అన్నలు తమ చెల్లెళ్లకు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులతో పాటు స్థిరాస్తులను కూడా బహుమతిగా ఇవ్వాలనుకోవచ్చు. అయితే కోట్ల రూపాయల విలువైన ఇల్లు, ఫ్లాట్ లేదా భూమిని చెల్లికి గిఫ్ట్‌గా ఇస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తుందా? బహుమతిగా ఇచ్చిన ఆస్తిని భవిష్యత్తులో చెల్లి విక్రయిస్తే పన్ను ఎలా లెక్కిస్తారు? అనే సందేహాలు సహజం. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం అన్న తన సోదరికి ఆస్తిని బహుమతిగా ఇవ్వడం సాధ్యమే.
సాధారణంగా ఆ బహుమతి అందుకున్న సమయంలో చెల్లికి ఆదాయపు పన్ను బాధ్యత ఉండదు. అయితే భవిష్యత్తులో ఆ ఆస్తిని విక్రయించినప్పుడు మాత్రం మూలధన లాభాల పన్ను వర్తించే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(x) ప్రకారం నిర్దిష్ట బంధువుల నుంచి అందుకునే బహుమతులకు ప్రత్యేక మినహాయింపు ఉంది. ఈ జాబితాలో సోదరుడు, సోదరి కూడా ఉన్నారు. అందువల్ల అన్న తన సోదరికి ఆస్తిని ఉచితంగా బదిలీ చేసినప్పుడు, కేవలం ఆస్తి విలువ ఎక్కువగా ఉందనే కారణంతోనే బహుమతి అందుకున్న చెల్లిపై తక్షణ ఆదాయపు పన్ను పడదు.
అంటే.. రూ.50 లక్షలు, రూ. కోటి, రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని అన్న చెల్లికి గిఫ్ట్‌గా ఇచ్చినా, బహుమతి స్వీకరించే సమయంలో సాధారణంగా సెక్షన్ 56(2)(x) కింద పన్ను ఉండదు. అయితే ఇది నిజమైన బహుమతి కావాలి. లావాదేవీ స్వరూపం, బంధుత్వం, ఆస్తి పత్రాలు వంటి అంశాలు సరిగ్గా ఉండాలి. అయితే, అన్న ఆస్తిని చెల్లికి బహుమతిగా ఇచ్చిన వెంటనే పన్ను లేకపోయినా.. చెల్లి ఆ ఆస్తిని తర్వాత విక్రయిస్తే మూలధన లాభాల పన్ను లెక్కలోకి వస్తుంది.
ఒక అన్న 2015లో రూ.50 లక్షలకు ఫ్లాట్ కొనుగోలు చేశాడనుకుందాం. 2026లో రాఖీ సందర్భంగా అదే ఫ్లాట్‌ను చెల్లికి బహుమతిగా ఇచ్చాడు. ఈ బదిలీ సమయంలో సాధారణంగా అన్నకు, చెల్లికి ఆదాయపు పన్ను ఉండదు. కానీ చెల్లి 2027లో ఆ ఫ్లాట్‌ను రూ.1.20 కోట్లకు విక్రయిస్తే.. రూ.1.20 కోట్లను మొత్తం లాభంగా పరిగణించరు. ఆస్తి కొనుగోలుకు అన్న చెల్లించిన అసలు రూ.50 లక్షల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని మూలధన లాభాలను లెక్కిస్తారు. ఈ లెక్కలో అన్న ఆస్తిని కలిగి ఉన్న కాలం కూడా పరిగణనలోకి వస్తుంది. అంటే బహుమతి సమయంలో పన్ను తప్పించుకున్నట్లు కనిపించినా, ఆస్తి విక్రయం సమయంలో గతంలో ఉన్న కొనుగోలు వ్యయం ఆధారంగా పన్ను లెక్కించే విధానం ఉంటుంది.
గిఫ్ట్ డీడ్ తప్పనిసరి
ఆస్తిని బహుమతిగా ఇవ్వాలనుకునే అన్నాచెల్లెళ్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్. ఇల్లు, ఫ్లాట్, భూమి వంటి స్థిరాస్తిని బహుమతిగా బదిలీ చేసేటప్పుడు చట్టబద్ధత కోసం గిఫ్ట్ డీడ్‌ను సక్రమంగా రూపొందించి రిజిస్టర్ చేయడం అవసరం. భవిష్యత్తులో ఆస్తి యాజమాన్యంపై వివాదాలు వచ్చినా, ఆదాయపు పన్ను లెక్కలు వేసేటప్పుడు అయినా ఈ పత్రం కీలక ఆధారంగా ఉంటుంది.
అంతేకాదు.. అన్న ఆస్తిని మొదట ఎంతకు కొనుగోలు చేశాడు? ఎప్పుడు కొనుగోలు చేశాడు? దానికి సంబంధించిన పత్రాలు ఏమిటి? వంటి వివరాలను చెల్లి భద్రపరచుకోవడం అవసరం. భవిష్యత్తులో ఆమె ఆస్తిని విక్రయించినప్పుడు మూలధన లాభాలను లెక్కించడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి. అలాగే అన్న చెల్లికి ఆస్తిని బహుమతిగా ఇస్తున్నప్పుడు అది నిజమైన బహుమతిగా ఉండాలి. ప్రతిఫలంగా చెల్లి అన్నకు మరొక ఖరీదైన ఆస్తి, నగదు లేదా ఇతర ప్రయోజనం ఇస్తే.. ఆ లావాదేవీని సాధారణ బహుమతిగా కాకుండా ఎక్స్చేంజ్ లేదా ఇతర రకమైన బదిలీగా పరిగణించే అవకాశం ఉంటుంది. అందువల్ల గిఫ్ట్ డీడ్‌లో ఎలాంటి నగదు లేదా ఇతర ప్రతిఫలం తీసుకోకుండా ప్రేమాభిమానంతో ఆస్తిని బహుమతిగా ఇస్తున్నట్లు స్పష్టంగా పేర్కొనడం ముఖ్యం.