ట్రిపుల్‌ ఆర్‌ భూములకు భారీ పరిహారం

Farmers losing land for the Regional Ring Road (RRR) may get higher compensation, as authorities are considering current land values instead of the older registration rates used for compensation.

Aug 25, 2026 - 07:56
 0  61
 ట్రిపుల్‌ ఆర్‌ భూములకు భారీ పరిహారం
rrr-land-compensation-1-20-crore-per-acre
  • ఎకరానికి రూ.1.20 కోట్లు

రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం విషయంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పాత రిజిస్ట్రేషన్‌ విలువల ఆధారంగా ఇస్తున్న పరిహారం సరిపోవడం లేదన్న అభ్యంతరాల నేపథ్యంలో.. తాజా భూముల విలువలను పరిగణనలోకి తీసుకుని పరిహారం పెంచే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో హైవేకు సమీపంలోని కొన్ని భూములకు ఎకరానికి రూ.1.20 కోట్ల వరకు పరిహారం ఇచ్చే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదు మండలాల పరిధిలోని 24 గ్రామాల మీదుగా 59.33 కిలోమీటర్లు వెళ్లనుంది. ఇందుకోసం సుమారు 1,795 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటికే యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సర్వే పూర్తికాగా.. కొన్ని ప్రాంతాల్లో పరిహారం చెల్లింపులు కొనసాగుతున్నాయి.

పాత రేట్లపైనే అభ్యంతరం

ట్రిపుల్‌ ఆర్‌ భూసేకరణ నోటిఫికేషన్‌ 2022లో రావడంతో అప్పటి రిజిస్ట్రేషన్‌ విలువల ఆధారంగానే పరిహారం లెక్కిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎకరానికి రూ.12 లక్షల నుంచి రూ.25 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.14 లక్షల నుంచి రూ.84 లక్షల వరకు పరిహారం వస్తోంది. అయితే నాలుగేళ్లలో భూముల ధరలు భారీగా పెరగడంతో పాత విలువల ప్రకారం పరిహారం ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తుర్కపల్లి ప్రాంత రైతులు పరిహారం పెంపు కోసం ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించారు. ఇప్పుడు చౌటుప్పల్‌ రైతులు కూడా అదే బాట పట్టారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో భూముల విలువలు భారీగా పెరిగాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

రూ.73 లక్షలకు చేరిన రిజిస్ట్రేషన్‌ విలువ

2022లో కొన్ని ప్రాంతాల్లో ఎకరం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.25.20 లక్షలు ఉండగా.. సవరణ తర్వాత రూ.32.80 లక్షలకు పెరిగింది. మరికొన్ని సర్వే నంబర్లలో ఏకంగా రూ.73.23 లక్షలకు చేరింది. దీంతో తాజా విలువలనే పరిహారం నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారికి సమీపంలోని కొన్ని భూములకు ఎకరానికి రూ.1.20 కోట్ల వరకు పరిహారం ఇచ్చే ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇది ఇంకా తుది నిర్ణయం కాదు. ఆర్బిట్రేషన్‌లో రేటు ఖరారైన తర్వాత ప్రతిపాదనను ఎన్‌హెచ్‌ఏఐకి పంపనున్నారు. అక్కడ ఆమోదం లభించిన తర్వాతే పెంచిన పరిహారం చెల్లింపులపై స్పష్టత రానుంది. చౌటుప్పల్‌లో పెంచిన పరిహారానికి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే.. ట్రిపుల్‌ ఆర్‌ పరిధిలోని ఇతర ప్రాంతాల రైతుల నుంచి కూడా తాజా భూముల విలువల ఆధారంగా పరిహారం పెంచాలన్న డిమాండ్‌ మరింత బలపడే అవకాశముంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0