బెంగళూరులో పార్కింగ్ ఫీజు.. ఇళ్ల ధరలపై ప్రభావం పడేనా?
Bengaluru’s proposed residential parking fees could influence home prices, rents and buyer preferences. Under the Greater Bengaluru Authority’s draft Parking Rules–2026, annual residential parking permit fees of up to ₹25,000 are proposed for vehicles parked on government roads outside homes.
ఐటీ రాజధాని బెంగళూరులో వాహన పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపేందుకు తీసుకొస్తున్న కొత్త నిబంధనలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఇళ్ల ముందు ప్రభుత్వ రహదారులపై వాహనాలను నిలిపే వారికి వాహనం రకాన్ని బట్టి ఏడాదికి గరిష్ఠంగా రూ.25 వేల వరకు పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ఇళ్ల ధరలు, అద్దెలు, కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) రూపొందించిన పార్కింగ్ రూల్స్–2026 ముసాయిదాలో వాహన రకాన్ని బట్టి వార్షిక రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ ఫీజును ప్రతిపాదించారు. హ్యాచ్‌బ్యాక్ కార్లు ఏడాదికి రూ.15,000, సెడాన్ కార్లు ఏడాదికి రూ.20,000, ఎస్‌యూవీలు ఏడాదికి రూ.25,000 చెల్లించాలని పేర్కొన్నారు. ప్రధాన, ఉపప్రధాన రహదారులు మినహా ఇతర నివాస ప్రాంతాల రోడ్లపై వాహనాలను నిలిపేందుకు చెల్లుబాటు అయ్యే రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు.
ఈ ముసాయిదాపై కర్ణాటక ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరుతోంది. అయితే. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం అవసరమైన కనీస పార్కింగ్ సౌకర్యం ఉన్న భవనాల్లో నివసించే వారికి మాత్రమే రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ ఇవ్వాలని పేర్కొన్నారు. అంటే తమ భవనంలోనే అవసరమైన పార్కింగ్ సదుపాయం లేని వారికి రోడ్డు మీద పార్కింగ్ పర్మిట్ లభించకపోవచ్చు.
పర్మిట్ లేకుండా ఇంటి బయట ప్రభుత్వ రహదారిపై వాహనం నిలిపితే దాన్ని అక్రమ పార్కింగ్‌గా పరిగణించి జరిమానా విధించే అవకాశం ఉంది. పర్మిట్ ఒక నిర్దిష్ట వాహనం, దాని రిజిస్టర్డ్ యజమానికి ఒక ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ పునరుద్ధరించుకోవాలి. అంతేకాకుండా పర్మిట్ జారీకి అదనపు పరిపాలనా రుసుము కూడా ఉండొచ్చని ముసాయిదాలో పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎలా?
ఈ ప్రతిపాదన కేవలం వాహనదారులపై పడే అదనపు ఖర్చుగా మాత్రమే చూడలేమని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరులో ఇప్పటికే పార్కింగ్ సౌకర్యం ఉన్న ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కొత్త రుసుములు అమల్లోకి వస్తే సొంతంగా లేదా భవనం ప్రాంగణంలో హామీతో కూడిన పార్కింగ్ ఉన్న ఇళ్లకు మరింత ప్రీమియం ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అంటే ఒకే ప్రాంతంలో ఉన్న రెండు ఇళ్లలో ఒకదానికి ప్రత్యేక పార్కింగ్ ఉంటే, మరోదానికి లేకపోతే.. భవిష్యత్తులో కొనుగోలుదారులు మొదటి ఇంటికి ఎక్కువ ధర చెల్లించేందుకు సిద్ధపడే పరిస్థితి రావచ్చు.
రోడ్డు మీద వాహనం నిలిపే ఇళ్లకు అదనంగా రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వార్షిక ఖర్చు వచ్చే అవకాశం ఉండటంతో, కొనుగోలు నిర్ణయంలో పార్కింగ్ కీలక అంశంగా మారొచ్చు. ఈ ప్రతిపాదన ప్రభావం అద్దెకు ఉండేవారిపై మరింత త్వరగా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటి అద్దెకు అదనంగా పార్కింగ్ కోసం ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో చెల్లించని వారు కూడా ఇకపై అదనపు ఖర్చును భరించాల్సి రావచ్చు.
యజమానులు పార్కింగ్ రుసుమును నేరుగా అద్దెలో కలిపే అవకాశం ఉంది. మరికొందరు అద్దెకు అదనంగా ప్రత్యేక పార్కింగ్ ఛార్జీ వసూలు చేయవచ్చు. ఫలితంగా ఇప్పటికే అధికంగా ఉన్న బెంగళూరు అద్దెలపై మరింత ఒత్తిడి ఏర్పడే అవకాశముంది. ప్రస్తుతం ఇల్లు కొనుగోలు చేసే సమయంలో ప్రాంతం, మెట్రో కనెక్టివిటీ, పాఠశాలలు, కార్యాలయాలకు దూరం, సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.
ఇకపై వీటితో పాటు ‘పార్కింగ్ ఉందా?’ అనేది కూడా కీలక ప్రశ్నగా మారవచ్చు. ముఖ్యంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ కార్లు ఉన్న కుటుంబాలు ప్రత్యేక పార్కింగ్ ఉన్న అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పార్కింగ్ సౌకర్యం లేని పాత భవనాలు, చిన్న అపార్ట్‌మెంట్లకు డిమాండ్‌లో కొంత ఒత్తిడి రావచ్చని... ఫలితంగా వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0