స్మాండో డెవలపర్‌పై టీజీ రెరా 10.70% జరిమానా విధింపు
The Telangana Real Estate Regulatory Authority (TG-RERA) has directed PBSR Developers Pvt. Ltd., the developer of the Smondo project in Gachibowli, to hand over a flat with the required Occupancy Certificate (OC), complete its registration and compensate the buyer for any reduction in the agreed undivided share of land (UDS).
ఆర్ఈజీ న్యూస్, హైదరాబాద్: ఫ్లాట్ కొన్న వారికి సకాలంలో ఫ్లాట్ అప్పగించకపోవడం, భూమిలో వాటా తగ్గించడం వంటి అంశాలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG-RERA) కీలక ఆదేశాల్ని జారీ చేసింది. గచ్చిబౌలిలోని స్మోండో ప్రాజెక్టును నిర్మించిన పీబీఎస్ఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు పేర్కొంది. 2026 అక్టోబర్ 5న జారీ చేసిన ఉత్తర్వుల్లో.. కొనుగోలుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC)తో పాటు ఫ్లాట్‌ను అప్పగించాలని, రిజిస్ట్రేషన్ చేయాలని, ఒప్పందంలో పేర్కొన్న భూమిలో వాటా (UDS) తగ్గితే ఆ తేడాకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఫ్లాట్ అప్పగించడంలో జరిగిన ఆలస్యానికి వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.
ఈ కేసు ఫ్లాట్ నంబర్ B-1109కు సంబంధించినది. 1,400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఫ్లాట్‌ను కొనుగోలుదారులు రూ.72.42 లక్షలకు కొనుగోలు చేశారు. 2017 జనవరిలో అమ్మకపు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం 2017 డిసెంబర్ 31లోగా ఫ్లాట్‌ను అప్పగించాలి. దీనికి ఆరు నెలల గడువు కలిపితే 2018 జూన్ 30 చివరి తేదీ అవుతుంది. అయినప్పటికీ ఫ్లాట్ అప్పగింత, రిజిస్ట్రేషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ప్రక్రియలు పూర్తి కాకపోవడంతో కొనుగోలుదారులు టీజీ-రెరాను ఆశ్రయించారు.
ఆలస్యానికి బిల్డర్ చెప్పిన కారణాలు
భారీ వర్షాలు, నిర్మాణ సామగ్రి సరఫరాలో ఇబ్బందులు, కార్మికుల కొరత, కొవిడ్ మహమ్మారి, తమ హోల్డింగ్ కంపెనీ పటేల్ ఇంజినీరింగ్ ఎదుర్కొన్న ఆర్థిక సమస్యల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని డెవలపర్ తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశామని కూడా పేర్కొంది. అయితే రోలింగ్ హిల్స్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్‌తో ఉన్న వివాదం కారణంగా సర్టిఫికెట్ ప్రక్రియ ప్రభావితమైందని తెలిపింది. కానీ, ఆలస్యానికి కారణాలుగా పేర్కొన్న ఈ పరిస్థితులను నిరూపించే ఆధారాలను డెవలపర్ సమర్పించలేదని టీజీ-రెరా అభిప్రాయపడింది.
కొనుగోలుదారుల డబ్బును మరో అవసరానికి మళ్లింపు
ఈ కేసులో ప్రాజెక్టు నిధుల వినియోగంపై కూడా టీజీ-రెరా కీలక వ్యాఖ్యలు చేసింది. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును తమ హోల్డింగ్ కంపెనీ ఎదుర్కొంటున్న నగదు కొరతను అధిగమించేందుకు మళ్లించినట్లు డెవలపర్ అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించింది. దీంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని పేర్కొంది. రెరా నిబంధనల ప్రకారం, కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో 70 శాతాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఉంచాలి. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి, నిర్మాణ ఖర్చులకే ఆ నిధులను వినియోగించాలి. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు టీజీ-రెరా గుర్తించింది.
ఒప్పందంలో ఉన్న ధరే ప్రామాణికం
ఫ్లాట్ ధర విషయంలోనూ టీజీ-రెరా స్పష్టత ఇచ్చింది. అమ్మకపు ఒప్పందంలో ధర రూ.72.42 లక్షలుగా ఉందని పేర్కొంది. అయితే ఆ తర్వాత ఇచ్చిన ఖాతాల వివరాల్లో రూ.81.35 లక్షలుగా చూపించడాన్ని ప్రస్తావించింది. ఒప్పందంలో అంగీకరించిన ధరను బిల్డర్ తనంతట తానుగా పెంచలేడని స్పష్టం చేసింది.
భూమిలో వాటా తగ్గిస్తే పరిహారం చెల్లించాలి
ఫ్లాట్ కొనుగోలుదారులకు సంబంధించి భూమిలో ఉండే అవిభాజ్య వాటా (Undivided Share of Land – UDS) విషయంలోనూ టీజీ-రెరా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులో అదనపు అంతస్తులు నిర్మించుకునే హక్కు ఉందనే కారణంతో, కొనుగోలుదారులకు ఒప్పందంలో హామీ ఇచ్చిన భూమి వాటాను బిల్డర్ ఏకపక్షంగా తగ్గించలేడని పేర్కొంది. ఒప్పందంలో చెప్పిన వాటాకు, వాస్తవంగా ఇచ్చిన వాటాకు మధ్య తేడా ఉంటే ఆ మొత్తాన్ని కొనుగోలుదారులకు చెల్లించాలని ఆదేశించింది.
కొనుగోలుదారులు ఏం గమనించాలి?
ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు బ్రోచర్లను లేదా తర్వాత ఇచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మకూడదు. అమ్మకపు ఒప్పందంలో ఫ్లాట్ అప్పగించే తేదీ, భూమిలో వాటా, చెల్లింపుల వివరాలు, అదనపు నిర్మాణ హక్కులు వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. బిల్డర్లు కూడా ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను అదే ప్రాజెక్టుకు వినియోగించడంతో పాటు, అవసరమైన ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఒప్పంద నిబంధనలను పాటించాలి.
టీజీ-రెరా ఆదేశాలు ఏమిటి?
కొనుగోలుదారులు చెల్లించిన మొత్తాలపై 2018 జూన్ 30 నుంచి వాస్తవంగా ఫ్లాట్ అప్పగించే వరకు ఏడాదికి 10.70 శాతం వడ్డీ చెల్లించాలని టీజీ-రెరా ఆదేశించింది. అయితే ఉత్తర్వుల్లో పేర్కొన్న కొవిడ్ కాలానికి సంబంధించిన మినహాయింపు వ్యవధులను లెక్కలోకి తీసుకోరాదు. అలాగే అవసరమైన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC), ఇతర సౌకర్యాలతో ఫ్లాట్‌ను అప్పగించి, నిర్ణీత గడువులో అమ్మకపు దస్తావేజును రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను పాటించకపోతే రెరా చట్టం ప్రకారం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0