజెక్టును ప్రకటన చేయడం, మార్కెటింగ్‌ చేయడం, కొనుగోలుదారుల నుంచి డబ్బులు స్వీకరించడం చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాల్సిన రూ.10.95 లక్షలపై వారు చెల్లించిన ఐదు విడతల మొత్తాలకు సంబంధించి, ఆయా చెల్లింపుల తేదీల నుంచి వాపసు చేసే వరకు ఏడాదికి 10.7 శాతం వడ్డీ చెల్లించాలని తెలంగాణ రేరా ఆదేశించింది.
ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా ఈ చెల్లింపులు పూర్తి చేయాలని పేర్కొంది. రేరా చట్టంలోని సెక్షన్‌ 3ను ఉల్లంఘించినందుకు సెక్షన్‌ 59 కింద జరిమానా విధించే ప్రక్రియ ప్రారంభించాలని కూడా ఆదేశించింది.
ఉత్తర్వులను పాటించకపోతే సెక్షన్‌ 63 కింద తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. మానసిక వేదన, ఇబ్బందులు, ఆర్థిక నష్టానికి పరిహారం కోరాలనుకుంటే సెక్షన్‌ 71 కింద సంబంధిత అధికారి వద్దకు వెళ్లేందుకు కొనుగోలుదారులకు అవకాశం కల్పించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0