ఓయస్టర్ బ్లూ ఎలైట్ కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్..

The Hyderabad District Consumer Disputes Redressal Commission-1 has directed the developer of Oyster Blue Elite venture in Bogaram, Medchal-Malkajgiri district, to return the original registered sale deeds of two plots to the buyer.

Sep 2, 2026 - 02:08
Sep 2, 2026 - 04:08
 0  55
ఓయస్టర్ బ్లూ ఎలైట్ కు  హైదరాబాద్ వినియోగదారుల  కమిషన్ బిగ్ షాక్..
Oyster Blue Elite Gets Big Shock from Hyderabad Consumer Commission
  • ‘ఓయస్టర్ బ్లూ ఎలైట్’ కొనుగోలుదారుడికి సేల్ డీడ్ తిరిగి ఇవ్వాలని ఆదేశం..
  • రూ.35 వేల పరిహారం, ఖర్చులు చెల్లించాలని తీర్పు

రియల్ ఎస్టేట్ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-1 షాక్ ఇచ్చింది. ఓయస్టర్ బ్లూ ఎలైట్ వెంచర్‌లో రెండు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తికి అసలు రిజిస్టర్డ్ సేల్ డీడ్‌ను తిరిగి ఇవ్వాలని సంబంధిత డెవలపర్‌ను ఆదేశించింది. అంతేకాకుండా సేవల్లో లోపం, అన్యాయ వాణిజ్య విధానాలకు సంబంధించి బాధితుడికి రూ.25 వేల పరిహారం, రూ.10 వేల న్యాయవ్యయాలు కలిపి మొత్తం రూ.35 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని కమిషన్ పేర్కొంది.

మెడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని బోగారం ప్రాంతంలో ఉన్న ఓయస్టర్ బ్లూ ఎలైట్ వెంచర్‌లో డాక్టర్ సురేశ్ బాబు కోతూరి రెండు ప్లాట్లను కొనుగోలు చేశారు. వాటి మొత్తం విస్తీర్ణం 400 చదరపు గజాలు. ప్లాట్ల కొనుగోలుకు చదరపు గజానికి రూ.8,000 చొప్పున ధర నిర్ణయించుకున్నామని, అంటే మొత్తం రూ.32 లక్షలు అవుతుందని కొనుగోలుదారు కమిషన్‌కు తెలిపారు. ఈ మొత్తాన్ని 2020 ఫిబ్రవరి 24న రిజిస్ట్రేషన్‌కు ముందే చెల్లించినట్లు పేర్కొన్నారు. 

అదనంగా సేవల పేరుతో రూ.1.50 లక్షలు చెల్లించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ప్లాట్లకు అంగీకరించిన ధర చదరపు గజానికి రూ.8,000 కాదని, రూ.13,000 అని డెవలపర్ వాదించారని పేర్కొన్నారు. ఈ కేసులో సమర్పించిన ఒప్పందాన్ని పరిశీలించిన వినియోగదారుల కమిషన్.. ప్లాట్లకు చదరపు గజానికి రూ.8,000 ధరకు అంగీకారం ఉన్నట్లు గుర్తించింది. మరోవైపు డెవలపర్ తరఫు నుంచి తమ వాదనకు మద్దతుగా తగిన ఆధారాలు సమర్పించలేదని కమిషన్ నిర్ధారించింది.

ముఖ్యంగా అసలు సేల్ డీడ్ తమ వద్ద ఉన్నప్పటికీ దానిని కమిషన్ ముందు సమర్పించకపోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. దీంతో కొనుగోలుదారుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. డెవలపర్ రెండు ప్లాట్లకు సంబంధించిన అసలు రిజిస్టర్డ్ సేల్ డీడ్‌ను కొనుగోలుదారుడికి తిరిగి ఇవ్వాలని, అలాగే సేవల్లో లోపం, అన్యాయ వాణిజ్య విధానాల కారణంగా రూ.25 వేల పరిహారం, కేసు నిర్వహణకు అయిన ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ రెండు మొత్తాలను కలిపి రూ.35 వేలను 45 రోజుల్లో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0