మూడు, నాలుగేళ్ల క్రితం ఆరంభమైన ప్రాజెక్టుల్లో అధిక శాతం.. నిర్మాణ చివరి దశకు చేరుకున్నాయి. అయితే, అందులో ఫ్లాట్లను కొనాలని భావించేవారికి పెద్దగా ధరలు తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే, ఇటీవల ఆరంభమైన నిర్మాణాల్లో మాత్రం రేటు కాస్త తక్కవే ఉంటుందని చెప్పొచ్చు.
ఎందుకంటే, రియల్ ఎస్టేట్ మార్కెట్ పెద్దగా గొప్పగా లేదు. ఆశించినంత స్థాయిలో ఫ్లాట్ల అమ్మకాలు జరగట్లేదు. దీంతో, అధిక శాతం మంది డెవలపర్లకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అమ్మకాలు లేకపోవడంతో, వెండార్లకు పేమెంట్లు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. సిబ్బందికి జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో కొత్తగా ఏ బిల్డర్ ప్రాజెక్టును ప్రారంభించినా.. ఫ్లాట్ల ధరల్ని తగ్గించి విక్రయించే అవకాశముంది. ఎందుకంటే, గతంతో పోల్చితే.. తక్కువ శాతానికే డెవలప్‌మెంట్ కోసం ల్యాండ్‌లార్డ్ నుంచి స్థలాన్ని తీసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే బిల్డర్లు.. కనీసం పది నుంచి పదిహేను శాతం తక్కువ రేటుకే ఫ్లాట్లను విక్రయిస్తారని గృహ కొనుగోలుదారులు ఆశిస్తున్నారు.
కాకపోతే, ప్రీలాంచుల్లో కొనేందుకు ఎక్కువ శాతం మంది బయ్యర్లు ముందుకు రావడం లేదు. ఒకవేళ, ఎవరైనా ప్రీలాంచుల్లో ఫ్లాట్లను బుక్ చేసినా రద్దు చేసుకుంటున్నారు. కొల్లూరులో ఒక ప్రాజెక్టులో అధిక శాతం స్థాయిలో ఫ్లాట్లను ముందస్తుగా బుక్ చేసిన ఛానెల్ పార్ట్‌నర్లు సైతం వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఏదీఏమైనా, మార్కెట్ సహకరించనంత కాలం ఎలాంటి బిల్డర్లయినా గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.