రూ.25.80 కోట్లకు రెండు విలాసవంతమైన ఫ్లాట్లు
Bollywood actress Anushka Sharma’s family has purchased two luxury apartments in Godrej Skyshore, a residential project in Versova, Mumbai, for a combined ₹25.80 crore.
- అనుష్క శర్మ కుటుంబం భారీ రియల్ ఎస్టేట్ డీల్
బాలీవుడ్ నటి అనుష్క శర్మ కుటుంబం ముంబైలో మరో భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టింది. అనుష్క శర్మ తల్లిదండ్రులు అషిమా, అజయ్‌కుమార్ శర్మ ముంబైలోని వెర్సోవాలో ఉన్న గోద్రేజ్ స్కైషోర్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో రెండు పక్కపక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు. ఈ రెండు ఫ్లాట్ల విలువ కలిపి రూ.25.80 కోట్లు. ఈ రెండు కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలు 2026 జూలై 8న రిజిస్టర్ అయ్యాయి. రెండూ గోద్రేజ్ స్కైషోర్ టవర్ ఏలోని 24వ అంతస్తులో ఉన్నాయి. అనుష్క శర్మ సొంతంగా కొనుగోలు చేసిన ఫ్లాట్ విలువ దాదాపు రూ.14.89 కోట్లు. దీని మొత్తం విస్తీర్ణం సుమారు 2,153.7 చదరపు అడుగులు కాగా.. కార్పెట్ ఏరియా 2,026 చదరపు అడుగులు. బాల్కనీ/టెర్రస్ విస్తీర్ణం సుమారు 128 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్‌కు మూడు కవర్డ్ బేస్‌మెంట్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. స్టాంప్ డ్యూటీగా రూ.74.47 లక్షలు చెల్లించినట్లు రిజిస్ట్రేషన్ వివరాలు చెబుతున్నాయి.
అనుష్క తల్లిదండ్రులు కొనుగోలు చేసిన రెండో అపార్ట్‌మెంట్ విస్తీర్ణం సుమారు 1,577 చదరపు అడుగులు. ఇందులో 1,477.8 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, దాదాపు 99.2 చదరపు అడుగుల బాల్కనీ/టెర్రస్ ఉంది. దీని కొనుగోలు ధర రూ.10.91 కోట్లు. దీనికి రూ.65.45 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ ఫ్లాట్‌కు రెండు కవర్డ్ బేస్‌మెంట్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ రెండు అపార్ట్‌మెంట్ల మొత్తం విస్తీర్ణం సుమారు 3,731 చదరపు అడుగులు. ఐదు కవర్డ్ బేస్‌మెంట్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.
కార్పెట్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు సుమారు రూ.73,500–74,000 చొప్పున ధర పలికినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది. అనుష్క శర్మ, ఆమె తల్లిదండ్రులు మాత్రమే కాకుండా అనుష్క శర్మ–విరాట్ కోహ్లీ దంపతులు కూడా ఇదే ప్రాజెక్టులో మరో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. జూలై 21న నమోదైన ఆ లావాదేవీ విలువ రూ.18.29 కోట్లు. దీంతో గోద్రేజ్ స్కైషోర్ టవర్ ఏలోని 24వ అంతస్తులో అనుష్క కుటుంబానికి మొత్తం మూడు అపార్ట్‌మెంట్లు ఉన్నట్లయింది. మూడు లావాదేవీల మొత్తం విలువ సుమారు రూ.44.1 కోట్లు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
ఒప్పందాల ప్రకారం ఫ్లాట్ల స్వాధీనం 2031 జూన్ 30లోపు ఇవ్వాల్సి ఉంది. అనుష్క–విరాట్ దంపతుల రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో ఈ కొనుగోళ్లు మరో కీలక లావాదేవీ. 2026 జనవరిలో వారు అలీబాగ్‌లోని జిరాడ్ గ్రామంలో సుమారు 5.19 ఎకరాల రెండు పక్కపక్కన ఉన్న భూములను రూ.37.86 కోట్లకు కొనుగోలు చేశారు. 2022లోనూ దాదాపు 8 ఎకరాల భూమిని రూ.19.24 కోట్లకు కొనుగోలు చేసి, అక్కడ విలాసవంతమైన హాలిడే హోమ్ నిర్మించినట్లు నివేదికలు వెల్లడించాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0