చికాగోలో రూ.4,600 కోట్లతో ఆకాశహర్మ్యం కొనుగోలు
Spanish billionaire Amancio Ortega, founder of fashion brand Zara, has acquired the 51-storey One North Wacker office tower in Chicago for approximately $550 million (over ₹4,600 crore).
- జారా అధినేత భారీ డీల్
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ జారా వ్యవస్థాపకుడు, స్పెయిన్ బిలియనీర్ అమాన్సియో ఒర్టేగా అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో భారీ కొనుగోలు చేశారు. చికాగో నగరంలోని 51 అంతస్తుల కార్యాలయ భవనం ‘వన్ నార్త్ వాకర్’ను సుమారు 550 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.4,600 కోట్లకు పైగా) సొంతం చేసుకున్నారు.
ఒర్టేగాకు చెందిన పెట్టుబడి సంస్థ పొంటెగాడియా ఇన్వర్షియోనెస్ ఈ లావాదేవీని పూర్తి చేసింది. అమెరికాలో ఈ ఏడాది జరిగిన అతిపెద్ద కార్యాలయ భవనాల కొనుగోళ్లలో ఇదొకటిగా నిలిచింది. చికాగోలోని లూప్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ భవనం సుమారు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
2001లో నిర్మించిన ఈ కార్యాలయ సముదాయంలో ప్రస్తుతం సుమారు 94 శాతం స్థలం అద్దెకు వెళ్లింది.
అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ పీడబ్ల్యూసీ, స్విస్ బ్యాంక్ యూబీఎస్, ఫిచ్ రేటింగ్స్ వంటి ప్రముఖ సంస్థలు ఇందులో కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. దీంతో ఈ భవనం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందే అవకాశం ఉంది.
జారా మాతృసంస్థ ఇండిటెక్స్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్న ఒర్టేగా తన వ్యాపార ఆదాయాన్ని రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. ఆయన కుటుంబ పెట్టుబడి సంస్థ పొంటెగాడియా ద్వారా కార్యాలయ భవనాలు, లగ్జరీ నివాస సముదాయాలు, రిటైల్ దుకాణాలు, లాజిస్టిక్స్ గోదాములను కొనుగోలు చేస్తున్నారు.
అమెరికాతో పాటు బ్రిటన్, స్పెయిన్ తదితర దేశాల్లోనూ ఆయనకు పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. చికాగో నగరంలోనూ ఒర్టేగాకు ఇప్పటికే పలు ఆస్తులున్నాయి. 2023లో 492 అపార్ట్‌మెంట్లతో కూడిన నివాస భవనాన్ని సుమారు 232 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.
అంతకుముందు వాణిజ్య భవనాలు, దుకాణాల సముదాయాల్లోనూ పెట్టుబడులు పెట్టారు. తాజా కొనుగోలుతో నగరంలోని ఆయన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించింది. అమెరికాలో కరోనా అనంతరం కార్యాలయాలకు డిమాండ్, ఖాళీ స్థలాలు, అద్దె రేట్ల విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
అయినప్పటికీ ప్రముఖ కంపెనీలు అద్దెకు ఉన్న, అధిక ఆక్యుపెన్సీ కలిగిన భవనాలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. వన్ నార్త్ వాకర్ భవనంలో 94 శాతం స్థలం అద్దెకు వెళ్లి ఉండటం ఈ ఒప్పందానికి ప్రాధాన్యం తెచ్చింది.
చికాగోలో 2015లో అయాన్ సెంటర్ 712 మిలియన్ డాలర్లకు విక్రయమైన తర్వాత, తాజా ఒప్పందం నగరంలోని అతిపెద్ద కార్యాలయ భవన విక్రయాల్లో ఒకటిగా నిలిచింది.
ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వాలి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0